ధరణి కో లేఖ

ధరణి కో లేఖ

అమ్మ మమ్మల్ని భరిస్తూ ,మా బరువంతా మోస్తూ, మేము నిన్ను ఎంత బాధ పెట్టినా సహనం గా ఉంటూ ,మా తప్పులన్నీ కాస్తూ, మేము చేసే పిచ్చి పిచ్చి పనులను చిరునవ్వుతో చూస్తూ ,కర్రలతో బాధిస్తున్నా, మేకులతో నీ తలను చిధ్రం చేస్తున్నా ,

నీ పై బరువు నుంచి నిన్ను అణగ ద్రొక్కుతున్నా, పాపాలు చేస్తూ నీలో కలుపుతున్నా , హత్యలు మానభంగాలు నీ ముందే చేస్తూ, ఆ వికృత చేష్టలు గమనిస్తున్నా , చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తూ చంపుతున్నా , రూపాయికి, వందకు మర్డర్లు జరుగుతున్నా,  ఈ పాప భారాన్ని నీ తలపై మోస్తూ, ఓపికతో, సహనముతో, మంచితనంతో, ఎవరినీ నొప్పించకుండా భరిస్తున్న నిన్ను ఏమనాలి తల్లి.

తల్లిగా పిల్లల్ని క్షమిస్తూ, క్షమయా ధరిత్రి  అన్న పేరును సార్థకం చేసుకుంటూ , ఇన్ని కోట్ల మంది పాపాలను చూస్తూ కూడా ఎంత సహనంగా ఉంటున్నావమ్మా. నువ్వే గనక ఒకసారి కోపానికి వస్తే మేము తట్టుకోగలమా,  మా వల్ల అవుతుందా తల్లి,  మమ్మల్ని నీ పిల్లలుగా భావించి  క్షమిస్తూ, ఓపికతో మమ్మల్ని భరించడం నీ గోప్పెనమ్మా .

మేము చేస్తున్న ఒక్కొక్క పాపం తలచుకుంటే మా (నా)కే బాధగా ఉంది అమ్మ, అయినా నువ్వు భరిస్తున్నావు  చూడు, నీ ఓపిక, సహనానికి, మా శతసహస్ర వందనాలు అమ్మ , ఇన్ని పాపాలు చేస్తున్నా చట్టం, న్యాయాన్ని తమ డబ్బుతో కొంటూ, తాము తప్పు చేయలేదన్నట్టు గా, దర్జాగా తిరిగే వారిని చూస్తున్న కూడా నువ్వు ఏమీ అనలేక పోతున్నావు .

ఎందుకంటే మేము మీ పిల్లలని నువ్వు భావించావు కాబట్టి. ఇవన్నీ  మా తప్పు లేనమ్మ స్వార్థం కోసం డబ్బు కోసం, మోసాలు చేస్తూ, జాలి,  దయ ,మానవత్వం మరిచి పోయి మృగాలుగా మారుతున్నాం.

మనుషుల్లో మానవత్వం మంటగలిసింది . అందుకే హత్యలు, మానభంగాలు, దోపిడీలు, మోసాలు అంటూ ఎన్నెన్నో పుట్టుకొస్తున్నాయి. జాలి, దయ, కరుణ అనే విషయాలను మర్చిపోయి రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు.

నువ్వు చూసిన రాక్షసులకంటే ఇప్పటి రాక్షసులు మరి దారుణంగా ఉన్నారు. అది నువ్వు కూడా గమనిస్తూ వారి  తప్పులను మన్నిస్తూ, ఇంకా మారతారు అని చూస్తున్నావు  చూడు అది ఇది నీ గొప్పతనం  అమ్మ.

నీ మనసును, తనువును, హృదయాన్ని చిధ్రo  చేస్తున్నా , ఓపికతో భరిస్తున్నందుకు  నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. ఈ జన్మలో ఇంతటి ఘోరాలను చూస్తూ కూడా ఆపలేకపోతున్నాము అందుకు  మమ్మల్ని మన్నించమ్మా.

నీ గుండె ను చిధ్రం చేస్తున్నా, నీ లోతుల్లోకి కత్తులు దింపుతూ ఆకాశహర్మ్యాలు నిర్మించుకున్నా, తమ సుఖం కోసం నిన్ను నాశనం చేస్తున్నా, కూడా మా కడుపు నింపుతున్న నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లి.

కానీ అమ్మా ఒక్క చిన్న విన్నపం ఇన్ని చేస్తూ కోపం రాకూడదు అంటే ఎలా అని మమల్ని శపించకు తల్లి, నువ్వు కళ్ళెర్ర చేసిన నాడు మేమంతా అంతమే కదా తల్లి, కాని మా పై కోపం తెచ్చుకోకు తల్లి. నువ్వు మమల్ని చల్లగా కాపాడాలనే నీకు ఈ విన్నపం,ఈ అజ్ఞనులను క్షమించు తల్లీ… 

అందుకే అమ్మ నిన్ను మేము కాపాడుకో లేకపోయినా, నువ్వు మమ్మల్ని కాపాడతావని నమ్ముతూ, మా తప్పులను క్షమించి, మమ్మల్ని నీ కడుపులో దాచుకోవాలని కోరుతూ నీకు శతసహస్ర వందనాలు తెలుపుకుంటూ ఈ లేఖ నీకు అంకితం చేస్తున్నాను.

అమ్మ జగజ్జనని జగన్మాతా మమ్మల్ని చల్లగా కాపాడమ్మా…

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *