చెలగాటం

చెలగాటం

వెన్నెల్లో చందమామను
చూపిస్తూ అమ్మ చేతితో
పాలబువ్వ తిని అపురూపంగా
పెరిగిన దేహం అది!
నలుగు పెట్టి లాలపోసి
జోలపాడి నిదురబుచ్చితే
నిశ్చింతగా గుండెలపై
సేదతీరిన సుకుమార కాయం అది!
అరచేతుల్లో పెంచి
గుండెలపై నడిపిస్తూ
ఇంతింతై వటుడిoతై అన్నట్లు
దినదిన ప్రవర్థమానం
అవుతుంటే కన్న మమకారం
సెలయేరులై ప్రవహిస్తూ
కన్నతల్లి దిష్టి కడప
దాటదoటూ కడుపులో పెట్టుకొని
కాచుకున్న అమ్మజాతినే
మధమాత్సర్యాలతో
చెరబట్టి ఉచ్చనీచాలు
మరచి ఉన్మాదిలా మారి
ఆమె జీవితంతో చెలగాటం
ఆడుతున్న పురుష జాతి ప్రతీకా!
ఏరు దాటినంక తెప్ప తగలేసే
నీ పైశాచిక ప్రవర్తనకు
ఆడపిల్లల మానప్రాణాలకు
రక్షణ లేకుండా చేస్తున్న
నీ దౌర్భాగ్యపు జీవితానికి
విధించగల సరియైన శిక్ష
అంటూ అసలు ఉందా
ఈ అవనిలోన?

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *