చలించని గమనం నాది
నీ నమ్మకాన్ని నేనేనని నువు నమ్మినా
చలించని గమనం నాది…
వెనుదిరగను వేయి చీలికలు కాలేను
వెలుగునకు వారధిగా సంధ్యలను కడుతు
తొంగిచూచిన ఋతువుల సంక్రమణలతో
దిక్కులు పిక్కటిళ్ళేలా ప్రళయాగ్నిని కోరకా…
తెలవారుటతో సందేశమై శాశ్వతాలకు
నిజాల నిక్కచ్చి తనాన్ని ప్రాణంగా పోస్తున్నా
కలగన్న వాడికి లోకమై సాయపడతాను..
కాదనిన నాడు కారణం లేకుండానే
కడతేర్చుతాను…ఒడిదుడుకులు ఎన్నో
అడ్డగించినా ఒంటరి ప్రయానమై
కాలగతులకు అర్థమిస్తు సృష్టి నియామకం
నాలోనిదేనని మౌనం పాటిస్తు అంగీకార
సంపదలతో సాగిపోతున్నా కాలచక్రమై…
నా నియామకంలో కాలమై నీకు
సహాయ సాకారాలు చేకూర్చాలని లేదు…
తెరిచిన తలుపుల మధ్యన స్థబ్ధతగా
నిలబడి…. ఓటమి చివరన ఒదుగుతు
గెలుపునకు ముందర నినాదం పలుకని
సహజత్వంలో ప్రకృతిని పలకరిస్తు…
విధి రాయని నా ఆత్మకథకు సహాయం
నేనే సహకారం నేనే…
కాల పరిమాణం కూచే గొంతుల కరుకుకు
దొరకని కూర్పు…స్థన్యమివ్వని
తల్లిది తన తనువని నిలువును చీల్చుకోదు అనుబంధం లేని ఆశయాలను
ఆప్యాయతలతో చూరగొనలేక…చేసేది
కాలమని పోయేది ప్రాణమని కయ్యానికి
కాలు దువ్వితే…నీతరుపున సహయం
ఒడ్డున పడిన చేపలా కాల నిర్ణయానికి
తల వంచాల్సిందే….
-దేరంగుల భైరవ