డబ్బుతో కూడిన రాజకీయం
‘రాజకీయం’ దీనిలోకి రావటానికే కాదు, ఈ పదం వినడానికి కూడా మనలో చాలామంది ఇష్టపడరు, పేద, మధ్యతరగతి వాళ్ళకైతే ఇది ఒక పద్మవ్యూహంలా భావిస్తారు.
దీనికి ప్రధాన కారణం భయం, ఈ భయంలో తప్పు అనేది లేదు, ఎందుకంటే ఒక సాధారణ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు భయపడే మనం ఒక మండల ఎస్సై నుంచి డిఎస్పీ, డీజీపీ, కలెక్టర్ వరకు వీళ్ళందర్నీ శాసించేది ఒక రాజకీయ నాయకుడు, అలాంటప్పుడు భయపడకుండా ఎలా ముందుకు వెళ్ళగలం.
ఒక పాతికేళ్ల సామాన్య యువకుడు ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తాను అంటే ముందుగా వద్దు అని చెప్పేది వాళ్ళ తల్లిదండ్రులు. మనలాంటోళ్లకు ఇవన్నీ ఎందుకురా మనం ఎంత మన బ్రతుకులు ఎంత అంటారు. పోనీ అన్ని అడ్డంకులు దాటినా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల వరకు ఉంటాడో లేదో కూడా తెలియదు.
రంగస్థలం అనే సినిమాలో చూపించినట్లు కనిపించని, బయటకు రాని కథలు ఇంకా ఎన్నో మన దేశంలో….
డబ్బుతో ముడిపడిన రాజకీయం:-
ఒక అసెంబ్లీ ఎన్నిక వస్తే కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటారు, ఒక వార్డు మెంబర్ స్థాయి వ్యక్తి నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి వరకు ఏ నియోజకవర్గానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ పంచాయతీలకి ఎంత డబ్బు ఇవ్వాలి ఇలా లెక్క చేసుకుంటూ ఉంటారు.
ఇప్పుడు ప్రజల విషయానికొస్తే ఎలా తయారయ్యారు అంటే ఒక రాజకీయ నాయకుడు అనే వాడు ఎంత అవినీతి చేసినా, ఎంతమందిని హత్యలు చేసిన వాడినే పవర్ఫుల్ లీడర్ అంటారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వాడేదో దేశాన్ని ఉద్ధరించినట్లు గజమాలలతో ఊరేగింపులు, బానాసంచా కాల్పులు, డప్పుల మోతలు.
ఇవన్నీ లేకుండా కొంతమంది మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే గెలిపించుకోలేకపోతున్నాం. ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులు, మంచి భావాజాలం గల వ్యక్తులు రాజకీయంలోకి వచ్చి కనుమరుగైపోయారు, నిజానికి వాళ్లు ఎటువంటి అవినీతి చేయలేదు, ఎవరినీ దోచుకోలేదు, జీవితంలో ఎన్నో శిఖరాలు అందుకున్న వాళ్ళు రాజకీయం మాత్రం ఓటమి ఎదుర్కొన్నారు.
అంత గొప్ప వ్యక్తులు ఎందుకు ఓడిపోతున్నారు అని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్లకు రాజకీయం చేయడం తెలియదు అనే సమాధానం వినిపిస్తుంది. అవును నిజమే వాళ్ళకి ఏ పంచాయతీకి ఎంత డబ్బు పెట్టి ఓట్లు కొనాలో తెలియదు, ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బులు పెట్టాలో, ఎవరిని ఎక్కడ అణచివేయాలో, ఎవరిని బెదిరించి ఓట్లు వేయించుకోవడం కూడా తెలీదు, బహుశా అందుకే ఓడిపోతున్నారేమో…..!
సమాజం కోసం ఆలోచించే ప్రజలు ఈ రోజుకి ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళ బలం సరిపోవటం లేదు, మంచి భావాజాలం గల వాళ్ల బలానికి తోడుగా ఎప్పుడైతే అందరూ కలిసి ముందుకు వెళ్తారు చాలా చోట్ల చూస్తున్నట్టుగా ఒక సైకిల్ తొక్కే పేదవాడు పార్లమెంటుకు వెళ్లగలడు, ఒక సాధారణ గృహిణి అసెంబ్లీలో అడుగుపెట్టగలదు.
డబ్బుతో కూడిన ఈ ఓటు బ్యాంకు రాజకీయం పోయి, ఓటు అనే ఆయుధాన్ని సరైన రీతిలో ఉపయోగిస్తారని ఆకాంక్షిస్తూ..
– కోటేశ్వరరావు