బతుకు దివిటీలు
ఓ… మావ..! నిన్నే.. ఇంతన్నావా.. ఐనా నా గోల నాదే గానీ నా గోడు నువ్వెప్పుడు ఇన్నావు గనకా.. ఓసోస్.. ఏటే..నీ బాధ.! పొద్దుపొద్దున్నే.. ఇప్పుడేటయ్యిందని.. సెబితే ఇంతా కదేటి.!
ఏటి సెప్పమంటావయ్యా మగడా.. కాపురానికొచ్చినకాడినుంచీ సెబుతూనే ఉన్నా.. నువ్ ఇంతానే ఉన్నావ్. ఐనా నువ్వేం మారావ్.. మనిల్లేం మారింది. దసరా ఎళ్లిపోనాది.. దీపాలి వచ్చేసినాది.. ఆ ఉత్సవం.. ఈ సంబరం అంటూ ఊరంతా సందడే.
మనింట్లో తప్ప.. మనకేదయ్యా ఆ ఏడుక.. ఇంకెప్పుడయ్యా వచ్చేది ఆ వెలుగు.. మన కట్టాలు తీరవా.. మన బతుకులు మారవా.!
ఏం సెప్పాలనుకుంటున్నావో కాసింత అర్ధమయ్యేలా సెప్పే లచ్చిమి.. ఏటేటో అనేసి ఓ సతాయించమాక.!
నీకేటీ అర్థం కాదు.. నా ఖర్మ.! నీకు గుర్తుందా మామ.. మన మనువయ్యేనాటికి నీకాడ రెండు కాడెద్దులుండేవి, మూడెకరాల నేలుండేది. వత్తా వాత్తా నేను కాసింత బంగారం మెళ్లో ఏసుకొత్తిని. ఆ యాల ఇయన్నీ సూసుకుని మనం సంతోసంగా బతికేయోచ్చని ఎంతో సంబరపడిపోనాం.
పెళ్లయి నాలుగేళ్లయ్యింది. అప్పటికంటే మనం బాగుండాలిగందా.. కానీ ఏందయ్యా మన బతుకు.. మొన్నటికి మొన్న మన సంటోడికి జొరమొస్తే వైద్యానికి నీ సేతికున్న ఒక్క ఉంగరం సావుకారుకాడ తాకట్టు ఎట్టీసేవు. నా నల్లపూసలమ్మి పంట పెట్టుబడికెట్టీసినావు. గాజులమ్మి ఎరువుల కిచ్చినావు. మనకి కట్టమొస్తే ఇకపై తాకట్టు పెట్టడానికి నువ్వూ నేనూ తప్ప మనకింకేటీ మిగల్నేదుకదయ్యా..
ఏడకే లచ్చి.. నువ్ సెప్పింది నిజమేనే. నేను మాత్రం ఏం సేత్తాను సెప్పు. నువ్వంటే మనసులో ఉన్న బాధ ఏడుపుతో కక్కేసినావు. నేను సెప్పనేక లోలోనే కుమిలిపోతున్నానే లచ్చిమీ. ఈ పంటకైనా కాసిన్ని కాసులొస్తయేమో కనీసం యాపారికాడ ఎక్కువ వడ్డీకి తెచ్చిన అప్పు తీరుద్దామనుకున్నాం.
ఆ ఆశ తీరనేదుకదే.. నువ్వేమో బేంకులో ఉన్న పుత్తెలతాడు ఇడిపిద్దామనుకున్నావ్.. గదీ జనగనేదు కదే. మాయదారి వానొచ్చి నోటికాడికొచ్చిన పంటంతా నీళ్లపాలు చేసేసినాదిగందా.. నాకేమో పొలం పని తప్ప మరోటి రాదాయే, తమ్ముడ్ని సదివిత్తే ఆడేమో ఉద్యోగమని పట్నం పోనాడు..
ఇల్లు సూత్తే సిన్న గాలి వానొస్తేనే కూలిపోయేలా ఉంది. కొత్తిల్లు కట్టుకుందామంటే ఉన్న ఈ గూడూ పోతుందేమోనని బయమేత్తందే..
పిల్లల్ని ఈది బడిలో ఎలాగో సదివిత్తన్నాం. నువ్వూ నేనూ కూలి పనికి పోతన్నాం. సేసిన అప్పులకు వడ్డీలు, ఇంటి కరుసులకోసం ఉన్న మూడెకరాల్లో రెండెన్నరెకరాలు అమ్మీసినాం.
ఇంక మనం పండుగలు, పబ్బాలంటే మిగిలిన ఆ కాసింత నేలతల్లిని కూడా నేడో రేపో తాకట్టెట్టీయ్యాల. ఇన్ని కట్టాలున్నా నాలుగు మెతుకులు నోటికాడికి ఎలతన్నాయంటే అది ఆ తల్లి దుర్గమ్మ దయేనే, ఆయమ్మ మనింట్లో ఏ నాటికైనా సిరులు కురిపిత్తాదే. అందాక మనకీ బాధలు తప్పవే లచ్చిమీ.
అవును మావ.. ఆ ఆశతోనే బతుకుతున్నా.. సర్లే ఇయన్నీ మనకు ఎప్పుడూ ఉండేవేగానీ.. ఈయాల దీపాల పండుగ గందా.. దుర్గమ్మ గుడికి పోయొద్దాం.. తొరగా పొలానికెళ్లొచ్చీ మావ..
అట్నే లచ్చిమీ.. నే నొచ్చేపాలికి పాపకి, సంటోడికి మొన్న సంతలో కొన్న మంచి బట్టలేసి బాగ ముస్తాబుసెయ్.. మనమెలా ఉన్నా పర్నేదు.. పిల్లలు బాగుండాల.. వచ్చేటప్పుడు టపాసులు తెత్తాలే..
మావో.. ఓ మాట.. ఈసారి టపాసులేం వద్దులే మావ.. టీవీలో సెప్తంటే ఇన్నాను.. ఆ పుగకి పర్యావరణం పాడైపోతన్నాదంట.. మనూళ్లో చెరువు నీళ్ల లాగా గాలి కూడా కాలుషితమైపోతాందట..
అవునే.. ఈ మధ్య పట్నం ఎల్లినపుడు ఆసుపత్రికాడ ఇదే మాటాడుకుంటున్నారు.. వాతావరణ కాలుష్యంతో ఏటేటో రోగాలొత్తన్నాయట..
అందుకే, ఈపాలి గోగు కర్రలు పట్రా చాలు.. దీపాల వెలుగులో పిల్లలు దివిటీలు కొట్టాల.. మన బతుకులు మారాల.. నువ్ బేగెల్లిరా మావ..!
– ది పెన్