ఏది నిజం

ఏది నిజం

ఇంకో యాభై ఇవ్వండంటున్న ఆటో డ్రైవర్ వంక చురచుర చూసి ఓ ఇరవై చేతిలో పెట్టి లక్డీకాపూల్ స్టేషను మెట్లెక్కసాగాను. మెట్రో స్టేషను కు ఒకవైపు మెట్లు ఒకవైపు ఎస్కలేటర్, లిఫ్ట్ఇంకోవైపు ఉండటం వలన కొంత లాభం. నడిచే దూరం తగ్గుతుందనుకుంటే కొంత నష్టం. మెట్లెక్కాలి. తప్పదు.

అలా మెట్లెక్కుతుంటే ఓ పెద్దాయన రైలింగ్ పట్టుకొని ఆగి ఆగి ఎక్కుతున్నాడు. అయ్యయ్యో అనుకుంటూ చేయి పట్టుకొని నడిపించాను. చూస్తే కొంచెం అయోమయంగా కనిపించాడు. ఆయనెందుకో నా వెంటే వస్తుంటే చెప్పొద్దూ కాస్త ఇబ్బంది అనిపించింది.

ఫోన్ పే పని చేయకపోవటంతో టికెట్ కౌంటర్ వైపే వెళుతుంటే నా వెంటే వచ్చాడాయన.

కౌంటర్ లో 

మియాపూర్ కు టికెట్ అడిగాను. ఆ పెద్దాయన అలాగే నిలబడ్డాడు. కౌంటర్ కుర్రాడు అడుగుతున్నాడు టికెట్ ఎక్కడికి ఇమ్మంటారని.
తెలుగు అర్థం కాలేదని ఈసారి హిందీలో అడిగాడు.

“ఎల్. బి. నగర్” అని అలాగే నిలబడ్డాడు. “చాలీస్ రూపియా దీజియే” అని ఆయన వంక చూస్తున్నాడు కౌంటర్ కుర్రాడు. విసుక్కోకుండా అందరినీ ఓపికగా అడిగే ఆ కుర్రాడిని చూస్తే ముచ్చటేసింది.

నేనే నా మియాపూర్, ఆయన ఎల్. బి. నగర్ టికెట్లు తీసుకుని ఆయన టికెట్ కాయిన్ ఆ పెద్దాయనకిచ్చాను.

“మీరెక్కడి కెళ్ళాలి” అని హిందీ లో అడిగాను. “గ్లోబల్ హాస్పిటల్” అని నెమ్మదిగా చెప్పాడు. ఎల్.బి.నగర్ దగ్గరే కదా ఫరవాలేదు, వెళ్ళిపోగలడు అని అనుకుంటూ ఈసారి జాగ్రత్తగా ఎస్కలేటర్ ఎక్కించాను.

మరో మాట లేకుండా అమ్మయ్య అనుకుంటూ మియాపూర్ ప్లాట్ ఫాం వైపు కదిలాను. 

సీటు లో కూర్చున్నాక ఆలోచనలు చుట్టుముట్టాయి. టికెట్ కొనడానికే డబ్బులు లేని ఆ పెద్దాయన ఎవరై ఉండొచ్చు. చేతిలో ఓ వందయినా ఎందుకు పెట్టలేకపోయాను.

నా వెంటే వస్తున్నాడని ఎందుకంత అసహనంగా ఉన్నాను. ఆ ఎల్. బి. దగ్గర దిగి వెళ్ళగలడా.. ఆ మనిషి మతిమరుపు(alzheimers) వ్యాధితో ఇంట్లోంచి వచ్చేసుడంటాడా!

ఇలా నాపై నేను సంధించుకున్న ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గరా లేవు. చేతిలో కాస్త డబ్బులు పెట్టకపోవడం నా తప్పే అనుకుంటుంటే
పక్కన కూర్చున్నాయన పలకరించాడు.

“ఆ పెద్దతనికి టికెట్ మీరు కొనటం చూశాను. అలాంటివి చేయకండి సర్. వాళ్ళకి అదో దంథా. టికెట్ కొన్నారు కాబట్టి చేతిలో ఎంతో కొంత పెడతారన్న ధైర్యంతో వాళ్ళు మీలాంటి వాళ్ళని వెతుకుతుంటారు”

నా పక్కన కూర్చున్న అపరిచితుడు మాటలు నిజమో, అబద్ధమో కానీ ఆ క్షణాన నా అపరాధ భావన తగ్గించాడు అనుకుంటుండగా మియాపూర్, train terminates here అన్న అనౌన్సమెంట్ కు లేచాను

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *