చివరి చూపు చివరి భాగం మాయ
వాసు కి కనిపించిన ఫైల్ లో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ బైక్ పై ఉండేసరికి చూడలేక ఇంటికి వెళ్ళి చూడాలని అనుకున్నాడు.
వాసు ఇంటికి వెళ్లేసరికి తలుపులన్నీ తీసి ఉన్నాయి. అలా యెప్పుడూ ఉండదు. తల్లి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచుతుంది. అమ్మకు ఏమైంది అనుకుంటూ అమ్మా, అమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు వాసు.
కానీ లోపలి నుండి ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. ఎవరు పలకడం లేదు. అరే ఎవరూ లేరెంటి ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ నాన్న, నాన్న అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. లోపల బెడ్ రూం లో బెడ్ పైన తండ్రిని పట్టుకుని తల్లి ఓదారుస్తూ ఉంది.
అది చూసి ఎంతో ఆశ్చర్య పోయాడు వాసు. ఇన్నేళ్లుగా తండ్రి ఏడవడం అసలు చూడలేని వాసు ఎంతో విభ్రాంతిగా చూస్తున్నాడు ఆ దృశ్యాన్ని.
వాసు ని గమనించిన తల్లి హైమవతి గారు చూడరా బాబు మీ నాన్నగారు ఇంతలా ఏడవడం నేనెప్పుడూ చూడలేదు. ఇన్నేళ్ల మా కాపురంలో ఇలా ఎప్పుడు జరగలేదు. ఎందుకు అంటే ఏం చెప్పడం లేదు. అంటూ చెప్పింది.
వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నా కూడా వాసు నాన్నగారు అసలు మాట్లాడడం లేదు. ఏడుపు అపడం లేదు. వాసు తల్లి మాటల్ని విని అవునమ్మా నాకు విచిత్రంగా ఉంది.
ఎందుకు ఇయన ఇంతగా ఏడుస్తున్నారా అర్దం కావడం లేదు. అంటూ తండ్రి దగ్గర గా వచ్చి నాన్న నాన్న ఏంటి ఇది ఎందుకు ఏడుస్తున్నారు ఏం అంతగా బాధ పడుతున్నారు అంటూ అడిగాడు.
వాసు చేతిలో ఉన్న పసుపు పచ్చని ఫైల్ చూసిన తండ్రి అదే అదే ఆ ఫైల్ నా జీవితాన్ని మార్చింది. నేను చనిపోయేలా చేసింది. వద్దు దాన్ని తీసుకు రాకండి అంటూ బెడ్ చివరి కి వచ్చేశాడు.
కొంచం జరిగితే కింద పాడేవాడు పక్కనే ఫ్యాన్ కు బిగించే ఒక రాడ్ లాంటిది ఉంది. అది గమనించిన వాసు గబుక్కున వెళ్ళి తండ్రిని పడిపోకుండా పట్టుకున్నాడు.
అప్పుడు సరిగ్గా అప్పుడు తండ్రి మొహం ఒక రకంగా మారిపోయింది. వాసు అదేం గమనించక తల్లితో అమ్మా నువ్వు వెళ్ళి డాక్టర్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అన్నాడు. దాంతో తల్లి సరే వాసు అంటూ ముందు గది లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళింది.
వాసు తండ్రి మొహం మొత్తం నీలి రంగు లోకి మారుతూ వాసు చేయిని గట్టిగా పట్టుకుంటూ వాసు నా ఇంట్లోకి ఎవరి వచ్చినా నేను వదలని వదలను అందర్నీ చంపేస్తానని. మీ అందరూ నా ఇంట్లో ఉండి దాన్ని పాడు చేస్తున్నారు అందుకే మిమల్ని వదలను అంటూ అదో రకమైన బొంగురు గొంతు తో చెప్పింది.
తండ్రి మాటల్లో మొహం లో మార్పు చూసి ఉలిక్కిపడిన వాసు తన తండ్రి కాదని ఇంకెవరో ఉన్నారని అర్ధమైన వాసు, ఏ ఎవరు నువ్వు? ఏంటి ఇది నీ ఇల్లు ఏంటి? ఎక్కడ ఉంది? అసలు నువ్వు ఎవరో మమల్ని ఎందుకు ఇలా చేస్తావు మేమేం అపకారం చేశాం నీకు అంటూ అడిగాడు.
ఇంతలో తల్లి డాక్టర్ కి ఫోన్ చేసి వస్తూ వాసు డాక్టర్ గారు వస్తా అన్నారు అంది. వాసు అమ్మా ఇదేవరో ఏదో అంటుంది ఒకసారి విను అంటూ పిలిచాడు.
తల్లి ఏంటి ఎవరు వచ్చారు అంటూ లోపలికి వచ్చింది. వాసు తండ్రి నీ చూపిస్తూ అటూ చూడమ్మా నాన్నగారి లో ఇంకెవరో ఉన్నారు.
