చావు పుట్టుకలు నీడలే
ముళ్ళోకాలు మురిపెమై ప్రయత్నాలు
తపస్సులైనా అనునిత్యపు పొరలతో
కరగనిది… పరిస్థితుల ప్రభావం
దావానలమైనా కాలిపోనిది స్థబ్ధత
కలిగినది….తారతమ్యాలు చూపక
తాపత్రయం చెందని సహజత్వం
కాలం ప్రయాణం కూడా ఒక నీడనే…
నిను నడిపిస్తున్న ఆజ్ఞలతో….
హృదయపు చిరాకు తనం వేదనగా
రూపం దాల్చుతు…మానసిక అన్వేషణలో
జరిగిన ప్రత్యక్షాలను భయమనే తెరచాటున
కూటమి సంకేతాలుగా వింటూ…బతుకు
సమరమైనా ఓదార్చలేని స్థానానికి అంకితమై
పరిరక్షించుకోలేని పర్యాయాలతో ఎదుగుతూ
ఒదిగే ఓర్పు కూడా ఒక ఆంతరంగిన నీడనే…
నిన్నటి నిజంలోంచి ఫలితంగా గతం
విప్పబడినదై…నేటి క్షణాలకు దొరికిన
వర్తమానం విధేయతతో ఒలుచబడుతు…
తరిగిన వయస్సును గతం తాలుకుతో
సేదతీర్చుతు…చేజారిన బంధంగా
గడిచిపోయిన గతం సాయంచేయని
తీరమని ఒంటరి బాటసారికి తోడు కలిపిన
ఆధారం బతికినదై…చివరికి నడిచిన
గమ్యంతో ఆగిపోయిన జీవితం కూడా
ఒక నీడనే…
నిశీల ననచిన ప్రయత్నంలో తనదొక
ప్రమేయమని…జూపని ఆయుధంతో
సాగించిన పోరాటం తనకోసం కాదని…
అడగని పచ్చధనాలకు ఆయుష్యును
నింపుతు…వెలుగొక భాద్యతగా ప్రగతి
ప్రాకారాలపై కాలం నిరవదికలను అంతులేని
అభ్యుదయ సాధనగా చూపుతు…
వికసించిన మాసం చైత్రమై కోయిల గొంతున
రాగమై పలుకే చైతన్యం కూడా ఒక నీడనే…
నవమాసాల పురిటి వేదనలో….
తల్లిపాల ఋణం త్యాగమై పూసిన
మనిషివై…బతికిన నీ కాలాన్ని దేహ
భ్రాంతులకై ఆరాటపడుతు…ఉత్సాహాన్ని
విజయ కేతనంగా ఎగిరించుకోలేని
అనామికాలతో…శారీరక సుఖాల దాష్యానికి
దాసుడవై స్వార్థపు శ్వాసలతో విశ్వాసాన్ని
ప్రాపంచికానికి ముఖ్య పాత్ర వహించలేక…
నేర్పించని లోకం నాశనమని నీకు చెప్పనిది
అంతం వరకు నీతో నడిచిన చావు పుట్టుకలు
కూడా నీడలే..
-దేరంగుల భైరవ
మీరు వ్రాసిన విషయాలు అక్షర సత్యాలు.