డిటెక్టివ్ ఎపిసోడ్ 3

డిటెక్టివ్ ఎపిసోడ్ 3

ప్యాంట్ జేబులో చేయిపెట్టుకుని నడుస్తున్నాడు సిద్దార్థ. హైద్రాబాద్ అతనికి కొత్తగా కనిపిస్తోంది. ఒక్క సంవత్సరంలోనే ఎంతో మారినట్టు అనిపిస్తోంది. మెట్రో రైలు పైనుంచి వెళ్తుంటే చూడ్డం బావుంది. స్కూల్ పిల్లలు యుద్ధానికి వెళ్తున్నట్టు వీపున పుస్తకాల బ్యాగు మోస్తూ వెళ్తున్నారు… ఇంకా సూర్యుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టలేదు.

ఓ మూలమలుపు తిరిగాడు.. ఇంకా తాను ఎదురుచూస్తోన్న సంఘటన ఎదురవ్వలేదు. తన అంచనా ప్రకారం ఈపాటికి రియాక్షన్ ఆక్షన్ లోకి వచ్చి ఉండాలి. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. తాను క్యాబ్ డ్రైవర్ జేమ్స్ ను కాపాడి…. గోడౌన్ లో రౌడీలను చితక్కొట్టాక జేమ్స్ ను పంపించి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కొందరు అగాంతకులు తన మీద ఎటాక్ చేయడం గుర్తొచ్చింది.

తను పరుగెడుతున్నాడు.. ఆ ఏరియా లో వున్న సిసి కెమెరాలకు తన పేస్ కనిపించేలా పరుగెడుతున్నాడు….. తనకు వాళ్లకు మధ్య ఛేజింగ్… వాళ్ళు కత్తులతో వెంబడించారు… ఈ తతంగాన్ని ఆ వీధిలో వున్న సిసి కెమెరాలు రికార్డు చేస్తూనే వున్నాయి… దానికి తోడు మరో స్మార్ట్ ఫోన్ లో కూడా ఛేజింగ్ దృశ్యాలు షూట్ అవుతున్నాయి….

సరిగ్గా తెల్లవారు ఝామున కొన్ని మీడియా ఛానెల్స్ కు వాట్సాప్ మెసేజెస్ వెళ్ళాయి… వీడియో క్లిప్స్ తో సహా.. డిటెక్టివ్ సిద్ధార్థ ను హైద్రాబాద్ లో కొందరు రౌడీలు వెంటబడి దాడి చేసే ప్రయత్నం చేసారు అని ఆ వాట్సాప్ సారాంశం.. ఆ మాత్రం చాలు మీడియాకు… డిబేట్స్.. లైవ్ లు… రచ్చ రచ్చ చేయడానికి… అప్పటికి కొన్ని ఛానెల్స్ షోస్ మొదలెట్టాయి.. అర్ధరాత్రి డిటెక్టివ్ సిద్ధార్థ మీద హత్యాప్రయత్నం..? డిటెక్టివ్ సిద్ధార్థ హైద్రాబాద్ కు ఎందుకు వచ్చినట్టు?

డిటెక్టివ్ సిద్ధార్థ మీద హత్యాప్రయత్నానికి మోటివ్ ఏమిటి? దానికి తోడు డిటెక్టివ్ సిద్ధార్ధను రౌడీలు వెంబడిస్తున్న దృశ్యాలు.. పొద్దున్నే కావలిసినంత మసాలా… టీవీ ఛానెల్స్ కు. ఈ స్కోలింగ్స్ తో పోలీసులు ఎలర్ట్ అయ్యారు.. సిద్ధార్థను ఛేజ్ చేసిన ఏరియాలలో వున్న సిసి కెమెరాల ఫుటేజ్ లను తెప్పించారు….

డిటెక్టివ్ సిద్ధార్థ ఆలోచన అంచనాలు ఎప్పుడూ తప్పవ్వవు. తలక్రిందులు అవ్వవు. సిద్ధార్థ మూలమలుపు తిరుగుతుండగానే కొని టీవీ ఛానెల్స్ వెహికల్స్ అక్కడికి వచ్చేసాయి.. వస్తూనే సిద్ధార్థను చుట్టేసాయి. సిద్ధార్ధకు కావలిసింది అదే “మీరు డిటెక్టివ్ సిద్ధార్థ కదూ… నిన్న రాత్రి మిమ్మల్ని కొందరు రౌడీలు చంపాడని ప్రయత్నించారా? ఇలా ప్రశ్నలు సంధిస్తూనే అతడిని స్టూడియోకు తీసుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు…

********

జేమ్స్ టిఫిన్ చేసి బయటకు వెళ్తూ ఓసారి టీవీ ఆన్ చేసాడు.. ఎప్పుడైనా బయటకు వెళ్లే ముందు టీవీ చూడ్డం అతనికి అలవాటు.. వాతావరణం గురించి.. ట్రాఫిక్ గురించి తెలుస్తుందని అతని ఉద్దేశం… అప్పుడే సోల్ఫ్ చూసాడు.. ఓ స్టూడియో లో రాత్రి తనను కాపాడిన వ్యక్తిని చూసాడు… తనను కాపాడింది డిటెక్టివ్ సిద్ధర్ఘ అని తెలిసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు.. టాక్సీ స్టాండ్ కు బదులు సిద్ధార్థను ఇంటర్వ్యూ చేస్తున్న స్టూడియోకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు..

