చంద్రుడు
నా
సిర్ప టోపీ వదులైంది
గిన్నెలో
హాలీమ్ బదులుగా
అటుకులు నానుతున్నాయి
అమ్మీ జాన్ చేసే బిర్యానీకి
మసాలా సామాగ్రి
బజారులో దొరకటం లేదు
మార్కెట్లో మటన్ను
ముక్కలు కొడుతున్నారు కానీ
ఇంట్లో ఎంతసేపైనా ఉడకడం లేదు
ఛాయ్ వాసన
ముక్కు పరదాలను దాటి
లోనికి పోవటం లేదు
వాడు మోకాళ్లపై
మోకరిల్లాడు
నుదురును నేలకు ఆనించి
ప్రార్ధించాడు
నమాజ్ అయిపోయింది!
చంద్రుడు వచ్చాడు
సగమైనా వెన్నెల కురిపించలేదు!
మా ఇంట్లోనూ
మటన్ ముక్కలు ఉడకటం లేదు
కానీ
బిర్యానీ సామాగ్రి దొరికింది
వాడి కప్పులో
నా తేనీటిని సగం
తిరిగి నాపైనే కురిపించాడు
సిగ్గుతో
ఆకాశంలో చంద్రుడు
మోహమాటంతో
నా రంజాన్ చంద్రుడు
ముడుచుకుని సగమైపోయారు!!
అన్నట్టు
చెప్పడం మర్చిపోయాను
మా ఇళ్లు పక్క పక్కనే
ఆకలి ఏనాడో
మా సరిహద్దు కంచెను తినేసింది
నా తలపాగాను
వాడు చుట్టుకున్నాడు
వాడి సిర్ప టోపిని
నేను పెట్టుకున్నాను
అమ్మీ జాన్, అమ్మ
రోజులానే
తమ చీరల అంచుల మీద
పగిలిపోయిన
పువ్వులను దారంతో కడుతున్నారు
మా వైపు చూసి
నవ్వుకుంటున్నారు!
-గురువర్ధన్ రెడ్డి