బంధం
బంధం ఏదైనా నమ్మకం ముఖ్యం నమ్మకం లేని బంధం ఏదైనా వృధానే…
ఒరేయ్ అన్నయ్య నాకు ఎల్లుండి ఎగ్జామ్ ఉంది నువ్వు నాతో వస్తావా అంటూ అడిగింది లత. నేను ఎందుకే నీతో అవసరం లేదు నువ్వు ఒక్కదానివే వెళ్లిరా, నేను రావడం ఎందుకు?
అయినా నా బాబాయ్ ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఎగ్జామ్ రాయడం ఎందుకే మరోసారి రాసుకోవచ్చులే ఎంత చదివినా పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళే దానివి కదా ఇప్పుడు చదువు అవసరమా అన్నాడు నిష్టూరంగా మురళి.
ఇదిగో చూడు అన్నయ్య నువ్వు ఇలా అంటే నాకు ఎక్కడో మండుతుంది. ఎంత వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళేవాళ్ళం అయినా మా కాళ్ళ మీద మేము నిలబడాలని మాకు మాత్రం ఉంటుంది.
చదువుకుంటే తప్పేంటి ఆయన నీ సన్నిధిలో తీసుకు వెళ్తున్నట్టు ఆ మాటలు ఏంటి నేను నాకు వచ్చిన స్కాలర్షిప్ తోనే చదువుకుంటున్నాను నాకు ఎవరు ఏమి ఇవ్వడం లేదులే అంది లత.
అబ్బో బోడీ స్కాలర్షిప్ తోనే చదువుకుంటున్నావా చిన్నప్పటినుంచి పెట్టింది ఎవరు. ఇప్పుడు పెట్టి, పెళ్లి కి పెట్టి, పిల్లలు పుడితే బారసాలకి పెట్టి, ఇలా జీవితాంతం మీకు పెడుతూనే ఉండాలి. ఎంత పెట్టినా ఇంకా పెట్టలేదు అనే మాటలు పైగా అన్నాడు మురళి.
మన తల్లిదండ్రులకి మనమిద్దరం నిన్ను ఎలా చదివిస్తున్నారు నన్ను అలాగే చదివిస్తున్నారు నువ్వు ఎలా సంపాదించి వాళ్ళని చూసుకోవాలి అని అనుకుంటున్నావో నేను అలాగే చూసుకోవాలని అనుకుంటున్నాను.
ఈ విషయంలో ఇంకో మాట లేదు అయినా అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి ఇందులో వ్యత్యాసాలు ఎందుకు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు చదువు సంస్కారం ఉండి కూడా ఈ మాటలు ఏంటి అన్నయ్య అంది లత.
ఎంతైనా ఆడవారు ఆడవారే ఇక్కడి వారు కాదు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళవలసిందే మేము పెట్టాల్సిందే. దీనికి ఇంకో మాట లేదు.
ఇప్పుడు ఇంతగా చదివించి పరీక్షలు రాయించిన మీరు సంపాదించి పెట్టేది మాత్రం మీ అత్తగారి తరపు వారికే పెళ్లయ్యాక మావైపు చూడమన్నా చూడరు అన్నాడు మురళి.
అదంతా నీకు నమ్మకం లేక మాట్లాడే మాటలు నేను పెళ్లి అయినా కూడా మీ అందర్నీ చూసుకుంటాను చూస్తూ ఉండు అంది లత. ఆ బోడి చూద్దాంలే అంటూ లోపలికి వెళ్లి పోయాడు మురళి.
ఏవరు రాకుండానే లత వెళ్లి ఎగ్జామ్ రాసి వచ్చింది. రోజులు గడుస్తూ వున్నాయి. లత కి ఒక మంచి సంబంధం వచ్చి అనుకోకుండా పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. మురళి లికి కూడా ఉన్న ఊర్లోనే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశారు.
**********
ఏంటమ్మా ఇలా బయట కూర్చున్నావ్, వదిన ఏది పిల్లలు ఏరి అంటూ లోపలికి వచ్చింది లత. పెద్ద చేతిలోంచి బ్యాగు తీసుకుంటూ వదిన పిల్లలు ఇద్దరు అలా గుడి వైపు వెళ్లారు అమ్మ. అన్నయ్య కు తోడుగా ఎవరూ లేరని నేను ఇంట్లోనే ఉండిపోయాను అంది తల్లి బ్యాగు లోపల పెడుతూ…
అవునా సరే అంటూ కాళ్ళు కడుక్కొని వచ్చిన లత అన్నయ్య ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ కుర్చీలో కూర్చుంటూ అన్నయ్య ఎలా ఉంది నీ ఆరోగ్యం ఇప్పుడు బాగుందా ఇదిగో నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటూ తన బ్యాగ్ లోంచి మంచి పుస్తకాలు తీసి మంచం పక్కన పెట్టింది.
