ధ్వంస రచన
పక్షి పాటలో
ప్రజల పాట్లను దాద్దామనే
ఓ వెర్రి ప్రయత్నమేదో చేస్తున్నాను!
బాల భానుడి వెలుగులో
భజంత్రీ చప్పుడొకటి
చెప్పుడు మాటలా తొలిచేస్తోంది!
తొలిమంచు స్పర్శలో
తెగిపోతూ జీవితపు అంచు ఒకటి!
మబ్బు చాటు చంద్రుడిలా
మనసు మసకేసింది
తుంపుకుంటూ జీవితాన్ని
కష్టాల సరస్సులో ముంచుతోంది!
నవ్వుకుంటూ చంద్రవంక
కాస్త చూడవా నావంక
అంటోంది!
కరెన్సీ ఎలాగూ లేదు
వెన్నెల కిరణమేదయినా
అప్పిస్తాడేమో నెలవంక!
వంక పెట్టలేమంటూ ఒకపక్క
అంతా వంకరే అంటూ మరోపక్క!
తలపోతల జీవితం
పక్కదారి పట్టకుండా
నిండుకుండలా
నిండు సరస్సులా జీవితం సాగేనా!
నాతో నేను చేసే యుద్ధం
అద్దం పై మరకలా తొలిగేనా!
ప్రశ్న శరమై దూసుకొస్తోంది
ఆశే ఎండమావై
ఎండిన మానులా
వెలవెల బోతుంటే
తెల్లబోతూ సమాధానం
మృదంగ ధ్వానమై
ధ్వంస రచన చేస్తోంది!
– సి. యస్ రాంబాబు