అసలు సంగతి

అసలు సంగతి

 

” ఆ ఇంటి పక్క అదే పనిగా చూడకండి.మొన్న శనివారం ఉదయం, సాయంత్రం భార్యా భర్తలు, పిల్లలు మధ్య ఒకటే గొడవ. ఆయన ఇంటి నుండి వెళ్లిపోవాలి అని బ్రీఫ్ కేస్ పట్టుకుని వెళ్లిపోడం..పాపం వాళ్ళు కాళ్ళా వేళ్ళా పడి ఆపడం. ఇదే తంతు” టై అందిస్తూ మధు చెప్పుకు పోతూంది. నేను ఊ కొడుతూ వింటూ చక చకా రెడీ అవుతున్న. విజయవాడ పక్కనే ఉన్న ఊరిలోని బ్యాంక్ కి నెల క్రితమే ట్రాన్స్ఫర్ అయ్యాను. డైలీ ట్రావెల్ చేయలేక ఊరిలో ఉన్న మా బాబాయ్ గారి స్నేహితుని ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాను.

వారానికి ఒకసారి ఇంటికొచ్చి పోతూ ఉంటాను. ఈసారి వచ్చినప్పుడు గమనించాను పక్కింట్లో ఫస్ట్ ఫ్లోర్ లో కొత్తగా ఒక ఫామిలీ అద్దెకి దిగినట్లు ఉన్నారు..మా బెడ్ రూమ్ బాల్కనీ నుండి చూస్తే వాళ్లు మెట్లెక్కి ఇంట్లోకి వెళ్లడం, హాల్లోకి వెళ్లి కూర్చోడం వరకు కనిపిస్తుంది స్పష్టంగా.

‘అలా ఒకరింట్లోకి తొంగి చూడటం సంస్కారం కాదు మధూ” అన్నాను
“అయ్యో నేనేం బైనాక్కులర్స్ పెట్టుకుని చూస్తున్నానా ఏంటి? మీరు మరీనూ” అంటూ టిఫిన్ ప్లేట్ అందించింది.
టిఫిన్ తింటుండగా పెద్దగా అరుపులు, కేకలు ఏడుపులూ వినిపించాయి. ప్లేట్ పక్కన పెట్టి పరుగున వెళ్లి చూసాను.
అతడు ఒక బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్తుంటే ఆ ఇల్లాలు కళ్లనీళ్ళతో గుమ్మం దగ్గర నిలబడి ఉంది. పిల్లలు “డాడీ ప్లీజ్ డాడీ” అంటూ అతని కాలు పట్టుకుని లాగుతున్నారు. అర్ పాపం చిన్న పిల్లలు..గట్టిగా పదిహేను, పదహారేళ్ళ వాళ్ళు అనుకున్నాను బాధగా.
వారిని విదిలించుకుని వెళ్ళిపోయాడు అతడు.
కాఫీ ఇస్తూ అంది మధు, “రోజూ జరిగే తంతు ఇది”. ఇలా అతడు భార్యా పిల్లల్ని వదిలి వెళ్ళడం, మళ్ళీ రాత్రికి ఇంటికి రావడం. ఈరోజు ఏకంగా బ్రీఫ్ కేస్ తో సహా వెళ్తున్నాడు”

“అవునా, ఇదేంటి ఇదేదో మిస్టరీ లా ఉందే!” అన్నాను.
………….

