ధరణి నీకో వందనం

ధరణి నీకో వందనం

 

అదొక చిన్న పల్లెటూరు, ఊర్లో అన్ని కులాల,మతాల వాళ్ళు ఉన్నారు. కాని ఊరి చివర అందరికి దూరంగా చిన్న గుడిసెలో ఉంటుంది లక్ష్మి. ఆమె అక్కడే ఉండాలి, అదే ఆమె ఇల్లు, ఆమె ఊర్లోకి రాకూడదు. కాని చీకటి అయితే చాలు ఆమె ఇంటి దగ్గరికి కులం, మతం అని చూడకుండా అందరూ వస్తారు.

ఆమె ఇచ్చే సుఖo కోసం, ఆమె ఇచ్చే సంతోషం కోసం. ఇంట్లో ఉన్న పెళ్ళాలు చాలక ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళగానే స్నానాలు చేసి పాడుకుంటారు, మొగుణ్ణి ఏమి అనలేని ఆదర్శ గృహిణులు లక్ష్మి ని తిట్టుకుంటూ ఉంటారు.

ఇంతకి లక్ష్మి అలా ఒంటరిగా , ఊరికి దూరంగా ఎందుకు ఉంటుంది. అసలు లక్ష్మి ఎవరూ ఆమెను సుఖానికి వాడుకున్న వారు ఊర్లోకి ఎందుకు రానివ్వరూ అంటే దానికో కారణం ఉంది.

కొన్నాళ్ళ క్రితం ఒకావిడ ఆ ఊరికి బ్రతకడానికి వచ్చింది. ఆమె పేరు అదేమ్మ అని చెప్పుకుంది, భర్త తాగి తాగి సచ్చిపోయాడు అయ్యా అని చెప్పి ఏదైనా పని ఇప్పించమని వేడుకుంది, ఆ ఉరివాళ్ళ కళ్ళు అదేమ్మ అందం పై పడ్డాయి. ఇంకేముంది ఎలాంటి పని ఉన్నా అదేమ్మను పిలిచేవారు, బట్టలు ఉతకడం దగ్గరి నుంచి పశువులను కాయడం, ఇళ్ళలో అంట్లు తోమడం లాంటివన్నీ చేసేది, అందుకు గానూ ఒకరింట్లో అన్నం పెడితే,మరొకరి ఇంట్లో పాత బట్టలు ఇచ్చేవారు. అలా అదేమ్మకు ఒక గుడిసెను కూడా ఏర్పాటు చేసారు ఉరందరూ కలిసి.

ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఊరి పెద్ద ఒక రోజు రాత్రి తనింటికి వచ్చి తలుపు తట్టాడు, అదేమ్మ తలుపు తీసి ఏంటయ్యా ఏదైనా పనా అంటూ అడిగితే నీతోనే నా పని అంటూ చేయి పట్టుకున్నాడు, అదేమ్మ వద్దయ్య నేను అలాంటి దాన్ని కాదు అంటుంటే ఊర్లో ఉండాలి అంటే నేను చెప్పినట్టు వినాలి, లేదంటే రేపే వెళ్ళిపో అన్నాడు, అలవాటు అయిన ఊరు తిండికి, బట్టకు లోటు లేదు, పిల్ల కడుపునిండా తింటుంది అని అనుకున్న అదేమ్మ అతనికి లొంగిపోయింది.

అదేమ్మ కూతురు లక్ష్మి అప్పటికి పదేళ్ళ పిల్ల, ఊరి పెద్ద విషయం తెల్సిన మిగిలిన మగాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు అదేమ్మ ను అదే భయపెట్టి వాడుకున్నారు, అదేమ్మ కు ఇళ్ళలో పని కూడా తగ్గించారు,దాంతో అదేమ్మ ఇదేదో బాగుంది అనుకుంది కానీ ఆమె మనసు పిల్ల జీవితం ఎలా అనే మనోవ్యాధి పట్టుకోవడం వల్ల , లక్ష్మిని దూరంగా పంపాలి అనుకుంది, కానీ చుట్టాలు, బంధువులు ఎవరూ లేకపోవడం తో ఎక్కడికి పంపలేదు కాబట్టి, ఏమి చేయాలో తెలియక మనోవ్యాధి తో మంచం పట్టింది.

