దీపశిఖ
క్షరం కానిది అక్షరం. భువిపై నాశనమంటూ లేనిదేదైనా ఉందంటే అది అక్షరం ద్వారా సాధించుకున్న విద్య, విజ్ఞానం మాత్రమే.. ఇది మాత్రమే సర్వకాల సర్వవస్తల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. మనం నిష్క్రమించినా ఎన్నటికీ వీడిపోని సుగంధంలా భూమిమీద పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది.
ఆటవికత నుంచి ఆధ్యాధునిక సాంకేతికతతో కూడిన అత్యున్నత నాగరికత వైపు మనిషి ప్రస్థానం మహోన్నతంగా సాగడం వెనుక అక్షరం ప్రాధాన్యత విస్మరించలేనిది.
సర్వ ప్రాణులలో శ్రేష్ఠ గౌరవం సాధించి సగర్వంగా సమున్నతంగా మానవ మేధస్సును లోకానికి చూపించడం వెనక అక్షరానికి ఉన్న కీర్తి అజరామరమైనది.
అక్షరాన్ని మదించడం ద్వారా సాధించుకున్న విద్య యుగాలు మారినా తరాలు మారినా నిత్య సంజీవనిలా, సకల సంక్షోభాలలో మానవాళికి దీపశిఖలా మార్గ నిర్దేశనం కావిస్తూనే ఉంది.
“లోకాలు నశించినా విద్య నశించదు” అన్న భర్త్రుహరి మాటలు అక్షర తూణీరాలై అంతర్జాల మాయాజాలంలో కుదేలవుతున్న గ్రంథ పఠన అభిరుచిని పునరుద్ధరించే ప్రయత్నాలకు బాసట కావాలి.
ఆ మాటల మంత్రాలు భవిష్యత్ మానవాళిని ఉత్తేజితం చేసే మంత్రనాధాలై భాసించాలంటే మానవ మహాయాత్ర దిగ్విజయంగా అక్షరం వైపు పునః ప్రయాణాన్ని సాగించాలి. తన ఉనికిని చాటిన , ఉన్నతత్వానికి బీజం నాటిన అక్షర మహా యజ్ఞానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది.
– మామిడాల శైలజ.