చీకటి పాట
నేనిక్కడే ప్రారంభమవుతాను
మరెక్కడో అంతమవుతానుట.
ఎన్ని ఆశాభంగాలో.
నాకెవరో చేయందిస్తారు
లోలోతుల చైతన్యం లోంచి అసంపూర్తిగా కదులుతుంటాను.
నేను విచిత్ర సంగీతాన్ని కదా! దుఃఖమున్నచోట పాడుతుంటాను..
నా పంథా ఎవరికీ అర్థమవ్వదు.
అయితేనేం!
రాత్రి కిటికీ తెరిచే ఉంటుంది
కొన్ని కీటకాలు వెలుగులకై వెదుకుతూ ఊహలరేపటి చుట్టూ చేరుతాయి.
నా ఎదుట తెలుపూ నలుపూ కాని రంగేదో వెతుకుతుంటారెవరో.
శ్రద్ధగా నేను చూడనట్టే నటిస్తాను.
అయినా వాళ్లు
నేను కదులుతున్నానని అప్రమత్తతనొందుతారు.
బిగుతుగా ఉన్న నా ఊపిరి కాస్త వొదులు చేస్తాను
స్వాతంత్ర్యం గురించో, సత్యాగ్రహం గురించో,
కలలో కాసేపు ఉపన్యసిస్తాను.
దుర్బలత్వానికి ఎవరు కారణం?
నిన్నెవరు దోచుకుంటారు చెప్పు?
కాస్త మిసిమి లో నవ్వుతుంటాను
అంతలోనే అసౌకర్యంగా కదుల్తుంటాను.
గొప్ప దుఃఖాల్నెవరు నెత్తిన మోస్తారు?
పదాల అర్థాలే దొరకని
దుర్భరవేళ
సారాంశం కోసం ఎవరు వెతుకుతారు!?
చూస్తూ నడవడమే
ఎక్కడో ఓ చోట,
ఎప్పటికో ఓ నాటికి నమ్మకం
తప్పక నిన్ను పల్లకిలో ఊరేగిస్తుంది.
-గురువర్థన్ రెడ్డి