అప్పటికే లక్ష్మి పెద్దది అయ్యింది,ఆ విషయం తెలిస్తే ఊర్లోని వారు ఉరుకోరని తెలియకుండా ఉండడానికి గానూ ఎన్నో ప్రయత్నాలు చేసినా అదేమ్మకు చుక్కెదురే అయ్యింది. లక్ష్మి పెద్దది అయ్యిందని మగాళ్ళ కళ్ళు కనిపెట్టాయి. ఇక అదేమ్మ ను సతాయించడం మొదలు పెట్టారు, అదేమ్మ నీకు చేత కావడం లేదు, పనీ కి లక్ష్మి ని అదే నీ కూతురు ను పనీ కి పంపు అన్నారు.

వాళ్ళ అంతరార్ధం తెలిసిన అదేమ్మ ఫరవాలేదమ్మ అంటూ తానె వెళ్ళసాగింది. ఇక ఇలా అయితే లాభం లేదనుకున్న మగాళ్ళు, అదేమ్మ ఇంటికి కలిసి కట్టుగా వచ్చారు ఓ రాత్రి. అందరూ ఒకేసారి రావడం తో అదేమ్మ భయపడి ఏంటయ్యా ఇలా వచ్చారు అంటూ భయంగా అడిగింది.

అప్పటికే లక్ష్మి కి కొంత వయసు రావడం తో తల్లి చేసేది అర్ధం అయ్యేది, అది నచ్చేది కాదు లక్ష్మి కి అయినా తామున్న పరిస్థితి కి ఏమి చేయలేదని తెల్సి, అన్నిటికి సిద్దపడింది. ఇక వచ్చిన వాళ్ళు
అదేమ్మ తో చూడు అదేమ్మ ఇక నీకు వయసు అయిపోయింది, నువ్వు, నీ కూతురు బాగుండాలి అంటే నీ ఉతురు మాకు కావాలి, లేదంటే మీరు ఈ ఉరునుండి వెళ్ళాల్సిందే అంటూ తేల్చి చెప్పారు.
అయ్యా అలా అనకండి అయ్యా , చిన్న పిల్ల అయ్యా అంటూ వేడుకుంది అదేమ్మ , మంచం పట్టిన నువ్వు పోయాక నీ కూతురు బతుకు ఇంతే, ఇంతకన్నా మంచి బతుకు ఉండదు, మా ఊరు కు నువ్వేలా వచ్చావో అలాగే నీ కూతురు కూడా ఇంకో ఊరికి వెళ్తుంది, అక్కడ ఎవరైనా ఏదైనా చేసినా దిక్కులేదు, కాబట్టి అలవాటు అయిన ఊరు కాబట్టి దిన్ని మేమే ఉంచుకుంటాం, దీని మంచి చెడ్డలు అన్ని మేమే చూసుకుంటాం నువ్వేం దిగులు పెట్టుకోకు అన్నారు అందరూ.

వారందరూ చెప్పేది మంచికే అనిపించిన అదేమ్మ కూతురి వైపు చూసింది, అపప్తికే పదహారు వెళ్లి పదిహేడు లోకి వచ్చిన లక్ష్మి కి ఆన్ని అర్ధం అవుతూనే ఉన్నాయి, తనకు కూడా నిజాలు ఏమిటో తెలుసు కాబట్టి లక్ష్మి తల దించుకుంది.

కానీ అదేమ్మ అందరితో ఒక మాట అంది. మీరంతా అలా అనుకుంటుంటే నేనేం అనగలను బాబు, కాని ఒకే ఒక్క కోరిక అంది అదేమ్మ , దాంతో అందరూ మొహాలు చూసుకుని ఏంటి అది అన్నారు అందరూ ఒకేసారి, ఏమి లేదయ్యా నా కూతురు చదువుకోవాలి అలా మీరు చదివిస్తారు అంటే నేను దీనికి ఒప్పుకుంటాను అంది అదేమ్మ. ఓస్ అంతేనా మన ఊర్లో పదో తరగతి వరకు ఉంది కదా , అక్కడే చదువుకుంటుంది అన్నారు అందరూ అది కాదయ్యా మమల్ని ఆ బళ్లోకి రానివ్వరు కదా , మరి ఎలా అంది అదేమ్మ, మనం అనుకుంటే అదెంత పని అన్నారు అందరూ.