“గుడ్ మార్నింగ్ సార్”, అనే గొంతు విని తలపైకెత్తి చూసి ఆశ్చర్యంతో, “గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి” అన్నాను, అతనిని చూసి.
“లోన్ అప్లై చేసి వన్ వీక్ అయింది ఇంకా శాంక్షన్ చేయలేదు. సిబిల్ స్కోరు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి ” అన్నాడు అతడు.
” నిజానికి మీ లోన్ ఎప్పుడో శాంక్షన్ అయిందండి. మీతో పాటుగా అప్లై చేసినవారివి కూడా అయ్యాయి. కానీ, ఇంతకు పూర్వం ఇక్కడ ఉన్న లోన్ ఆఫీసర్ మీద కంప్లైంట్స్ వచ్చి అతడు శాంక్షన్ చేసిన లోన్స్ అన్ని క్యాన్సల్ చేశారు. మాకు నిన్నే పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి ..మీ అప్లికేషన్స్ మళ్ళీ ఒకసారి పరిశీలించి చూస్తాము. వర్రీ అవకండి. తప్పక మీకు లోన్ వస్తుంది” అన్నాను.
థాంక్స్ చెప్పి ఏదో గొణుక్కుంటూ లేచి వెళ్ళాడు. లంచ్ టైం అవడంతో నేను లేవబోతూ ఉండగా మధు ఫోన్.”ఏమండోయ్ ఈరోజు ఎలాగైనా మీరు పండు గాడికి ఐ ఫోన్ కొనివ్వాల్సిందే. మళ్ళీ పోస్ట్ పోన్ చేయకండి”
” సరేలే” అంటూ కట్ చేసి బయటకి వచ్చాను. ఉన్న ఫోన్లు చాలక వాడికి మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకో? నిండా పదిహేడేళ్ళు లేవు” అని విసుక్కుంటూ బైక్ తీసి యధాలాపంగా ఎదురుగా ఉన్న టీ బంక్ కేసి చూసాను.అతడు అక్కడే కూచుని టీ తాగుతూ కనిపించాడు.
బండి స్టాండ్ లోనే ఉంచి నేరుగా టీ బ్యాంకు దగ్గరికి వెళ్లి అతనిని పలకరించాను.
“మీరు ఫలానా వీధిలో ఫలానా ఇంట్లో ఉంటారు కదా. ఆ పక్కింట్లో మేము ఉంటాము” అని అంటూ, పరిచయం చేసుకున్నాను.
అతడు ” చాలా సంతోషం సర్. వచ్చే ఆదివారం , మా పెళ్లిరోజు, మీరు మీ ఫ్యామిలీ ని తీసుకుని లంచ్ కి రండి. మా ఆవిడ కంది రోటి పచ్చడి, ములక్కాడల పులుసు ఆమోఘంగా చేస్తుంది” అన్నాడు ఉత్సాహంగా.
“తప్పకుండా వస్తాను”, అన్నాను.మనసులో అడగాలి అనుకున్న పాయింట్ అడగాలా వద్దా.. అడక్కపోతే, సస్పెన్స్ తో నాకు
పిచ్చెక్కడం ఖాయం. అడిగితే సంస్కారం అనిపించుకోదు. ఇలా అనుకుంటూ ఉండగానే,
“మా పెద్దవాడి తో మీకు మంచి కాలక్షేపం. ఆవకాయ నుండి అణుబాంబు దాకా అన్నిటి మీద నాలెడ్జి ఉంది వాడికి. ఇంటర్మీడియట్ అని చెప్తే కానీ తెలియదు. మా చిన్నది సంగీతం, నాట్యం లో దిట్ట. మీ చెవులు తుప్పు వదిలేలా కీర్తనలు పాడుతుంది” అన్నాడు అతడు ఉత్సాహంతో. భార్యా పిల్లలు గురించి అతడు అంత సంతోషంగా చెప్తూ ఉంటే ముచ్చట వేసింది.
ఇక ఉండబట్టలేక,” మాష్టారూ మీరు ఏమి అనుకోను అంటే..ఒక ప్రశ్న అడుగుతా. మీ వ్యక్తిగత విషయాలు అడగడం సంస్కారం కాదనుకోండి. కుటుంబం పట్ల ఇంత ప్రేమ కురిపిస్తున్న మీరు వారిని వదిలి వెళ్లిపోవాలి అని అనుకోడం వారిని ఏడిపించడం సుతరామూ బాలేదండి. ఆవేశంలో తీసుకునే నిర్ణయం జీవితాన్ని ఎక్కడికో విసిరేస్తుంది”. అన్నాను కొంచెం సీరియస్ గానే.
