దిక్సూచి
ఈరోజున విశాఖజిల్లాలో జన్మించెను ఓ చిన్నవాడు
ఎదిగి ఒదిగి మెలిగినాడు ఆ కోరమీసపు చిన్నోడు
తల ఒంచుకుపోతాననక తల ఎత్తి ప్రశ్నించెనతడు
శరములవలె సంధించెను రచనల ప్రశ్నలను
ఆయుధముగ మలచుకొనెను సాహిత్యమును
ఉత్తేజమును నింపెను దేశమంటె మనుషులంటూ
ఒట్టిమాటలు కట్టిపెట్టండంటూ నుడివెను
గట్టి మేలును తలపెట్టండని చాటెను
సంఘములో దాగున్న అరాచక సంస్కృతులకి ఎదురుతిరిగి
ఆడవారికి అండదండగా నిలిచిన ధీరుడు
కన్యాశుల్కమను దురాచారమును రూపుమాపగ
రచన చేసి చైతన్యపరచెను స్త్రీ జనోద్ధారకుడై
ముత్యాల సరాల ఛందమును సృష్టించినారు
పుత్తడి బొమ్మ పూర్ణమ్మను తీర్చిదిద్దుతూ
సమాజాన స్త్రీకి స్వేచ్ఛకావలెననెను
కోటలు పేటలు కూలిపోవగ మిగిలిపోయెను మంచిచెడులని చాటెను
ఏళ్ళు కరగిపోయినా నేటికీ నిలిచెను కన్యాశుల్కము
ఈనాటికీ పాఠ్యాంశమాయెను
ఆంగ్లమాధ్యమమున
అడుగుజాడలలోన గురజాడ నిలిచినాడు
సాహితీలోకమున ఛత్రముగా నిలిచినాడు
ఆనాటికీ…నేటికీ…భవితకీ… దిక్సూచి అతడు
మన గురజాడ కాక ఇంకెవ్వరతడు …….
– ఉమామహేశ్వరి యాళ్ళ