ఆశసంతకం అతడు
కవిత్వం రాసినవాడు
చిమ్మచీకటిలో ఓ దీపమవుతాడు
విరక్తికాలం మీద
ఆశసంతకం కవి
దుర్మోహాలను శూన్యపరిచే
తలను మొండానికి అమర్చేవాడే గానీ
కవియే మోహంలో మునిగితే
రాసిన అక్షరాలు సిగ్గుపడతాయి
కవితలు…..
కాలికి తొడిగే చెప్పులు కావు
తూలని నడకలు అవీ,
తూలినా తిరిగి నిలబెట్టే ఊతలు
కవిత్వమెపుడూ గారడీ కాదు
కనువిప్పు
అలంకారాలు కప్పావు సరే
లోపల తడితగిలే జీవితమేదీ!?
గుండెలోంచి నిషాని చెరిగేసీ
చైతన్యాన్ని ఉషోదయంగా మిగల్చాలి
అపుడే అదొక బతుకుపొద్దు!
చెర్లో పూసిన తామరల కన్నా ముందు
బండపై బట్టలుదికే చాకలాకలి
కవి పట్టించుకుంటాడు
చిరిగిన వలలోంచీ జాలరిబువ్వకలలు
తప్పించుకోవడాన్ని కవి పద్యం రాస్తాడు
ఆకాశాన్ని చుక్కలముగ్గుగా వర్ణించడం కంటే
నేలనొక బాధపొక్కిలిగా మాట్లాడ్డమే కవితనం!
కవి చచ్ఛిపోతాడు, మామూలు మనిషిలాగే
బూడిదమన్నుగా మిగుల్తాడు
గడ్డుకాలాన్ని దాటించే కవిత్వమే చిరంజీవి
కవిత్వం ఎప్పటికి ఆరనిదీపం కావాలి
పఠితను మర్చిపోయనీయని స్థితిలోకి నెడితే
కవితది మహిమ!
కవివన్నె కవితలో దాగుంటది
కవితవన్నియ హృదయాల్ని వెంటాడుతుంది
పోటెత్తే కాల్వను దాటించే ఎండుతాడివంతెన కవిత
దాని మీద భయం లేకుండా జనం అటునిటు నడుస్తారు
దుర్మార్గాన్ని యెండగట్టడమే కవిత్వరహస్యం!
-గురువర్థన్ రెడ్డి
అద్భుతంగా వ్రాసారు. మీరు వ్రాసినవి అక్షర సత్యాలు.