మనల్ని వదలను అంటున్నారు ఎవరో ఏంటో నాకేం అర్ధం కావడం లేదు అన్నాడు. ఎవరో అంటే దెయ్యమా దెయ్యమంటూ నాకు చెప్తున్నారు వామ్మో ఏంట్రా ఇది?
అదేదో మన ఇంట్లో మనిషి అన్నట్టు చెప్తున్నావు పద పద గుడికి వెళ్దాం అంటూ రెండు అడుగులు బయటకు వేసింది.
ఇంతలో, అమ్మా ఆగండి నా బాధ కాస్త వినండి. నేను మిమల్ని ఏమీ చేయడానికి రాలేదు. ముందు మీరు నా ఇంట్లోకి రాగానే మీ అందర్నీ చంపాలి అనుకున్నాను అలాగే మీ కోడల్ని చంపాను.
కానీ మీరు మీ కోడల్ని మర్చిపోలేక బాధ పడుతుంటే చూసి నేను అనవసరంగా నందినిని చంపాను అని బాధ పడుతున్నాను మీ కోడలి పై మీకున్న ప్రేమ ను చూసి మిమల్ని ఏమీ చేయలేక పోతున్నా అంది.
భర్త గొంతు అమ్మాయిలా మారడం చూసి హైమవతి గారు ఆశ్చర్య పోయి ఇంతకీ ఎవరు నువ్వు? మమల్ని ఎందుకు బాధ పెడుతున్నవు? నా కోడలు నీకేం అన్యాయం చేసిందని చంపావు అంటూ అడిగింది.
అవును నా నందు ఏం చేసింది ఎందుకు చంపావు అంటూ అడిగాడు వాసు. దానికి వాసు తండ్రి లో ఉన్న ఆత్మ వాసు నీకు నేను గుర్తు లేనా నేను నీ మాయను అంది.
మాయనా? మాయ ఎవరు? నాకెవరూ తెలియదు నా మాయ అంటున్నావేంటి? నాకు నా నందు తప్ప ఎవరూ తెలియదు అన్నాడు వాసు.
అవును నేను నీకు తెలియదు. కానీ, నువ్వు నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. నేను నీ ఆఫీస్ లో నీకు జూనియర్ ను రిసెప్షన్ లో ఉండేదాన్ని.
నిన్ను చూసి ఆరాధించడం మొదలు పెట్టాను. కానీ నీకు చెప్పాలి అంటే భయం వేసింది. చెప్పలేక పోయాను.
అదే నేను చేసిన తప్పు. నీ గురించి మా ఇంట్లో వాళ్లకు చెప్పి మాట్లాడమని అన్నాను కానీ వాళ్ళు నువ్వు నా కన్నా వయసులో పెద్దవాడివి అని వద్దు అన్నారు. ఇంతలో నీకు నందినితో ఎంగేజ్ మెంట్ అని తెలిసి నేను భరించలేక పోయాను.
ఆరోజు నీ ఎంగేజ్ మెంట్ రాత్రి నీతో మాట్లాడాలని నిన్ను పెళ్లికి ఒప్పించాలని నీ దగ్గరికి వస్తున్నా, ఆ సమయం లో నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు.
అంత రాత్రి వస్తున్న నన్ను కొందరు ఆటో వాళ్ళు పట్టుకుని ఇప్పటి వరకు మీరున్న ఆ ఇంట్లోకి నన్ను తీసుకుని వెళ్లి రేప్ చేసి చంపేశారు.
నా ప్రాణం, మానం రెండూ తీసిన వాళ్లను నేను వదల లేదు. దయ్యమై వారిని చంపాను. ఆ ఇల్లు నాదే అనుకున్నా, అక్కడికి ఎవరూ వచ్చినా చంపాలి అని అనుకున్నా….
అదే సమయంలో మీరు ఆ ఇంట్లో దిగారు. నాకు దక్కాల్సిన నీ ప్రేమను నందిని పొందుతూ ఉంటే నేను భరించలేక పోయాను. తనను చంపాలి అని ఎన్నో సార్లు అనుకున్నా…
కానీ తను ప్రతిరోజూ రామకోటి రాసి, ఆ ఫైల్ ను దిండు కింద పెట్టుకునేది. తన చేతికి నువ్వు పెళ్ళినాడు కట్టిన తోరణం ఉండేది.
అందువల్ల నేను తనను ఏమీ చేయలేకపోయాను. అయితే తనకు అందర్నీ దూరం చేసి నా పగ తీర్చుకోవాలి అనుకున్నా అందుకే తన తల్లిదండ్రులను చంపేశారు.
అప్పుడు ఆ చావుకు వెళ్ళిన నందిని చేయికి ఉన్న తోరణం శక్తి సన్నగిల్లింది. అందువల్ల తనను అవహించి చేయి కోసుకునేలా చేశాను.
