చెలిమి బంధం
నా డెందము అంధకార బంధురం..
నీ ఆగమనానికి పూర్వం..
నా ఉల్లము కల్లోలాల భరితం..
నీ అధినివేశ ప్రవేశానికి మునుపు..
అవ్యక్త స్థితి నుండి
అనంతమైన బ్రహ్మాండం
ఆవిష్కరించబడినట్లు…
నా నిశ్తబ్ద, నీరవ ఎడదలోన..
విజ్ఞాన వారిదంలా ఆవరించి…
మది మందిరాన్ని
ఆశల ఋతుపవనాలతో..
ఆత్మీయంగా తడిపావు..!
అంతర్గత ఆలోచనలకు…
అభివ్యక్తీకరణను నేర్పావు..
నిగూఢమైన భావావేషాలను
నిప్పు కణాలుగా మార్చేశావు..!
కానీ నేస్తం..!
ఈ బంధం లేషమాత్రమేననే వాస్తవాన్ని
ఎలా విశ్వసించగలను..?
అమేయమైన
సర్వ సృష్టిని యావత్తూ..
కాలమనే కాయుడు లయమొందించినట్లు…
మన చెలిమి బంధం కూడా…
క్షణభంగురమే కదా..!
– మామిడాల శైలజ