చేరని లేఖ
చేరని లేఖ చెదిరిన కల
కుశలప్రశ్నల కూపీలు కావు
కుదురుగా కూర్చొని రాసే
ఫిర్యాదుల వాక్యాలు కావు
సంగతుల సారాంశం కాదు ఆ లేఖ మరేమిటి కథ…
ఇంటికి చేరని ఉద్యోగ లేఖ !
ఊరట లేని ఉద్యోగాన్వేషణ
నిరుద్యోగంలో నిండుగామునిగి
సమయాన్ని సాగతీసి
కాలాన్ని కఠోరంగా తిట్టి
ఉపాధి హామీ అవకాశాలవేట
ఎదురు చూపుల నేత్రాలు
సమస్యలతో సతమతం
పుస్తకాలతో కుస్తీ పట్టీ
ఎదురుచూసే ఎండమావిగా
ఆశచావని గందరగోళం
నిరాశను నిట్టూర్పు విడిచి
గెలిచి నిలవాలని సంకల్పం
అధికారికంగా అందుతుందని
ఆశాభావం
లక్ష కారణాల చదరంగం
విజయానికి ఒక్కటే మెట్టు అని
దశ దిశ మారుతుందని
వేచిచూసే ఉద్యోగ నిరుద్యోగ
పర్వంలో
ఎత్తు పల్లాల పయనంలో
ఎదురీతల సాగరంలో
మలుపులు తిరిగిన జీవితానికి
మారిన చిరునామా సాక్ష్యంగా
జరిగేదంతా మన మంచికే అని
మారిన లక్ష్యంతో ముందుకు
సాగినా ఇంటికి చేరని
ఉద్యోగ లేఖ సంగతుల
చిత్ర విచిత్రం మరి…..?
– జి జయ