ఎగరేసిన పైసా
ఆనాటి జీవితాలు….
పైటేసిన పల్లె వాతావరణంలో పలికిన
యాసతో తెలుగుధనమై బతుకుతు…
తలుపు తట్టిన ఆప్యాయతలు అమ్మమ్మ
నోటిన పండిన ఆకు వక్కలుగా తడిసిన
అనుభవాల జ్ఞాపకాలు ఊకుడు కథలుగా
ఉద్యమిస్తు దారులయ్యేవి…
లేత భానుడి బాల్యపు రంగును….
నొసటికి దిద్దుకొని ముఖమంత పసుపుతో
ముత్యమై చేతిగాజుల గలగలలతో
తూరుపున తెరిచిన ఆడపడుచుల
సంబరాలు…మట్టిని కలిపిన మమేకమై
మమతాను రాగాలు వెన్నెల్లో వికసించిన
కలువలుగా యిసుక తిన్నెలపై కట్టిన
బొమ్మరింటికై నడిచాయి…
నేటి జీవితం ఆలంబనలతో ఆరాటం…
పట్టణపు పడగల నీడన పరుగులతో
క్షణం ఆగితే మరణం…ఆ క్షణం సాగితే
జీవనం…ఒకరికి ఒకరు తెలియని
లోగుట్టవుతు పచ్చిక బయళ్ళను కోసే
పారిశ్రామిక విప్లవంతో దారుణమై…
ఎగరేసిన పైసా బొమ్మా బొరుసా తెలియని
బతుకులకు ఎంకి పాటలు ఎక్కడివో
వెన్నెల్లో యాచకుల తత్త్వాలు ఏదరికో…
భాష యాంత్రికమై అనురాగం తాత్కాలికమై
నాగరికథ నేర్పిన కౌఠిల్యంతో కప్పిన బుద్ది
అవినీతికి దాసోహం పలుకుతు…మేడల
అడుగున వెన్నెల దీపాన్ని వెలిగించుకోలేని
పేదవానిగా….దుర్వినియోగం తల రాతగా
మారిపోతు ఆ వెన్నెల పరిచిన దారులు
సుడిగుండాల సునామికి దారులవుతున్నవి
-దేరంగుల భైరవ