దిగులు కావిళ్ళు
అంబర సంబరం
మనసుకు చుట్టిన పీతాంబరం
శూన్యమైతేనేం
దిగులు శూలాలకు
విష్ణుచక్రం
దిగులు కావిళ్ళను దింపి
భయం గుప్పిళ్ళను తెరచి
అభయ జలాన్ని వంపి
నిరాశల శిశిరాన్ని వసంతంగ మార్చు
మేరు పర్వతంలాంటి ధైర్యాన్ని
నేరుగా గుండెలో దింపావా
నీ నుంచి నిన్ను వేరు చేసేవారెవరు
నీ నీడే నీకు రక్ష కావొచ్చు
కలిసిరాని కాలానికి దయకలగాలంటే
పోరాటం సాగాల్సిందే
వెలుగు తోటగా నువు మారాల్సిందే
జీవిత పాఠాలు హుషారుగా సాగవు
నేర్చుకునే దారులు సాఫీగా ఉండవు
సంకల్పాన్ని దాచుకున్నావో
ఆశను దోచుకోరెవ్వరు
– సి. యస్. రాంబాబు