ఎన్నటికీ అర్థం కానిది
జీవన గమనపు ప్రతిబింబం
చేసిన పనుల నిర్ధారణకు సాక్షిభూతం
అంతరంగ భావనలకు ఇంద్రియాలే మూలం
తూరుపున సిందూరమల్లే ఉదయించే సూర్యునల్లే
మదిగా మనోభావాలను నిరంతర తరంగాలై
వెలువరిస్తూ జీవన సంచారానికి బాటలు వేస్తుంది
వ్యక్తం చేయలేని ఎన్నో భావాలకు ప్రతిరూపం
ఉద్రేకాలను దాచుకునే హృదయాంతరాళం
ఆనందంగా ఉండే కాలం క్షణికం
వెన్నంటే వస్తుంది అననుకూల కాలం
ఆకర్షణ వికర్షణలకు నిలయం
ఉత్ధాన పతనాలకు ముఖ్య కారకం
ఆశక్తి నిరాశక్తుల నడుమ నిత్య ఘర్షణం
ఎటూ తేల్చుకోలేని నిర్ణయ సారం
సంతృప్తినొందని అంతరంగ భావం
బాధాతప్త తరంగమై హృదిని తాకగా
తత్తరపాటుకు గురైన మది కలవరం
కనురెప్పల వెనుక దాగిఉన్న కన్నీళ్ళకే తెలుసు
వీచేగాలికి పల్లవై ప్రాణం పోస్తుంది
వసంత కాలపు అనుభూతులను ఆస్వాదిస్తుంది
గ్రీష్మపు భావాలను రంగరించి
శిశిరపు ఉద్వేగాలను సమభావంతో అనుభవిస్తూ
తనువుకు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందిస్తుంది
ప్రతిక్షణం తన ఉనికిని తెలియచేస్తూనే ఉంటుంది.
-గంగాధర్ కొల్లేపర