చెలిమి కలిమి
ఏదయితేనేం లేచాక ఊరికే ఉంటామా
కప్పు కాఫీ కోసం వెతుకుతుంటాం
రూపం లేని ఆలోచనలకో రూపం కోసమో
వ్యాపకం లేని మనసుకో వ్యామోహం కోసమో
ద్యోతకం కాని సమూహాల్లో వెల్లడి కప్పు కాఫీ
వేడి చుక్క గొంతులో జారుతుంటే
చుక్కెదురయిన సందర్భాలన్నీ ముడుచుకుపోతుంటే
విజయం ఆవాహయామంటూ ఉదయం దీవించకుండా ఉంటుందా
పదపదమంటూ పోరేమదిని ప్రేమించక తప్పదు
కాఫీ రుచిని చూపించక తప్పదు
పెనవేసుకున్న అనుబంధం కదా కాఫీది
అంత తొందరగా వదలదు
మస్తిష్కం దుమ్ము దులిపి
కప్పు కాఫీతో వెల్లవేశామో
వెల్లువలా అక్షరాలు చెలిమి చేస్తాయిక
-సి.యస్.రాంబాబు