మీకు దణ్ణాలు అయ్యా అయితే ఒకటి అయ్యా దాని సదువు అయ్యేదాకా మీ చేతులు దాని పై పడొద్దు అదొక్కటే నా కోరిక,అంది .అదెలా కుదురుతుంది మకిప్పుడే కావాలి అన్నారు అంతా, లేదయ్యా అది చాలా పసిది, మీ బిడ్డ లాంటిది, ఇంకొన్నాళ్ళు అయితే మంచిగా అవుతుంది అప్పుడు మీ ఇష్టం అయ్యా అంది అదేమ్మ, సరే గాని ముందు బోణి నాది అన్నాడు ప్రెసిడెంటు, ఇక మిగిలిన వాళ్ళు ఏమి అనకుండా సరే అన్నట్టు తలూపారు, ఇక అందరూ అదేమ్మ కోరికను మన్నించి లక్ష్మిని బడి లో చేర్చారు.

బళ్ళో చేరిన లక్ష్మి మంచిగా మనసు పెట్టి చదువుకుంటూనే ఊర్లో ఉన్న హాస్పిటల్ లో ఉన్న నర్స్ ద్వారా అన్ని విషయాలు నేర్చుకుంది. కాని అదేమ్మ, ఆమె కూతురు ఒప్పందం తెలిసిన ఊరి ఆడవాళ్లు అంతా ఏకమై వచ్చి, ఏంటి ఇన్ని రోజులు పోనిలే అని ఉరుకుంటుంటే ఇప్పుడు నీ కూతుర్ని తాయారు చేసి, మా మగాళ్ళను వల్లో వేసుకోవాలని చూస్తావా , ఒక్కసారి దాన్ని మరిగారు అంటే ఇక మమల్ని కనతరా అంటూ గొడవకు దిగారు. వారికేం చెప్పాలో తెలియక అదేమ్మ అమ్మ నా కడుపు నింపారు, నాకు బట్టలు ఇచ్చారు , మీ కాపురాలు కుల్చేంతటి దాన్ని కాదు. నా బిడ్డ చదువు అవ్వగానే వెళ్తాము అంటూ వారి కాళ్ళ పై పడింది.

వాళ్ళు కూడా ఆలోచించారు, ఎలగూ మాట తీసుకున్నారు అదేమ్మ దగ్గరికి రాము అనే విషయం తెలిసిన వాళ్ళు పదో తరగతి అయ్యే వరకు వీళ్ళకు ముసలితనం రాకపోతుందా , ఇంకా శక్తి ఉండదు అనే ఆలోచనతోనూ , పాపం పసిపిల్ల దానికివేం తెలియదు కదా, పోనీ లే ఇలా అయినా కొన్నాళ్ళు అదేమ్మను, పిల్లను మర్చిపోతారు అనుకుని, సరే అదేమ్మ నీ కూతురు పై జాలి తో వెళ్తున్నాం, నువ్వు పిల్ల పదో తరగతి పరిక్షలు అవ్వగానే వెళ్లిపోవాలి అన్నారు , అదే మహా భాగ్యం తల్లి అని చేతులు జోడించింది అదేమ్మ, అందరూ వెళ్ళిపోయారు.