దాంతో నందిని చనిపోయింది. కానీ, కానీ, తను చనిపోయాక కూడా మీరు తనను మర్చిపోకుండా ఇంతగా ప్రేమించడం చూసి నాకు నేను చేసింది తప్పు అని అనిపించింది.
కానీ అంతా అయ్యాక చేసేది ఏం లేదు కాబట్టి నేను నా గురించి మొత్తం నీకు తెలియాలని చెప్పడానికి ఇలా మీ నాన్నగారిని వహించాను. ఈ రోజు పౌర్ణమి ఈ రోజు తో నా ఆత్మకు విముక్తి కలుగుతుంది.
అందుకే నా బాధ నీకు చెప్తే నా ఆత్మ శాంతిస్తుంది అని చెప్పడానికి వచ్చాను. అంటూ చెప్పింది వాసు కు తండ్రి శరీరం లో ఉన్న మాయ.
అంతా విన్న వాసు ఎందుకిలా చేశావు? అసలు నువ్వెర్వరో కూడా నాకు తెలియదు. పోనీ ప్రేమిస్తే చెప్పాలి కానీ సమయం కానీ సమయం లో నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి? బయట జరుగుతున్నవి తెలియదా…?
అనవసరంగా నీ జీవితం నాశనం అయ్యింది ఇటూ పగ తో నా నందు ను నాకు దూరం చేసి నా జీవితం నాశనం చేశావు దీనివల్ల ఏం సాధించావు చెప్పు అంటూ ఆవేదనగా అడిగాడు.
అవును నిజమే నా ప్రాణాలు, మానం రెండు పోతాయి కానీ నేను తొందర పాటులో పగతో చేశాను. ఈ పాపానికి నాకు నిష్కృతి లేదు. నా వల్ల మీరంతా బాధ పడ్డారు.
నేను చేసిన పాపానికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. వాసు నేను చేసిన తప్పుకు కన్నీళ్ళతో మీ కాళ్ళు కడగాలనే వచ్చాను. అందుకే మీ నాన్నగారి శరీరం లో ఉన్నాను.
వచ్చే జన్మలో అయినా నీ భార్య గా పుట్టాలని కోరుకుంటున్నా నన్ను క్షమించు వాసు. నీ జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలియని తనం తో మన జీవితాలని ఫణంగా పెట్టీ ఇద్దరికీ మనశ్శాంతి లేకుండా చేశాను.
వాసు నన్ను నువ్వు క్షమించవద్దు. నాకు నా ఆత్మకు శాంతి లేకుండానే ఉండాలి అదే నాకు శిక్ష నరకం లో నేను శిక్షలు అనుభవిస్తే కానీ నా తప్పుకు ప్రాయశ్చిత్తం కలగదు.
వాసు వస్తాను. నందిని నీ మర్చిపొమ్మని చెప్పను కానీ జీవితం లో ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు ఇంకొకర్ని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నిర్ణయం నీదే…
ఇన్ని రోజులూ నీతో నీ జీవితంతో ఆడుకున్నందుకు నన్ను మరొక్కసారి క్షమించమని అడుగుతున్నా, అంటూ వాసు తండ్రి శరీరంలో నుండి వెళ్ళిపోయింది మాయ అత్మ.
అంతా విన్న వాసు ఛీ ఏది తెలుసుకోకుండా నా అమాయకమైన ఏమీ తెలియని నందును పొట్టన పెట్టుకున్న నిన్ను నేనెలా క్షమిస్తాను అంటూ మోకాళ్ళ పై కూర్చుని నందును తల్చుకుంటూ ఏడవడం మొదలు పెట్టాడు.
ఇంతలో డాక్టర్ వచ్చి అమ్మా హైమవతి గారు అంటూ పిలవడంతో తల్లి వాసు తో బాబు జరిగిందేదో జరిగిపోయింది. పదా నాన్నగారిని డాక్టర్ కి చూపిద్దాం అంటూ ఓదార్చింది. తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు తుడుచుకుని బాధ్యత కోసం దుఖం నుండి బయట పడ్డాడు వాసు.
ఆరు నెలల తర్వాత
నాన్న అంటూ వచ్చింది నందిని. ఏమ్మా స్కూల్ అయిపోయిందా అన్నాడు పాపను ఎత్తుకుంటూ వాసు. అవున్నాన్నా ఈ రోజు తొందరగానే పంపించారు అంటూ చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ చెప్తున్న నందిని ని చూస్తూ మైమరచి పోయాడు వాసు.
మళ్లీ పెళ్లి చేసుకోమని వినకుండా ఒక అనాధ అమ్మాయిని తెచ్చుకుని పెంచుకుంటున్న కొడుకును చూస్తూ అక్కడే ఉన్న తల్లి గట్టిగా నిట్టూర్చింది. కనీసం ఆ పాప వల్ల అయినా కొడుకు మనుషుల్లో పడుతున్నాడని సంతోషించింది…
– భవ్యచారు