డిటెక్టివ్ సిద్ధార్ధను కలుసుకోవాలి అనుకున్నాడు. తన క్యాబ్ ను స్టూడియో వైపు తిప్పాడు… కొద్దిదూరం రాగానే బ్లూ జీన్స్ వైట్ రౌండ్ నెక్ టీ షర్ట్ తో వున్న ఒకమ్మాయి క్యాబ్ ను ఆపింది… మహిళలు వృద్ధులు పిల్లలు ఆపితే వెంటనే క్యాబ్ ను ఆపే మంచి అలవాటు వున్న జేమ్స్ క్యాబ్ ఆపి తల బయటకు పెట్టి “సారీ మేడం… నాకు వేరేపని వుంది” అని చెప్పాడు. “టీవీ స్టూడియో వరకే….”అంది ఆ అమ్మాయి. ఒక్కసారిగా ఆమె వైపు చూసాడు…

టీవీ ఛానెల్ లో పనిచేసే యాంకర్ కాదు కదా? లేకపోతే న్యూస్ ప్రెజెంటర్? డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివే జేమ్స్ అలా లోచిస్తూ ఉండగానే ఆ అమ్మాయి క్యాట్ ఎక్కి చెప్పింది “సారీ ఇంతకన్నా వేరే మార్గం లేదు.. లేదంటే ఆ సిద్ధార్థ జారిపోతాడు” అంది. తనలో తాను గొణుక్కుంటున్నట్టు ఆ మాటలు విని ఉలిక్కిపడి ఆమె వైపు చూసి “మీరెవరు మేడం అని అడిగాడు. “సుగాత్రి… ఫ్రమ్ సిబిఐ” చెప్పింది.

ఒక్కక్షణం జేమ్స్ కు తను థియేటర్ లో స్క్రీన్ మీద కాకుండా కళ్లెదురుగానే క్రైమ్ సినిమా చూస్తున్నట్టు ఫీలయ్యాడు. తను చదివిన డిటెక్టివ్ నవలల్లోని పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఫీలయ్యాడు. కొద్దిగా సంశయంగా అడిగాడు “మేడం మీరు సిద్దార్ధ గారిని అరెస్ట్ చేస్తారా?” తన ప్రశ్న తనకే చిత్రంగా అనిపించింది. అదీగాక తను అనవసరంగా నోరు జారేనేమోననుకున్నాడు.

సుగాత్రి జేమ్స్ వైపు చూసి చిన్నగా నవ్వి “సిద్ధార్ధను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయలేము.. తాను అరెస్ట్ కావాలనుకుంటేనే అరెస్ట్ చేయగలం” అని చెప్పింది. ఇంకా ఏదో అడగలనుకున్నాడు కానీ అప్పటికే టీవీ స్టూడియో వచ్చింది. టీవీ స్టూడియో దగ్గర సెక్యూరిటీ జేమ్స్ క్యాబ్ ను ఆపింది… సుగాత్రి తన ఐడెంటిటీ చూపించింది.

క్యాబ్ తో సహా లోపలికి పంపించింది సెక్యూరిటీ, “థాంక్యూ మేడం.. మీరు నన్ను గేట్ బయటే వదిలేస్తారనుకున్నా… నాకు సిద్దార్ధ సర్ ను కలవాలనుంది. రాత్రి ఏం జరిగిందంటే….”జేమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు.. ఒక్క డేవిడ్ ఇన్సిడెంట్ తప్ప. అదికూడా చెప్పి ఉంటే కథలో మరో మలుపు వచ్చి చేరేది. జేమ్స్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే వున్నాడు… సిబిఐ ఆఫీసర్ తన క్యాబ్ లో రావడమేమిటి? గవర్నమెంట్ వెహికల్ వుంటుందిగా? జేమ్స్ ప్రశ్నకు సమాధానం దొరకడానికి టైం పడుతుందని ఆ క్షణం అతనికి తెలియదు. అదే సమయంలో స్టూడియోలో డిటెక్టివ్ సిద్ధార్థను లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు,

**********

సిద్దార్థ కాఫీ కప్ ను చేతిలోకి తీసుకుని కాఫీ స్మెల్ చూసి యాంకర్ తో “కాఫీ స్మెల్ అదిరింది.. ఫిల్టర్ కాఫీ అనుకుంటా… వేడివేడి జీడిపప్పు ఉప్మా అయితే ఇంకా బావుండేది” అన్నాడు. లైవ్ కవర్ చేస్తోన్న క్రూ షాకైంది లైవ్ లో సిద్దార్థ ఇలా మాట్లాడుతాడనుకోలేదు. యాంకర్ ఓ వెర్రి నవ్వు నవ్వి “మీరు చాలా సరదాగా మాట్లాడుతారు సిద్దార్ధగారు” అంది. “నేను సీరియస్ గానే అడిగాను.. అన్నట్టు చిన్న డౌట్ అడగొచ్చా? అన్నాడు యాంకర్ ఒక్కక్షణం ఉలిక్కిపడింది.

“ఏమడుగుతాడు? తన కురచ దుస్తులవైపు చూసుకుని కంగారుగా “అడగండి” అని “షార్ట్ బ్రేక్ లో గప్ చుప్ అదే పానీపూరి ఇవ్వగలరా.. ఇలా కాఫీ కప్ పట్టుకుని గంటసేపు ఇంటర్ వ్యూ అయ్యేవరకూ లిబర్టీ అఫ్ స్టాచ్యూలా పట్టుకుని కాఫీ చప్పరిస్తూనే… తాగుతున్నస్టు పెదవులకు పెట్టుకుని ఉండడం బోర్.. అదే పానీపూరి ఐతే సూపర్ టేస్ట్..” అన్నాడు.

(ఇంకా వుంది)

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *