కరోనా..(ఆటవెలదులు)

కరోనా..(ఆటవెలదులు)

 

101)లాకుడౌను వల్ల లాసైన దేశము
రెండవ అలవల్ల రెంటజెడెను
గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి
కాటికంపు చుండెగా కరోన
102)
చాపకింద నీటిచందాన దరిజేరి
ఆనవాలు లేక అంటుకొనును
సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి
కాదు కూడదంటె కలుగు ముప్పు
103)
చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు
దరికిబోయి దాన్ని తగులుకోకు
మరల తిరిగి వచ్చె మాయదారి కరోన
మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు
104) భౌతికముగ ఎడము పాటించి తీరాలి
ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు
ఎడము ఉండవలెను ఏ జనమెదురైన
లెక్క జేయకుంటె ప్రక్క జేరు
105)
బయటకెళ్ళునపుడు బాధ్యత మరువకు
మాస్కును ధరియించు మంచిదౌను
దూరముండ వలెను దుష్ట కరోనకు
టీక వేయువరకు తిరుగ రాదు

 కరోనా…. జాగ్రత్తలు (ఆటవెలదులు)
96
బాలవాక్కులన్ని బ్రహ్మ వాక్కు లంటు
భేదమనకచెప్పె వేదవాక్కు
భావిపౌరులైన పసివారి పనిపట్ట
కసికరోన ముందుకరుగు చుండె
97
మానవత్వ మంత మంటగలుపుచుండె
మనసు కరుగదీ కరోన కేమి
బతికి యున్ననాటి బంగారు బంధాలు
మానవ మనుగడకు మచ్చ తెచ్చె
98
తల్లి దండ్రి లేక తల్లడిల్లెడివారు
అమ్మ పాలు దాగ అరచువారు
ఆదరించుఅమ్మ ఆనవాలు గనక
దీనులై వెదికిరి దిక్కు లేక
99
ఒకరు వదిలిన గాలి నొకరు పీల్చిన వచ్చు
మాయదీకరోన మరువ వద్దు
రక్త నాళములకు శక్తి మార్గము మూయు
ప్రాణ వాయువింక పారిపోవు
100
మాదీ కరోన మాయమయ్యేదాక
మనము యింటియందె మసలవలయు
దూరబంధువంటు దర్శించ వచ్చినా
ఆత్మ బంధువంటు హత్తుకోకు

ఆకలి కడుపులకు అలసటతోడాయె
కాళ్ళు నడవలేక కూలబడెను
కళ్ళుతిరుగుడాయె కడుపులో మంటలు
మానవత్వమంత మూగబోయె

కరోన ..వలస కూలీలబాధలు
భోజనమ్ముకరువు.భుజముపైనబరువు
గమనమాగదాయె ఘడియయైన
కాళ్ళుకందిపోయె కనరాని గమ్యము
వలసజీవి బతుకు వంచనాయె

బతుకు దెరువు మిగులభారమైతలకెక్క
శాంతిగూర్చుసంతు చంకనెక్కె
నడవరానికొడుకు నడిచె.చేయందించ
భర్తమోసె మిగత భారమంత
కరోనా–వలసకూలీలబాధలు

చెప్పులు తెగిపోయె చెమటలు ధారలై
కాళ్ళు బొబ్బలెక్కి కదలవాయె
నోరుయెండిపోయి నాలుకపొడిబారె
వలసజీవితాశ వట్టి పోయె

బస్సు పంపెదమని పెక్కుమాటలుజెప్పి
నడిచి వెళ్ళు వారి నాదుకొనక
లాకుడవునుయంటు లారీల సరిహద్దు
అనుమతేది యనుచు అడ్డుకొనిరి

దానకర్ణులున్న దయగల దేశమే
దీనజనులజూసి తొలగిపోయె
రంతిదేవుడేలు రాజ్యమా ఈనాడు
గొప్ప చెప్పుకొనుట గౌరవంబె

కరోనా_ వలసకూలీలు

వలస కార్మికుల కు వచ్చిన కష్టాలు
చెప్పతరము కాదు చక్రి కైన
మానవత్వ మున్న మనుజులున్నందునే
అన్నపానములిడి ఆదుకొనిరి
కాళ్ళు బొబ్బలెక్కె కాయము అలసెను
కూడు నీరు లేక కూలబడెను
గండుచీమలన్ని ఎండమాడినరీతి
వలసజీవులెండ వడలినారు

కనివినియెరుగనిది కానరాని కరోన
జీవరాశిలోని చేవజంపె
బతుకు పోరు నందు చితికిపోయిన జనం
మార్గమధ్యలో నె మూగవోయె

మందుబాబులంత చిందులువేయుచూ
బార్ల ముందు పెద్దబారు నిలిచి
దూరముండుమనగ దురుసుగా మాటాడి
గుంపు గూడి మందగోలజేసె

బారుతెరవగానె బారుగా నిలుచుండి
నాకు ముందు మందు నాకుయంటు
వంతువారిగగొని వాంతులు జేసిరి
బారుముందు మందు బాబు లం త

జనవరి ఒకటనుచు జంకు గొంకూలేక
మందుబాబులంత చిందులేస్తూ
బాటలన్ని తిరిగి బాగుగా అరచుచూ
బార్ల ముందు కొచ్చి బోర్లబడిరి

 కరోనా__బంధాలు

భార్య భర్త యనెడి బంధాలు బోయెను
దరికి బోవలెనను ధైర్యమేది?
అన్నపానములిడి ఆఖరి చూపుకై
ఎదిరిచూచువారు బెదరిపోయె

అన్నదమ్ములేరి? అక్కచెల్లెళ్ళేరి?
ఆదుకున్న మిత్రబృందమేది?
లక్షపతులుఏరి?బిక్షపతులు ఏరి?
దండిగా నొక కడ దగ్ధమయిరి

జీవితాలనెన్నొ చిదిమేయుచుండెను
బంధములనుతెంచి బాధపెట్టె
ఒంటరిబతుకులను ఓదార్చునెవ్వరు?
కరుణ జూపు వారు కానరారు

కరోనా—అనాథ శవాలు
బాధ్యులు చనిపోయి బంధాలు తెగగానె
అడుగు పెట్టనీక అడ్డుకొనిరి
అండనుండు పెద్ద ఆగమైపోయినా
నిప్పుపెట్టకుండ నిలువరించె

వరుసలో శవాలు వైకుంఠధామాల
హౌజుఫుల్లు బోర్డు లవతరించె
పగలు.రాత్రియనక పార్థివదేహాల
పులువుర నొకచోట పాతిపెట్టె

గంగలో శవాలు గణియించజాలము
ఒడ్డు తేలివచ్చె ఉబ్బి కంపు
కాటికాడ వరుస. కాల్చుట దుర్లభం
కాల్చవీలు కాక గంగగలిసె

కరోనా—శవాలు
రెండవ అలవల్ల రెట్టింపు మరణాలు
ఆగమాగమాయె ఆస్తులన్ని
ప్రాణమిచ్చు గాలి ప్రాణాలు తీయగా
ఊపిరాగిపోయె ఉప్పెనోలె

వైద్యశాలలందు వరుసలుగ శవాలు
మార్చురీలయందు మూటగట్టి
కాటికాడ వరుస కాల్చగా చోటేది?
ఎవరి శవమెవరిదొ ఎరుగలేము

 

-కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *