చిలిపి

చిలిపి

గోదావరి చెంతనే సంతోష్ కి కొత్తగా ఉద్యోగం వచ్చింది.. సాయంత్రం కాసేపు ఆ తీరాన కూర్చుంటే ఉండే హాయే వేరు.. అందుకే వీలున్నప్పుడల్లా గోదారి గట్టుకి వెళ్లిపోతుండేవాడు.. ఓ రోజు తోటి ఉద్యోగులు చెప్పారని దారి మార్చి ఊరి మధ్యలో ఉన్న ఓ ఉద్యానవనానికి వెళ్లి, అక్కడున్న సిమెంటు బల్లపై కూర్చున్నాడు. ఎదురుగా చిన్న కొలను.. అందులో లయబద్ధంగా ఆడుతున్న జలధారలను చూస్తున్నాడు.

కాసేపటికి.. తననెవరో చూస్తున్నారని అనుమానం వచ్చింది సంతోష్ కి.. తల తిప్పి చూస్తే పక్కకే ఓ అందమైన అమ్మాయి.. ఒక్కసారిగా ఉలిక్కిపడి, అక్కడినుంచి లేవబోయాడు..”పర్లేదండీ..కూర్చోండి.” అంటూ ఆ అమ్మాయి సిగ్గుపడుతూ చెప్పే సరికి లేవాలా వద్దా అనే మీమాంసలో కాసేపు అలా తటపటాయిస్తూనే కూర్చున్నాడు.

ఏవండీ.. అంటూ.. మరోసారి ఆ అమ్మాయి పలకరించింది.. చెప్పండి మేడమ్ అన్నాడు సంతోష్ కాస్త మొహమాట పడుతూ..

“లాలా చెరువుకి వెళ్లాలంటే, ఎలా వెళ్లాలండీ.. నాకు ఈ ఊరు కొత్త.. కొంచెం చెప్పండి” అంది ఆ అమ్మాయి..” బయటకు వెళ్లి ఆటో ఎక్కండి, డ్రైవర్ కి చెబితే వాడే తీసుకెళ్లిపోతాడండీ.” అని బదులిచ్చాడు సంతోష్.. “అలా కాదండీ.. ఒక్కదాన్నే ఆటో ఎక్కాలంటే నాకు భయం.. మీరు కాస్త తోడొస్తారా ప్లీజ్” అని అడుగుతూ దీనంగా మొఖం పెట్టింది ఆ అమ్మాయి.

“నే నెవరో మీకు తెలుసా.. తెలీదు కదా.. ఎవరో తెలీని అబ్బాయి పక్కన కూర్చొని, మాట్లాడటమే కాకుండా.. మీకు తోడుగా రమ్మంటున్నారు.. మీకు భయమా.. మీకన్నా ధైర్యవంతులెవరున్నారండీ.. పర్లేదు వెళ్లండి‌.” అంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు సంతోష్.

“ఛీ.. పొండీ.. ఇంత వివరంగా చెప్పినా ఇంకా ఏం అర్థం కానట్టు బాగానే నటిస్తున్నారు.. చిలిపి.. ఏం తెలీదు కదా పాపం తమరికి.” అంటూ బుగ్గ గిల్లేసింది ఆ అమ్మాయి.. ఇంక చూడాలి సంతోష్ పరిస్థితి, గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి..

ఇదెక్కడి గొడవరా బాబూ.. ఎవరీ అమ్మాయి.. నన్ను గిల్లుతుందేంటి.. పైగా నేను నటిస్తున్నానంటోంది.. బాబోయ్ ఇక్కడుంటే ఇంకేం చేస్తుందో.. ఇంకెన్ని అంటుందో అనుకుంటూ.. ఒకటే పరుగు.. ఆ అమ్మాయి పిలుస్తున్నా పట్టించుకోలేదు.. అసలు వెనక్కి తిరిగే చూడలేదు.

మరుసటి రోజు కార్యాలయానికి వెళ్లి సహచరులకు రాత్రి జరిగిందంతా చెబితే, నువ్ మరీ అమాయకుడిలా ఉన్నావే.. ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఓ అమ్మాయి ‘చిలిపి’ అంటూ కవ్వించి, రమ్మందంటే.. ఎందుకో ఆ మాత్రం అర్థం కాలేదా.. అంటూ పగలబడి నవ్వారు.. అప్పటికి గానీ సంతోష్ కి అసలు విషయం బోధపడలేదు. మళ్లీ ఎప్పుడూ ఆ ఉద్యానవనం వైపు వెళ్లలేదు.!

– ది పెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *