ఎన్నాళ్ళని ఆటగా ఆడాలి
నిత్యవసరపు అంగడి సరుకులుగా
దొరకదు చదువంటేనని బజారుల్లో
ఎగబడి కొనడానికి…పద్దతుల ప్రాకారాలు
తెలియని నియమంగా వక్రించినదై…
వెచ్చించిన కాలం మా చదువును ఇసుక
తిన్నెలపై రాతలుగా చెరిపేస్తున్నవి
అందని దానికోసం కొమ్ముకాస్తే…
కోయబడిన మనస్సుకు కాలం ఆహారం
కాలేదని తెలుస్తున్నది….
ఆకలన్నది మరిచి చేసిన చెలిమితో
స్థానాన్ని అందుకోవాలని చదువుకొంటే
జారిపోయిన బతుకు చక్రం తిరిగిరాలేక
ఖచ్చగట్టిన కూటమి నేస్తాలు పోటై…
నలిగిన రూపాన్ని చిత్రం కాలేక చీకటి
సంధ్యలతో సాగనంపుతు పొద్దెరుగని
పాలసంచులుగా ఎండిపోతున్నా
మాబతుకకు….మేమే అనాధలమైనప్పుడు చదువాలనే ఆలోచనలకు తావేది…
చావరుపులు గావుకేకలతో…
తోడు నడిచిన మురికి కాలువలు…
నిలకడలేని బతుకులను బదులడగని
పాడుబడిన నివాసాలు…ఆచూకీ అడుగని
వంతెన క్రింద అమాయకంగా పెరుగుతు
చిరిగిన బొంతలతో విరిగిన మనస్సు
కుళ్ళిన రుచులకై బంధాలను తెంచుకొనేటి
పోరాటాలు…గబ్బుమాటల గుగ్గిలాన్ని
మింగుతు విడిపోయిన విస్తర్లతో మట్టి
కరిచిన అన్నపు ముద్దలతో చావని
ఆకలి కేకలు…
అతుకుల బతుకులతో చిగురించని
ఆశయాలు…గడిచిన సమయాలుగా
గుండె పగిలిన గాయాలతో ఆర్తనాధమవుతు
చేరదీసే ప్రేమతో మాకనే మమకారపు
గుడి తలుపులు తెరుచుకొనేదెప్పుడు…
అదుపు తప్పిన ఆకలి ఉద్యమంతో
నాస్తికత్వానికి దారవుతు…దిక్కుతోచని
పూటతో దగాపడ్డ కవణానికై వీధి కుక్కల
గోలతో పోటీపడుతు మా భాగవతపు
వింతలో చదువులేని ప్రావిణ్యాలను
ఎన్నాళ్ళని ఆటగా ఆడాలి….
-దేరంగుల భైరవ