కానీ అదేమ్మను అందరూ ఉపయోగించుకున్నా , అటూ వైపు కన్నెత్తి చూడని ఒకే ఒక్క వ్యక్తి రామన్న పంతులు. అతను నిష్ఠగా ఉండే వ్యక్తి, తన పనేదో తానూ చేసుకుంటూ, కులాలను అసహ్యించుకుంటూ , ఎవరి గాలి సోకినా వెంటనే వెళ్లి బావి లోని నీటితో స్నానం చేసేవాడు, పూజకు ఎవరి ఇంటికి వెళ్ళినా పచ్చి గంగ కూడా ముట్టుకోడు, ఇంటికి వచ్చాకే స్నానం చేసి ,అప్పుడు భోజనం చేస్తాడు, తప్ప కనీసం వాళ్ళు ఇచ్చిన ,పండో, కాయో ఏది ముట్టుకోడు. అలాంటి వాడు అదేమ్మ వచ్చినప్పుడు ఎంతో గొడవ పడ్డాడు, ఏ కులమో మతమో తెలియని అలాగా దాన్ని ఊర్లో ఎలా పెట్టుకుంటారు అంటూ అందరూ, సర్ది చెప్పి, మీ ఇంటి వైపు మాత్రం రానివ్వము అని ఆనడం తో ఇంకేం అనలేకపోయాడు రామన్న పంతులు.

కాలం, యవ్వనం ఎవరి కోసం ఆగదు, కొన్నాళ్ళకు అదేమ్మ చనిపోయింది, లక్ష్మి ఒంటరి అయ్యింది. అయినా మొక్కవోని ధైర్యంతో పరీక్షకు వెళ్ళింది, అప్పుడు మాట ఇచ్చిన వారు కూడా కాలగర్భం లో కలిసిపోయారు కొందరు, మరి కొందరు లేవలేని స్థితికి వచ్చారు. పదో తరగతి పరిక్షలు అయ్యాక ఎక్కడ వస్తారో అని భయపడుతున్న లక్ష్మి దగ్గరికి ఎవరూ రాలేదు, దానికి సంతోషించిన లక్ష్మి ఎప్పటిలా ఆసుపత్రికి వెళ్లి నర్స్ దగ్గర కొంత విద్య నేర్చుకుని ఇంటికి బయలు దేరింది. బాగా ఎండాకాలం కావడం తో గబగబా నడుస్తున్నారు లక్ష్మి, నర్స్ ఇద్దరూ, ఊరు చివర్లో బస్ ఆగుతుంది , పండగ కావడం వల్ల నర్స్ సగం రోజు సెలవు పెట్టి వెళ్తుంటే తోడూ గా లక్ష్మి కూడా వస్తుంది.

ఎదురుగా సైకిల్ పై రామన్న పంతులు వస్తున్నాడు, పండగ కావడం , అందులోనూ ఆ ఊరి చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల అన్నిటికి ఆయనే వెళ్తుంటారు, కాబట్టి పొద్దున్న ఎప్పుడో ఇంట్లో నుండి కాఫీ తాగిన ఆయన అలసిపోయి, నీరసంగా సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు, పైన ఎండ బాగా కాస్తుంది, రామన్న పంతులుకు గొంతు తడారిపోతుంది, పైగా చక్కర వ్యాధి కూడా ఉండడం తో ఆయన తొక్క లేక తోక్కలేక చాలా నీరసంగా అది చూస్తున్న నర్స్ అదిగో పంతులు గారు వస్తున్నారు నువ్వు జరుగు అంది లక్ష్మి తో, ఇంతలో గబుక్కున సైకిల్ తో పాటూ పడిపోయాడు రామన్న పంతులు.

అయ్యయో పంతులు గారూ పడిపోయారు అంటూ గబుక్కున వెళ్లి పట్టుకుంది లక్ష్మి , అయ్యో లక్ష్మి ఏం చేస్తున్నావో తెల్సా వారికీ తెలిస్తే నువ్వీ ఊర్లో లేకుండా చేస్తారు అంది నర్స్. చేస్తే చేయని అక్కా , ఒక మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ నేను కుర్చోలేను, అలాగని నాకేదో అవుతుందని అనుకోను, నువ్వు నర్స్ వె కదా నీకు తెలియడ, మనిషి ఆపదలో ఉంటె కులం, మతం, జాతి ఇవ్వన్ని చూడకుండా వైద్యం చేయాలనీ అంటూ సాయం పట్టు అక్కా అని రామన్న పంతులుని ఇద్దరూ కలిసి లక్ష్మి ఇంటి వైపు తీసుకుని వెళ్ళారు.

