బంధాలు
అమ్మ, అమ్మమ్మ, తాతమ్మ, నాయనమ్మ, తాత, ముత్తాత ,పెదనాన్న, బాబాయ్, పిన్ని, మరిది, మరదలు, అమ్మ వాళ్ళ చెల్లెలు, బాబాయ్ వాళ్ళ పిన్ని కూతురు, నాయనమ్మ చెల్లెలు మనవరాలు, అమ్మమ్మ చెల్లెలి కొడుకు ఉపనయనం, మరదలు చెల్లెలు కూతురు ఓనీ ఫంక్షన్ ,అంటూ చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబాలు బంధాలు చాలా ఉండేవి . అసలు ఎవరు కి ఎవరు ఏమవుతారో అనే సందిగ్ధం లో పిల్లలం ఉండేవాళ్లం.
ఎండాకాలం వచ్చిందంటే సెలవులు వస్తున్నాయని తెలియగానే ఎవరి ఇంటికి వెళ్లాలా అని వంతులు వేసుకొని మరీ వెళ్లి నెలకొద్ది ఉండేవాళ్ళం. అయినా వాళ్ళు విసుక్కునే వాళ్ళు కాదు . సంతోషంగా అన్ని రకాలుగా చేసి పెట్టేవాళ్ళు.
రాత్రుళ్ళు వెన్నెల భోజనాలు ఆపై చుక్కలను ఎక్కిస్తూ, కథలు రామాయణ, మహాభారతాలు, అమ్మమ్మలు, నాయనమ్మలు చెప్పడం. తాత వేమన పద్యాలు, సుమతి శతకాలు నేర్పించడం వంటివి చేసేవారు.
అప్పుడున్న బంధాలన్నీ ఎంతో అందంగా సంతోషంగా ఉండేవి. ఇలాంటి సమస్య వచ్చినా , అందరూ కూర్చొని మాట్లాడుకొని తమలో తాము సర్ది చెప్పుకునేవారు ,ఒకరికి ఒకరు పగలు, ద్వేషాలు లేకుండా సంతోషంగా జీవించేవారు.
అలాంటి బంధాలు ఎన్నో ఏళ్లు ఉండేవి. తాత ,ముత్తాతలు ఎంతో కాలం సంతోషంగా బ్రతికేవారు, పిల్లలను ఆటపట్టిస్తూ ఆ ఆటలో కూడా వాళ్ళకి నీతి కథలు, నీతి సూత్రాలు, విలువలు ఎన్నో నేర్పిస్తూ ఉండేవారు. అందువల్ల పిల్లలు అవన్నీ నేర్చుకొని మంచి జీవితాన్ని గడిపేవారు.
ఇక ప్రస్తుతానికి వద్దాం అమ్మమ్మ, తాత, అత్త, మామ అంటే ఎవరో కూడా తెలియదు ,ఇప్పటి పిల్లలకు తెలిసిందల్లా ఆటో అంకుల్, పనిమనిషి ఆంటీ, చెత్త అంకుల్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ అంకుల్, మమ్మీ, డాడీ తప్ప మరి ఇంకెవరో తెలియదు.
ఒకవేళ ఎవరైనా చుట్టాలు వస్తే హూ ఆర్ యు అని అడుగుతారు తప్ప రండి అత్తయ్య, రండి మామయ్య అంటూ తెలుగులో అసలు మాట్లాడే వారే లేరు, అసలు ఇప్పటి పిల్లలకి బంధాలు అంటే ఏమిటి అనేది తెలియవు.
ఇక అమ్మమ్మ, తాతయ్యలను, నాయనమ్మ లను, వృద్ధుల ఆశ్రమంలో చేర్పించిన తర్వాత వాళ్ళ ఊసే మర్చిపోయి ఫోనులో ఆటలు ఆడుకుంటూ మైమరిచిపోతున్నారు. సెలవులు అనగానే అప్పట్లో అమ్మమ్మ ఊరు పరిగెత్తే వాళ్లు.
ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అనే పేరు పెట్టుకుని పిల్లలని స్విమ్మింగ్, బ్యాటింగు, డాన్స్ అంటూ రకరకాల ఆక్టివిటీస్ లో చేర్పిస్తున్నారు. తప్ప అమ్మమ్మ, తాతయ్యల వద్దకు వెళ్లి నీతి సూత్రాలు, వేమన పద్యాలు ,తెలుగు అక్షరాలు నేర్చుకోమని తల్లిదండ్రులే చెప్పలేకపోతున్నప్పుడు ఇక మనం పిల్లలను అని ఏం లాభం చెప్పండి.
ఏదైనా తల్లిదండ్రుల దగ్గర నుంచే ఉంటుంది, పిల్లలకు బంధాలు నేర్పించాలన్నా ,వాళ్ళకి తెలుగు నేర్పించాలన్నా ,నీతి విలువలు సూత్రాలు నేర్పించాలన్నా, పెద్దలను ఎలా గౌరవించాలి నేర్పించాలన్నా, కూడా తల్లిదండ్రుల ప్రవర్తన ముఖ్యంగా ఉంటుంది.
తల్లిదండ్రులే తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధుల ఆశ్రమాల్లో చేర్పించినప్పుడు ఇక పిల్లలకి నీతి సూత్రాలు ఎలా చెప్పగలరు. ఎలా వారిని మంచి విలువలతో పెంచగలరు. అందుకే తల్లిదండ్రులు కాస్త ఆలోచించండి.
మీ ముందు తరాలు మీరు తాత, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని, బాబాయ్ అంటూ వరుసలు పెట్టి ఉమ్మడి కుటుంబంలో ఉండి అన్ని విలువలు నేర్చుకున్నారు. కానీ మీ పిల్లలకు అవేవీ తెలియకుండా పెంచుతున్నారు.
అలాంటప్పుడు ఇప్పుడు మీరు చేసిన పనే అంటే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం. లాంటివి మీ పిల్లలు కూడా మీకు చేస్తారని గుర్తించి, ఇప్పటికైనా కళ్ళు తెరచి, బంధాలను దగ్గరకు చేర్చుకోండి. కనీసం నెలకు ఒకసారైనా వెళ్లి మీ చుట్టాలందర్నీ కలవండి.
వారితో కలిసి సమయాన్ని గడపండి. అలాగే పల్లెటూర్లకు వెళ్లి మీ పిల్లలకు పంటలు ఏమిటి ? ఆ చెట్టు కాయలు ఏమిటి ?ఈ చెట్టు కాయలు ఏమిటి ? అని వాటి పేర్లు చూపిస్తూ, మీరు ఎలా ఆడుకునే వారో, ఆ చిన్నప్పటి ఆటలన్నీ మీ పిల్లలకు కూడా నేర్పిస్తారని ఆశిస్తూ, ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా చెప్పడానికి చాలా ఉంది. కానీ దీంతో మీకు బుద్ధి వస్తుందని భావిస్తూ సెలవు…
– భవ్య చారు