అతిథి 

అతిథి

ఈశ్వర్ ముప్పై అయిదేళ్ళుగా సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు, మూడేళ్ళకి ఒకసారి ఒక వారం సొంత ఊరికి వచ్చేవాడు. ఎప్పుడో ఒకసారి రావటం వలన అందరినీ కలిసే సరికి ఆ వారం రోజులు ఇట్టే గడిచిపోయేవి.
భార్య, ఇద్దరు పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాననే బాధ లోపల ఉన్నా, ఇదంతా వారి భవిష్యత్తు కోసమే కదా అని సరిపెట్టుకునేవాడు. 
రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతుండగా, ఇంక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కుటుంబంతో ఉండాలనుకుని, ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో వాళ్ళని సరదాగా ఆటపట్టిద్దామని, ఒకటి రెండు రోజులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టు నటించి, తర్వాత నవ్విద్దామని అనుకున్నాడు.
తన ఎక్షైట్మెంట్ అంతా దాచిపెట్టి నటించాడు. భార్య ఏం వండినా, ఏం చేసినా వంక పెట్టాడు, బాలేదని విసుక్కున్నాడు. కొడుకు స్నేహితులతో కలిసి బైటకి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే కసురుకున్నాడు.
ఇంక నుండి రాత్రి తిరుగుళ్ళు మానేయాలని గట్టిగా చెప్పాడు. కూతురు కాలేజీలో నాలుగో ర్యాంక్ వస్తే, మొదటి ర్యాంక్ ఎందుకు రాలేదని కోప్పడ్డాడు.
ఒక రెండు రోజులు ఇలా గడిచాక, ఆరోజు ఇంక తన నాటకం ఆపేసి ఇంట్లో సర్ప్రైస్ చేద్దామని, ఉదయం బయటకి వెళ్ళి భార్యకి, పిల్లలకి ఇష్టమైన స్వీట్లు, బట్టలు కొన్నాడు. ఇంటికి వచ్చేసరికి భార్య, పిల్లలు తన గురించి మాట్లాడుకోవటం వినిపించింది.
కూతురు: ఈయన ఇప్పుడు ఎందుకు వచ్చాడమ్మా…?  ఇంకొన్నాళ్ళు అక్కడే ఉంటే ఇంకాస్త డబ్బులు వచ్చేవిగా. మనకి కూడా ఈ నస తప్పేది. 
కొడుకు: రిటైర్ అవ్వటానికి ఇంకా టైం ఉందిగా, ఏం కొంపలు మునిగిపోయాయని అప్పుడే వచ్చేసాడు.
అక్కడ వచ్చినన్ని డబ్బులు ఇక్కడ ఏం చేస్తే వస్తాయి, అది కూడా తెలీదా ఆయనికి, మన గురించి ఆలోచించడా అసలు.
భార్య: మీలాగ నేను పైకి అనలేనురా, ఏమైనా నాకు తప్పదుగా, ఏం చేస్తాం మన ఖర్మ!
ఇదంతా విన్న ఈశ్వర్ కి షాకింగ్ గా ఉంది! ఇన్నాళ్ళూ దూరంగా ఉన్నందుకు తన ఫ్యామిలీ తనని మిస్స్ అవుతుంది అనుకున్నాడు. తను ఇంటికి వచ్చేసాడని వాళ్ళు సంతోషిస్తారని అనుకున్నాడు.
ఇన్ని సంవత్సరాలు తన గురించి ఆలోచించుకోకుండా ప్రతి రూపాయి కూడబెట్టి ఇంటికే పంపించాడు. తన లైఫ్ మొత్తం వాళ్ళకోసమే కష్టపడ్డాడు.
కానీ వాళ్ళు తనని ఒక మనీ ఎర్నింగ్ మెషిన్ లా మాత్రమే చూస్తున్నారని, తన రాక వాళ్ళకి ఇబ్బందిగా ఉందనీ అర్థమయ్యాక ఇంక అక్కడ ఉండలేకపోయాడు.
ఇన్నాళ్ళు వీళ్ళకోసం కష్టపడింది చాలు, ఇంకనుండైనా తన లైఫ్ తన కోసం, తనకి నచ్చినట్టు బ్రతకాలి అని నిర్ణయించుకున్నాడు. 
ఇంకో ఉద్యోగం ఎదో వచ్చింది అని చెప్పి, ఆ ఊరి నుండి, వాళ్ళ నుండీ దూరంగా వెళ్ళిపోయాడు.
– ఇస్మాయిల్ భాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *