అరణ్య
నేలతల్లి చలివేంద్రాలు దావానలమై ఆర్తనాదాలతో తగలబడిపోతున్నాయ్
పుడమి పందిరి పచ్చతోరణాలు దీనంగా కాలిబూడిదైపోతున్నాయ్
ప్రాణవాయువు పండించే ప్రకృతిరైతులు మోడులై మిగిలిపోతున్నాయ్
ప్రాణాలతోనే జంతుజాలం సతీసహగమనంలా సామూహికచితిలో సమిధలైపోతున్నాయ్
పైవాడే పోషించే ఉద్యానవనాలు మరుభూమిగా మారిపోతున్నాయ్
జీవసమతుల్యం అతలాకుతలమై మేఘమాలలు వట్టిపోతున్నాయ్
పక్షాదుల పొదరిల్లు రావణకాష్టమై రగిలి చితాభస్మమైపోతుంది
అడవికాచిన వెన్నెలని అమావాస్యచీకటి గ్రహణమై మింగేస్తుంది
కాలగమనం గతితప్పి ఋతువుల మతి భ్రమిస్తోంది
తరువుల అరణ్యరోదనను నిర్లక్ష్యంచేస్తే
దాని యొక్క ప్రభావం పశుపక్షాదుల విలాయానికి దారి తీస్తుంది.
– భరద్వాజ్