లక్ష్మి నులక మంచం వలచి రామన్న పంతుల్ని పడుకోబెట్టి చల్లని నీళ్ళలో గుడ్డని తడిపి ఒళ్ళంతా తుడిచింది, ఆ పై లోపలి కి వెళ్లి గ్లాసుడు మజ్జిగ బాగా చిలికి తెచ్చి, అతన్ని ఒళ్లో కి తీసుకుని మెల్లి మెల్లిగా తాగిస్తూ ఉంటె ఈ లోపు నర్స్ బీపి, షుగర్ లెవల్స్ చూసి, షుగర్ ఎక్కువగా ఉందని ఒక మాత్రను ఇచ్చింది, అలాగే బి,పి కంట్రోల్ అవ్వడానికి ఇంజెక్షన్ చేయబోతుంటే అక్కా ఏం చేస్తున్నావు అంది లక్ష్మి ఇంజక్షన్ అంది నర్స్, అక్కా ఆయన తిన్నారో లేదో , ఇంజక్షన్ ఇస్తే తట్టుకుంటారో లేదో కాసేపు అగు అంటూ వెళ్ళి అన్నం లో మజ్జిగ కలిపి తెచ్చి మెల్లిగా అతని నోట్లో పెట్టింది.

అతనికి సృహ లేదు కాని దాహం తో, ఆకలితో ఉన్నాడు కాబట్టి కొంచం కొంచంగా మింగుతున్నాడు, అలా తినిపించాక మళ్ళి బీపి చెక్ చేసింది, ఈ సారి బీపి నార్మల్ గా ఉండేసరికి ఇంజక్షన్ ఇవ్వలేదు. అలా వారిద్దరూ చన్నీళ్ళతో అతని ఒంటిని తుడుస్తూనే ఉన్నారు, కాసేపటికి లక్ష్మి ఈ విషయం తెలిస్తే నిన్ను ఈ ఉర్లోంచి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తావు అంటూ అడిగింది నర్స్.

అక్కా దేవుడు నన్ను పుట్టించాడు అంటే నా వల్ల ఎవరికో ఎదో అవసరం ఉందనే కదా, ఏమో ముందు ముందు ఏమి జరుగుతుందో ఏమి తెలియదు నాకూ, ఒకవేళ వెళ్ళమంటే మాత్రం వెళ్తా , ఎక్కడో ఒక చోటికి , ప్రపంచం పెద్దది అని చాలా పుస్తకాల్లో చదివాను, ఎక్కడో ఒక చోట ఉండలేనా , నన్ను నేను కాపాడుకోలేనా అంటూ చెప్పింది లక్ష్మి. ఆమె మాటలు విన్న నర్స్ కన్నీళ్ళతో లక్ష్మి నీకు ధైర్యం చాలా ఉంది. మానవత్వం, జాలి కూడా ఉన్నాయి, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలవు అంది.

అప్పటికే తెలివి వచ్చిన రామన్న పంతులు కళ్ళు తెరిచి చుట్టూ చూసాడు, తానేక్కడ ఉన్నాడో లక్ష్మి ని చూసాక అర్ధమయ్యి, చటుక్కున లేచి, నిల్చుని చుట్టూ చూడగానే అన్నం గిన్నె, మజ్జిగ , చల్లని గుడ్డ అన్ని కనిపించాయి.పంతులు గారు లేవడం చూసినా నర్స్ అయ్యా అది అని జరిగింది చెప్తున్నా వినకుండా గబగబా బయటకు వెళ్లి, సైకిల్ పై తానింటి వైపు వెళ్ళిపోయాడు.

అతను అలా వెళ్ళాడం చూసినా నర్స్ లక్ష్మి భుజం తట్టి నేను వెళ్తున్నా , ఏమి జరిగినా భయపడకు అంది. సరే అక్కా అంటూ నర్స్ ని పంపేసింది లక్ష్మి, ఉన్నదేదో తిని, పుస్తకం పట్టుకుని కుర్చుని చదివినంత సేపు చదువుకుని తర్వాత ఎప్పటిలా పడుకుంది లక్ష్మి.