అతడు ఆశ్చర్య పోతూ, “ఏమంటున్నారు మీరు? నేను నా ఫామిలీ ని వదిలి ఎందుకు వెళ్తాను? ఎక్కడికెళ్తాను?” అన్నాడు.
నేను కొంచెం నీళ్లు నములుతూ,” అదేనండి. మీ భార్యాభర్తలు గొడవ పడటం, పిల్లలు ఏడవటం మా ఆవిడ రెండు మూడు సార్లు విన్నదట. చూసిందట కూడా. మీరు రోజూ, ఉదయం బైటికి కోపంగా వెళ్ళడం పిల్లలు వద్దు అని ఏడవడం, ఈరోజు ఏకంగా మీరు బ్రీఫ్ కేస్ పట్టుకుని వెళ్లడం.పిల్లలు, చెల్లాయి వధ్ధు అని కాళ్ళా వేళ్ళా పడటం. పెద్దగా ఏడవడం , ఇదేమైనా పద్ధతి గా ఉందా? ఉదయం నేను కళ్లారా చూసాను” అన్నాను
అతడు గట్టిగా నవ్వి,” ఓహ్ అదా. మా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక ఫోన్, ఒక టాబ్, నాకు రెండు లాప్టాప్ బాక్స్ లు ఉన్నాయండి. ఇరవై నాలుగు గంటలు వాటి ముందే కూర్చుని ఆ గేమ్స్ ఆడటం అయితేనేమి, సోషల్ మీడియా లో కాలక్షేపం చేయడం అయితేనేమి.
ఒకరితో ఒకరు మాట్లాడుకోడం మానేసాము. మా ఆవిడ ఎన్నడూ లేనిది పప్పులో ఉప్పు కాక ఉప్పులో పప్పు వేస్తూంది. మా వాడు రష్యా రాజధాని కెనడా అంటున్నాడు. మా పాప గొంతెత్తి పాడి నెల పైనే అయింది. నేను ఇంపార్టెంట్ ఆఫీస్ ఫైళ్ల మీద kk, cu ఇటువంటి చాటింగ్ లో వాడే పదాలు రాస్తున్నా. దాంతో సస్పెండ్ చేసారు. మొన్నే ఉద్యోగంలో చేరాను . ఒక్కోరోజు ఫోన్లు, ఒకరోజు టాబ్, ఒకరోజు లాప్టాప్ ఇలా తీసుకువెళ్తున్నా. ఆఫీసుకి. అక్కడే పడేసి వద్దాం అంటే అక్కడ సెక్యూరిటీ లేదు. పైగా వెళ్లిన గంట గంటకు ఆఫీసు కు ఫోన్, లాండ్ ఫోన్ నుండి..అలకలు, ఏడుపులు. ఫోన్ లేకుంటే బతకలేము అన్నట్లు.
చివరికి మొన్న నేను క్యాంప్ కి వెళ్ళినప్పుడు, మా అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళు.. ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళ ఫేస్ బుక్ లు, ఇన్స్తా గ్రం రీళ్లు, వాట్సాప్ చాటింగు లు, వాళ్ళకి విసుగొచ్చి చెప్పా పెట్టకుండా ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోయారు.
దాంతో నాకు సిగ్గు అనిపించి ఇంట్లోనున్న ఫోన్లు, టాబ్ లు, లాప్ టాప్ లు అమ్మి పారేధ్ధాం అని సూట్ కేస్ ఓ పెట్టుకుని పోతుంటే..మా వాళ్ళు వధ్ధు వధ్ధు అని కాళ్ళా వెళ్ళా పడి ఏడ్చి గోల చేస్తున్నారు. బైదిబై మీరేమైనా కొనుక్కుంటారా?
ఎంతో కొంత రేట్ ఇవ్వండి పర్లేదు” అన్నాడు.
ఒక్క క్షణం నాకు మైండ్ పనిచేయలేదు. “లంచ్ కి వెళ్తున్నాను. రేపు ఆదివారం ఇంటి దగ్గర కలుస్తానండి” అని లేచి బండి దగ్గరికి మధు కి ఫోన్ చేసి “ఐ ఫోన్ కొనడం లేదు” అని చెప్పి పెట్టేసి బండి స్టార్ట్ చేసాను.

***

– అరుణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *