బంధం

బంధం

 

చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా,
పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న
పూలను చిగురుల చేతులతో తడిమి,
కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి,
తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో దిష్టి తీసి మురిసే చెట్టుకే తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో….

తీరచెలిని చూచుటకు చెంగు చెంగున ఎగురుతూ,
ఉత్సాహంగా ఉవ్వెత్తున ఎగసి ఉరకలు వేస్తూ,

కెరటాల కౌగిలిలో కరిగించే సంద్రానికి తెలుసు అనుబంధం అంటే ఏమిటో….

గూటిలో గులాబీ రంగు వర్ణంలో నోరు తెరిచి ఎదురుచూసే

పక్షి పిల్ల నోటిలో రోజంతా తిరిగి సేకరించిన ధాన్యపు పాలను పోసి

రెక్కలతో పొదువుకునే పక్షికి తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో…

సూర్య,చంద్రుల కళ్ళతో పగలు,

రాత్రి కంటికి రెప్పలా కాస్తూ,

వలపు వాన చినుకులతో చుంబించి పుడమిని పులకింపచేసి

సంబరపడే అంబరానికే తెలుసు బంధం అంటే ఏమిటో….

తాను ఎంత స్వేచ్ఛగా ఎగిరినా,

తనని భద్రంగా బంధించిన దారం పైన నమ్మకంతో

గాలిలో హాయిగా విహరించే గాలిపటానికి తెలుసు బంధం అంటే ఏమిటో….

ఋతువులకు తగ్గట్టు రంగురంగుల అలంకరణలతో

అలంకరించుకుని కవ్విస్తూ అభిసారికయై నింగిని కలుసుకోవడానికి

తాపత్రయపడే భూమికి తెలుసు బంధం అంటే ఏమిటో….

కణకణ మండే సూర్యకాంతిని తనలో నింపి జగతికి చల్లని వెన్నెల పంచే

జాబిలమ్మకు తెలుసు బంధం అంటే ఏమిటో….

అనిర్వచనీయమైన ప్రేమ తో పెనవేసుకున్న ప్రణయానురాగంతో

జగతికి ఆదర్శంగా నిలిచే ప్రేమమూర్తులైన రాధాకృష్ణులకు తెలుసు జన్మ జన్మల బంధం అంటే ఏమిటో…

బంధాలను బంధీ చేసి అవసరాల బావిలో తోసి,

ఆర్థిక స్వాతంత్ర్యంతో ఆధునికత సమాధి చేసి ఈర్ష్యా,

అసూయ దర్భలు ధరించి తోబుట్టువుల రక్తతర్పణతో

తిలోదకాలు అర్పించిన మన తరానికి ఎలా తెలుస్తుంది బంధం అంటే ఏమిటో….

– సలాది భాగ్యలక్ష్మి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *