అస్తిత్వ పెనుగులాట
ప్రాణ సమానమైన మీకు.
నేనింకా లోకాన్ని చూడకముందే నాకోసం వేయికళ్లతో వేచి ఉన్నాయి మీ నయనాలు. కనురెప్పైనా తెరవకముందే అమ్మా నాన్నలను మించి అపురూపంగా కాచుకున్నారు..
కాస్త కన్నీరొలికితే కలవరపడ్డారు.. నిద్రలో ఉలికిపడితే ఊరటగా నిలిచారు. మీ ఒడే నాకు ఆది పాఠశాల అయింది. మీ వాత్సల్యపూరితమైన మమకారమే నాకు ఊపిరి అయింది.
ఏ నీలి నీడ నాపై ప్రసరించకుండా అష్టదిక్పాలకుల్లా కాచుకున్నారు. నా ప్రతి అడుగును పదిలంగా, నా నడతను వినయంగా తీర్చిదిద్ది విలక్షణమైన వ్యక్తిగా నిలబెట్టారు.
అట్టడుగున మీరున్నా అత్యున్నత స్థాయిలో నన్ను చూడాలని పరితపించారు..
ముగ్గురన్నల మురిపాల చెల్లిగా అమ్మానాన్నల ప్రేమను మించి నా మంచి చెడ్డలను పర్యవేక్షిస్తూ గాజు బొమ్మలా చూసుకున్నారు.. కానీ ఒక్కటి మాత్రం మరిచారు..
మీ ప్రేమ పరవశంలో మునిగి బయట ప్రపంచపు పోకడలను గమనించనివ్వలేదు. మీ అనురాగ వెల్లువలో మునిగిన నాకు ప్రపంచమంతా రంగుల హరివిల్లే అని భ్రమించాను. లోక సమస్తము మీకు ప్రతిబింబాలే అనుకున్నాను.
మొదటిసారిగా మీ పరోక్షంలో నేను వేసిన అడుగుకే విభిన్నమైన వివాదాస్పద మనస్తత్వాల సుడిగుండాల తాకిడికి అతలాకుతలమయ్యాను. నేను ఊహించని పరిస్థితులను చూసి, కలలోనైనా దర్శించని కఠిన మనస్కులను గాంచి భయకంపితురాలినయ్యాను.
జగడాలమయమైన లోకాన్ని ఎదుర్కోలేక, నన్ను నేను అందుకు అనుగుణంగా మలుచుకోలేక ఉన్న పరిస్థితులకు, ఎదురవుతున్న పరిణామాలను సమన్వయం చేసుకోలేక సతమతమయ్యాను.
రాకాసి లోకాన్ని ఎదుర్కోలేక రక్త పిపాసుల రాక్షసానందాన్ని భరించలేక నాలో నేనే ముడుచుకుపోయాను. నన్ను నేను శిక్షించుకుంటూ నాలుగు గోడల మధ్య నలిగిపోయాను. లోక విరుద్ధమైన ఆలోచనలతో ఎవరికీ కాని ఏకాకిలా ఒంటరి పయనం చేయలేక ఓడిపోయాను.. డస్సి పోయాను..
మీ అండదండలతో నన్ను నేను కూడదీసుకోవడానికి ఎంతో శ్రమ పడ్డాను. మృత్యువు వాకిలిలోకి వెళ్లి మరీ నాదైనా అస్తిత్వాన్ని పునర్నిర్మించుకొని నన్ను నన్నుగా నిరూపించుకునే ప్రయత్నంలో నాదైన అడుగులు వేస్తూ పోగొట్టుకున్న చోటే తిరిగి సంపాదిస్తూ విజయ శిఖరాల వైపు అడుగులు వేస్తున్నాను..
జీవిత సమరంలోని ఉత్తాన పతనాలలో, మనోధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితులలో నా నీడను కూడా వదలని నిర్మల హృదయులైన మీకు ఎలా చెప్పుకోను వేన వేల కృతజ్ఞతలు?
నా సహోదరులారా మీకు నా పాదాభివందనములు…
-మామిడాల శైలజ