*దొరుకని దొంగలు*
రాక రాక వచ్చిన
ఉద్యోగ నోటిఫికేషన్లు
ఎన్నో ఏండ్లు
ఎదురు సూడంగ సూడంగ
పేపర్ల
పెద్ద పెద్ద అక్షరాలతో
ఉద్యోగాల జాతర
నోటిఫికేషన్ రాంగనే
అందరి మొఖాలల్ల
ఉద్యోగమంచినంత సంబురం
ఏదో తెలియని పులకరింత
ఎవ్వల ఎల్లుమానుబట్టి
వాళ్ళ ప్రయత్నం
కొందరు పట్నంల
కొందరు ఇంట్ల
మరికొందరు ఆన్లైన్ల
అప్పుల అప్పు
ఎంత కష్టమైన ఓర్సుకోవాలె
నౌకరి కొట్టాలె గంతే
పెళ్ళికి నౌకరికి ముడి
కొందరు
అవ్వయ్యలకు దూరంగా
భర్తోకాడ భార్యోకాడ
పిల్లలు అనాథలుగా
పండుగలను పబ్బాలను మరిసి
పిల్లలు ఏం జేత్తారంటే
సర్కారు కొలువుకు తైయారైతాండ్రని
ఈసారన్న రావాలని
పైకి చూస్తూ
ఏ ఆధారం లేనోళ్ళకు
సర్కారు నౌకరే ఆధారం
మధ్యతరగతి సదువులకు
సాతనైంది అదే
ఎవలకు నౌకరి రావాల్నో
ముందే ఖాయమైతది
నౌకరత్తదన్న ఆశతో
అమాయక జనం
త్యాగాలు ఒకరివి
భోగాలు మరొకరివి
ఎన్ని సూత్తలేము
దొంగే దొంగ దొంగ అని అరిసినట్టు
పెద్ద పెద్దోళ్ళ ఎరలకు
చిన్న చిన్న ఉద్యోగులు బలి
నిజాలు బయటపడకుండా
సాగుతనే ఉంటది ఇన్వెష్టిగేషన్
మొదటికే మోసంవస్తే
ఏం జెయ్యాల్నో వాళ్ళకెరుకే
ఎవల మీడియా వాళ్ళకున్నది
ఊదరగొట్టడానికి
ఎలాగూ ఉన్నరు
సోషల్ మీడియా బానిసలు
ద్రోహులకు సరైన శిక్ష పడ్డదని
అధికారులకు ప్రశంసల వెల్లువ
బానిస భావన ఉండనే ఉండె
ఎవడుజేసిన ఖర్మ వాడనుభవిస్తడని
భరించడం తప్ప
బరిగె పట్టిందెప్పుడు
ఎల్లుమాను -వీలు
కొలువు -ఉద్యోగం
ఖాయమగు – నిర్ణయం
బరిగె – కట్టె
-గురువర్ధన్ రెడ్డి