మురళి లత ని చూస్తూ లతా ఎందుకు ఇవన్నీ ఇప్పటికే నా భారం నా పిల్లల భారం అంతా నీ పై వేసుకున్నావు దాంతో పాటు ఇవి కూడా అవసరమా?
ఎందుకు నన్ను ఇంకా ఋణ గ్రస్తున్ని చేస్తావ్. ఇప్పటికే మా బాధ్యత అంతా పంచుకొని మాకు అన్నీ అయి చూస్తున్నావు. ఇప్పుడీ పుస్తకాలు తీసుకురాకపోతే ఏమవుతుంది అన్నాడు బాధగా మురళి.
అన్నయ్య నేను మీ బాధ్యత అని మోస్తున్నానని అనుకోవడం లేదు, ఇది నాకేం భారం కాదు. నీ పరిస్థితిలో నేను ఉంటే నువ్వు చేసే వాడివి కాదా…
అయినా ఏదో ఓ ఓ ఒక ఉపద్రవం వచ్చి పడిందని ఇలా బెంబేలు పడితే ఎలా, ఇంకెన్ని రోజులు మహా అయితే మూడు నెలలు నువ్వు చలాకీగా లేచి కూర్చుంటావు నాకు ఇంతకన్నా ఎక్కువ చేయవు.
నీకు మంచి రోజులు వస్తాయి అన్నయ్య నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు అనవసరంగా కంగారుపడకు బాధపడకు ఎలాంటి టెన్షన్ లేకుండా బలమైన ఆహారం తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ హాయిగా ఉండు.
నేను ఉన్నాను కదా నేను అన్నీ చూసుకుంటాను. ఏదైనా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అన్నయ్య మంచి రోజులు వస్తాయని మనం ఎదురు చూస్తూ ఓపికతో ఉండాలి అంతే.
అయినా నిన్ను బాధ అనుకోవడానికి నువ్వు నాకేం కాకుండా పోవు కదా మనది అన్నాచెల్లెళ్ల బంధం. రక్తసంబంధం అన్నయ్య, ఎన్ని అనుకున్నా ఏది ఏమైనా మనం ఎప్పుడూ కలిసే ఉంటాం అంది లత ఆప్యాయంగా అన్నయ్యని చూస్తూ…
లత మాటలు విన్న మురళికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. డ్యూటీ లో నుంచి వస్తున్న తనకు లారీ యాక్సిడెంట్ అయి వెన్నెముక దెబ్బతినడంతో మంచంలో పడ్డాడు.
అప్పటికే నాన్నగారు కాలం చేయడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా అయింది. సంపాదన కూడా లేకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో నేనున్నానంటూ ఆసరా ఇచ్చింది లత.
తన అత్తగారిని, భర్త ని ఒప్పించి తన జీతం మొత్తం తమ కుటుంబానికి ఖర్చు పెడుతుంది. ప్రతిరోజు డ్యూటీ నుంచి వస్తూ ఏదో ఒకటి కొని తేవడం తనకి కాలక్షేపం కావడం లేదని పుస్తకాలు కొనుక్కొచ్చి చదివి వినిపించడం, ఇంట్లోకి ఏ వస్తువు కావాలన్నా అన్నీ తానే చూసుకోవడం చేస్తుంది.
ఒకప్పుడు ఆడపిల్లలు అత్తారింటికి వెళ్తే తిరిగి రారు అని తన మాటలను వెనక్కి తీసుకున్నాడు మురళి. ఆలోచన నుంచి బయటకు వచ్చి లతా నువ్వు నిజంగా ఆడపిల్లవు కాదు ఇక్కడి పిల్లవే…
ఆరోజు నేను అన్నమాటలు వెనక్కి తీసుకుంటున్నా, నువ్వు అన్నట్టుగా ఇది మామూలు బంధం కాదు రక్తసంబంధం.
ఈ జన్మకు ఇదే మన జన్మ జన్మల బంధం అన్నాడు ఆర్తిగా…. అవునండి లతా మనందరికి కన్నతల్లి అంది అప్పుడే వచ్చిన వనజ లతని కౌగిలించుకుంటూ… అన్నాచెల్లెళ్ల ప్రేమని చూస్తున్న శారదాంబ తృప్తిగా కొంగుతో కళ్ళు ఒత్తుకుంది….
-భవ్య చారు
Good