***
ఎప్పటిలా తెల్లారింది, మేళ తాళాలు వినిపిస్తున్నాయి ఎక్కడి నుండో , ఆ శభ్దాలకు మెలకువ వచ్చిన లక్ష్మి, ఏంటి ఈ సమయం లో నాకు తెలియకుండా ఎవరింట్లో ఏదైనా పండగ ఉంటె పిలుస్తారు కదా, మరెంటివి అనుకుంటూనే కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వచ్చింది. ఆ మేళ తాళాలు తమ గుడిసె వైపే రావడం గమనిస్తూ ఇంకా ఆశ్చర్య పోతుంది.

ఆ మేళ తాళల మధ్యలో రామన్న పంతులు గారూ, కొందరు ఊరి పెద్దలు, ఎన్నడూ చూడని పంతులు గారి భార్యా ఉన్నారు, ఆ మేళతాళాలు వచ్చి సరిగ్గా లక్ష్మి ఇంటి ముందు ఆగాయి. తనింటి ముందు ఆగడం తో తత్తర పడిన లక్ష్మి , ఏంటయ్యా ఇది, నేనేమైనా తప్పు చేసానా, నన్ను ఉర్లోంచి పంపిస్తారా అంటూ కంగారుగా అడిగింది.

దానికి రామన్న పంతులు భార్య దగ్గర కి వచ్చి లక్ష్మి ని దగ్గరకు తిసుకోబోతుంటే వద్దమ్మ , నన్ను తాకకూడదు అంది. దానికి రామన్న పంతులు భార్య అలాగే నిన్న నువ్వు అనుకుని ఉంటె ఈ పాటికి నా తాళి తెగిపోయేది కదమ్మా. నా పసుపు, కుంకుమలు నిలబెట్టిన నువ్వు నాకు దేవతతో సమానం, ఇన్నాళ్ళు ఎవరో ఎదో అన్నారని నిష్ఠ అంటూ కూర్చున్నాము, కానీ అవతలి మనిషి ప్రమాదం లో ఉంటె సాయం చేసే గొప్ప గుణం నీలో ఉందమ్మ.

అందుకే నిన్ను మా కూతురిగా దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నాము ,ఇక నుండి నువ్వు మా కూతురివే తల్లి అంటుంటే రామన్న పంతులు వచ్చి, నిజంగా తల్లి మానవత్వం బతికి ఉందంటే నీలాంటి కొందరు ఉండబట్టే అంటూ మహలక్ష్మి పేరు పెట్టుకున్నావు, ఇక నుండి నువ్వు మా ఇంటి మహలక్ష్మి వి అంటూ అక్కున చేర్చుకున్నారు.

కొందరు అడ్డు చెప్పబోయినా రామన్న పంతులు నా నిర్ణయం లో మార్పు లేదు, నాకు ఈ ఊరు కాకపోతే మరో ఊరు ఉందని అనడం తో అందరి నోళ్ళు మూతలు పడ్డాయి, ఇంకొందరు మాత్రం దాన్ని స్వాగతిస్తున్నట్టుగా చప్పట్లు కొట్టారు. లక్ష్మి ఆనందం అలుగులు పారింది, వెంటనే వెళ్లి సిస్టర్ ను కౌగిలించుకుంది. తను కూడా ఆమెకు సంతోషం వ్యక్తం చేసింది. అలా ఆనందంగా స్వచ్చమైన బురద గుంట లో పూసిన తామర లా లక్ష్మి పంతులు ఇంట అడుగు పెట్టింది.

కొన్ని పరిస్థితుల వల్ల అదేమ్మ పాడుపని చేసినా సహనం తో, ఓపికతో అందర్నీ ఒప్పించి తన కూతురు తనలా చేయకుండా కాపాడుకుంది, మానవత్వాన్ని గుర్తించిన పంతులు లక్ష్మిని కూతురిలా భావించాడు, తన ప్రాణాలు కాపాడినందుకు గానూ, తన భర్త ప్రాణాలు కాపాడినందుకు గానూ లక్ష్మిని తమ ఇంటి పిల్లగా చేసుకున్నారు వాళ్ళు…

మానవత్వం, కులం పట్టింపులతో గెలవలేమని చెప్పడమే ఈ కథ సారాంశం.

 

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *