అతడు నా స్వప్నం
సముద్రాలు దాటొచ్చిన వ్యాపారం
దేశాల్ని బానిస దేహాలు చేసి
తన నౌకలకు తాళ్ళతో కట్టి లాకెళ్ళాలని చూస్తుంది
అప్పుడు చరిత్ర ప్రతి దేశంలో నీలాంటి గెరిల్లాల్ని ప్రసవిస్తుంది
నిన్నక్కడ చేగువేరా అంటారు
ఇక్కడ మేం అల్లూరి సీతారామరాజు అంటాం
వాడు ఈ దేశం మొత్తాన్ని
హుక్కాగొట్టంలో పొగాకులా కూరుకుంటున్నప్పుడు
నువ్వో బందూకువై పేలావు
మనిషంటే నెత్తురు మండే స్వేచ్చనీ
గాయపడ్డ స్వాతంత్ర్యమనీ
గుండె బద్దలయ్యే ధిక్కారమనీ
శత్రుభయంకరంగా బాణాలెక్కుబెట్టావు
జాతిరక్తంలోకి దళారుల కల్తీ చొరబడుతున్నప్పుడు
నువ్వో మరఫిరంగివై భయపెట్టావు
దేశపటం మీద విశృంఖలంగా బుసలు కొడుతున్న తెల్లపాముల్ని
తోక పట్టుకొని సముద్రాలకవతల విసిరెయ్యాలన్న
నీ యుద్ధ భాష గూడేల గడపలమీద పసుప్పచ్చని పూతై మెరిసింది
అడవిజింకలు అమ్ములపొదిలు తొడుక్కున్నాయి
వీరులకు వెన్నుపోట్లు కొత్తేం కాదు
పాలకులకు దళారులు, పీడకులకు గులాములు లేని
జాతులు భూగోళమ్మీద లేనేలేవు
నువ్వూదిన కొలిమికి మన్యం కార్చిచ్చై జనం నిప్పులై ఎగిసినప్పుడు
శత్రువు పిరికితనపు క్రూరత్వానికి
నువ్వో మరణించిన మహాసముద్రానివయ్యావు
**
స్వాతంత్ర్యమంటే జాతీయజెండా చుట్టుకొలతలు రంగులు మారటం కాదు
స్వేచ్చ అంటే ఉరితాళ్ళకు మనమే బంగారుపూత పూసుకోవటం కాదు
ఒక భయంకర మోసాన్ని, నమ్మకద్రోహాన్ని
అక్షరాల్లో దట్టించి దాన్ని రాజ్యాంగమని బొంకటం కాదు
అడవి కడుపు మీద కంత చేసి వనరుల్ని తోలుకెళ్ళటం కాదు
సీతారామరాజూ! ఇవ్వాళ నువ్వంటే ఓ విగ్రహమనుకుంటున్నారు
హంతకులే నీకు దండలేస్తున్నారు
నిన్నో తపాలా బిళ్ళకు కుదించి చప్పట్లు కొట్టుకుంటున్నారు
నీ బొమ్మని వెండితెరమీద సొమ్ము చేసుకుంటున్నారు
ఏ పాలబుగ్గల పసివాడు ఎన్ కౌంటరయ్యాడని విన్నప్పుడల్లా
వీళ్ళందరూ నిన్ను మళ్ళీ మళ్ళీ చంపేసినట్లే అనిపిస్తుంది
అడవులేకాదు మైదనాలు కూడా నీకోసం చూస్తున్నాయి
“కవిత్వంలో ఉన్నంతసేపూ….” సంపుటి నుండి)
జులై 4 అల్లూరి సీతారామ రాజు పుట్టినరోజు.
-గురువర్థన్ రెడ్డి