దూరం..దూరం..
పువ్వు వికసించినట్టు ఆలోచనలు వికసించాలి
నవ్వు పొంగినట్టు ఉత్సాహం ఉప్పొంగాలి!
చెట్టు నీడలా ఆదరించటం నేర్చుకోవాలి
కష్టాలను సహించే ఓర్పును అలవరుచుకోవాలి!
కబుర్లకేం ఎవరైనా చెబుతారన్నాడో మిత్రుడు
కబుర్లయితేనేం మనసును తేలికపరిస్తే!
పంతాలు పట్టింపులు వదిలేసి పలకరించమంటున్నాయి పూలన్నీ!
కాలం కౌగిలిలో వాలిపోతూ రాలిపోవాల్సిందే ఎవరైనా!
తాత్కాలిక ప్రయోజనాల ఒడిలో
కలివిడిగా ఉంటుంటాం
కలిసొస్తుందేమోనని !
చుట్టూ మనుషులతో చెట్టాపట్టాలేసుకుంటే
చెలిమి రాగం చెవిలో ప్రతిధ్వనిస్తుంటుంది!
కత్తులు నూరుకుంటే
ద్వేషాగ్ని కుంపట్లు మండుతుంటాయి!
నువు నడిచే బాటకు న్యాయనిర్ణేతవు నువ్వే
మళ్ళీ పూల పరిమళం
ముక్కు పుటాలకు సోకుతు ముసిముసిగా చెప్పింది!
మసికానివ్వద్దన్ని జీవితాన్ని
ద్వేషాగ్ని కుంపటికి దూరంగా ఉంచాను!
-సి.యస్.రాంబాబు