ఎదమీద గాయం
నా చేతి ఏ ఒక్క గాజు పగిలిన
సహించనోడివి
ఇప్పుడీ ఖాళీ చేతుల్తో నీ ఫోటో ముందు దీపాన్ని వెలిగిస్తూనే ఉన్న
చిన్నోడికి పాలు పట్టిస్తుంటే
మెడలో పుస్తెల తాడుతో ఆడుకునేటోడు
మెడపై నిమురితూ తెల్ల మొహమేసి చూస్తున్నాడు
#వాడికేం తెలుసు?
వాటిని తీసికెళ్లి నువ్ కాడులో కాలిపోయావని
పెద్దోడు నాన్న అని పిలిచిన ప్రతీసారి
నా ఎదమీద గాయం నువ్వవుతున్నావ్
మన పెళ్లి నాటి చీర కట్టుకుని
తలమీంచి కొంగువేసుకుని
నీ చిత్ర పటం ముందు కూసుని
పెళ్లి నాటి మన వాగ్దానాలన్ని
వొట్టి మాటలే అని
వెక్కి వెక్కి ఎడవటమే నా పని
పిల్లలకి ఇది నాన్న ముద్ద అని తినిపిస్తూ
అప్పుడు నా ఎద మళ్ళీ గాయం అవుతుంటుంది
సాగిపోతున్న కాలం చక్రాల కింద పడి
నలిగిపోతు బతుకున్న
ఎవడేవడో జాలిగా చూస్తూ
పడక సుఖానికి
వేల అడుగులు దూరాన ఉన్నావని
వెలతో సైగ చేస్తూ రమ్మంటాడు
కట్టుకున్నోడు పోతే సమాజం ఒక రాబందు
నా పక్కన నువ్ ఉన్నావని నిద్రపోతున్న
కలలోకి రాగానే అర్ధరాత్రి మెలుకువ వచ్చి చూస్తా
అక్కడ టేబుల్ మీద
దీపం వెలుగుతూనే ఉంటది నీ ఫోటో ముందు
అప్పుడు నా దేహం కన్నీరవుతది
మన పిల్లల నవ్వుల్ని చూస్తున్నప్పుడు
నిన్ను వెతుక్కుని ఆనందిస్తా…..
-గురువర్ధన్ రెడ్డి