చిద్రిత హృదయం
మాటిమాటికి దారి తప్పిపోతున్నా…
అంతు పట్టని ఈ నిర్జన ఎడారిలో..
వెళ్లే దారిలో ఎన్నెన్నో కంటకాలు..
ఎద ఎదకూ ఎన్నెన్ని వ్యధలను పంచాయో..
ఎన్ని గుండెలు గాయాలపాలయ్యాయో…
ఎన్ని సుకుమార హృదయ సుమాలు…
నలిగిపోయి నలిబిలి అయ్యాయో…
నాకు తెలియని మార్గాలు అనేకం అని…
ఇప్పుడిప్పుడే ఎరుకలోకి వచ్చి ఏడిపిస్తున్నాయి..
నాకు సర్వం తేటతెల్లమే అన్న భావన…
భ్రమే అని వెక్కిరిస్తూ వేధిస్తోంది..
నాకు సర్వం అవగతమే అన్న అభిజాత్యం…
అహంభావమే అని
తేటతెల్లమై….
ఆశనిపాతంలా మారి..
అంకుశంలా గుచ్చుతోంది…
మది మదిని కలచివేసే…
మహోత్పతాల గాయాల తాకిడికి..
ముక్కలవని మనసు లేదు..
చిధ్రమవని చిత్తము లేదు..
సమస్తమూ సమిధలై పోతున్న..
ఈ విధి విలాసంలో..
నేనెంత? నా హృదయం ఎంత?
– మామిడాల శైలజ