అతి సర్వత్రా…
మంచితనం వల్ల కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటారు. మంచితనం వల్ల కొందరు మొహమాటానికి పోయి తమ ప్రాణాలు కోల్పోయిన సంఘటన లు జరుగుతున్నాయి. మచ్చుకు ఒక సంఘటన చెప్తాను.
మా నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. తన పని ఏదో తాను చేసుకుంటూ నలుగురికి సాయం చేస్తూ ఉండేవారు.
అయితే మాకు దూరపు బంధువులు మా పక్కూర్లోనే ఉన్నారని మా అత్తయ్యకు వాళ్ళు ఆడపడుచు వరస బంధువులు అని తెలిసి సంతోషించారు.
వారి వల్ల మా అత్తయ్య క్షేమ సమాచారాలు తెలుస్తాయి అనే ఒకే ఒక్క చిన్న కారణం వారి ఇంటికి వెళ్లేలా చేసింది. రాక పోకలు మొదలయ్యాయి.
ఆయన కూతురు కూడా నాతో పాటు కాలేజీలో చదువుతుంది అని తెలిసి రోజు కలిసి వెళ్ళవచ్చు అని అనుకున్నాం. అలాగే వెళ్తున్నాం కూడా. అలా రోజులు గడిచిపోతూ వుండగా ఒక ఆదివారం నాడు ఆయన పెద్ద అబ్బాయి మా ఇంటికి రావడం జరిగింది.
టీలు, టిఫిన్ లు అయ్యాక అతను వచ్చిన విషయం మెల్లిగా బయట పెట్టాడు. అది ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్ లో తాను లోను తీసుకుంటున్న అని దానికి మా నాన్నగారు హామీ ఉండాలని ప్రతి పాదన తెచ్చారు.
ఆ డబ్బు వల్ల తన చెల్లి పెళ్లి చేయాలి అనుకుంటున్నా అని చెప్పడంతో మా నాన్నగారు చెల్లి తరపు బంధువులు, పైగా ఆడపిల్ల పెళ్లి అంటున్నారు కదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా హామీ పత్రాల పైన సంతకం పెట్టేశారు.
అతను ఆ పత్రాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాక కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజు రాత్రికో రాత్రి బిచానా ఎత్తేశారు. నెల కాగానే వడ్డీ డబ్బుల కోసం మార్గదర్శి వాళ్ళు మా నాన్నగారు పని చేసే చోటు కు రావడంతో మాకు విషయం తెలిసింది.
దాంతో వారి ఇంటికి వెళ్ళి కనుక్కుంటే కొత్త విషయాలు తెలిసాయి. ఏంటంటే వారు అప్పుచేయని చోటు, అప్పు చేయని మనిషి లేడని. దాంతో ఇక ఏం చేయాలో తెలియక నేనే హామీ ఉన్నాను కాబట్టి నేనే కడతా అంటూ నాన్నగారు వారికి చెప్పారు. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇక అప్పటి నుండి ఒక పూట తిని, తినక కొన్నాళ్ళు అంటే దాదాపు రెండేళ్లు కష్టపడి అన్ని చంపుకుని ఆ రెండు లక్షల బాకీ కట్టేసారు నాన్న గారు.
అతి మంచితనం వల్ల మేము నష్టపోయిన డబ్బు ఇది కేవలం మచ్చుకు ఒకటి మాత్రమే.ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
అందుకే అతి మంచితనం పనికి రాదు. అందుకే అంటారు అతి సర్వత్రా వర్జయేత్ అని…
– అర్చన