బరువు
“అటక మీద ఆ మూడుచక్రాల సైకిల్ ఎందుకు. మొన్న అమెరికా నుండి వచ్చిన మనవడు కూడా ఆడుకోవడానికి ఇష్టపడలేదు కదా?” అంటాడు భార్యతో పరంజ్యోతి.
“అదేమైనా అడ్డమా ఏంటి? ఉండనివ్వండి అబ్బాయి గుర్తుగా ఉంటుంది” అంటుందామె.
“మన గృహప్రవేశానికి ఫలానావాళ్ళు పెట్టారు. వాళ్ళేమైనా అనుకోరూ” అంటుంది. వాళ్ళకింక ఏ పనీ లేనట్టు.
“అబ్బాయి పెళ్ళికి చిన్ని కూతురు ఇచ్చింది కాదూ. ఉంచండి దేనికైనా పనికొస్తుంది” అయితే ఆ చిన్ని ఎవరో పరంజ్యోతికి తన్నుకున్నా గుర్తు రాదు. ఇలా ఉంటాయి.
కొన్నిటికి అయిష్టంగా ఒప్పుకుంటుంది.
ఒకసారి ‘ఇంట్లో వస్తువేదైనా బయటకి వెళ్ళడం ఆడవాళ్ళకి ఇష్టం ఉండదండి’ అనేసింది. అదే ఆఖరు.
తన చేతుల్లో లేనిదేదైనా పరంజ్యోతి పట్టించుకోడు. ఆలోచన అయితే తుంచేస్తాడు. పని అయితే మొదలుపెట్టడు. వాదన అయితే పొడిగించడు.
జీవితం కూడా అంతే కదా.
పరంజ్యోతి వెళ్ళిపోయాడు. ఆవిడకి బయటకి పంపించక తప్పలేదు.
పరంజ్యోతి మినిమలిస్టు. అవసరం లేనిది ఏదీ ఉంచుకోడు. ఆయన అంతిమ కోర్కె అనుసరించి కళ్ళు దానం చేసారు.
-అనిసెట్టి శ్రీధర్