అప్పడం కథ
పూర్వకాలం లో ఒకానొక పల్లెలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. అయితే ఆ కుటుంబ యజమాని కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఇంతలో కాలాలు మారుతుండడం వల్ల వర్షాకాలం వచ్చింది. వచ్చింది వర్షాకాలం కాబట్టి కట్టెలు అన్ని పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆ పేదవాడు కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు కాదు.
కాని జీవనం గడవాలి కాబట్టి ఊర్లో ఎదో ఒక పని చేస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అయితే వర్షం లో తడవడం వల్ల ఆ పేదవాడికి పడిశం పట్టుకుంది. దాంతో పనికి వెళ్ళలేక పోయాడు. ఆ ఇంటి ఇల్లాలు ఇంట్లో ఉన్న వాటి తో తన ఇద్దరు పిల్లలకు వండి పెట్టేది.
అలా రెండు రోజులు గడవగానే ఇంట్లో ఉన్న సరుకులు అయిపోవడం మొదలవుతూ ఉంటాయి. మరో వైపు ఇంటి యజమానికి జ్వరం వచ్చి మంచం పై నుండి లేవలేక పోతున్నాడు. దాంతో ఆ ఇంటి ఇల్లాలుకు ఎం చేయాలో అర్ధం కాలేదు. పోనీ తానైనా పనిలోకి వెళ్ళాలి అనుకుంటే ముసురు పట్టి ఎవరు పనిలోకి పిలవలేదు.
దాంతో ఆమెకు ఎం చేయాలో అర్ధం కాక తల పట్టుకుని కూర్చుంది. ఇంతలో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు అమ్మా, అమ్మా మాకు ఇది దొరికింది అంటూ తెచ్చి తల్లికి ఇచ్చారు. అది చూసిన ఆమె కళ్ళు మెరిసాయి. అది ఏదో కాదు అప్పుడెప్పుడో మంచిగా ఉన్న రోజుల్లో తన తల్లి తనకు తెచ్చి ఇచ్చిన మినుములు.
ఆమె వాటిని ఆనందంగా తీసుకుని నేను పిలిచే వరకు ఎవరూ రాకండి అని చెప్పి లోపలికి వెళ్లి మినుములను బాగా కాడిగి విసుర్రాయితో విసిరి పిండి ని చేసింది. దాంట్లో కొంచం ఓమ, ఉప్పు వేసిoది. ఓమ పదిశానికి, జలుబు కు మందులా పనిచేస్తుంది. తర్వాత నీటితో పలుచని పిండి లా కలిపింది. ఆ పిండి ని ఒక కంచానికి నునే రాసి దాని పై పలుచని రొట్టెలా ఒత్తింది.
తర్వాత ఒక పాత్రలో నీరు పోసి పొయ్యి పై ఎసరు పెట్టి దాని పై మూత లా కంచాన్ని పెట్టింది. నీళ్ళు మరిగి పైనున్న రొట్టె ఉడికింది. దాన్ని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టింది. అలాగే ఆ కొంచం పిండి తో తమకు సరిపొయ్యే అప్పడాలు చేసింది. ఆ తర్వాత పిల్లలకూ, భర్తకు వాటిని పెట్టింది.
పిల్లలూ, భర్త వాటిని తింటూ అబ్బా చాలా బాగున్నాయి అంటూ ఆమెను మెచ్చుకోవడం తో ఆ ఇల్లాలు సంతోషించింది. తానూ కూడా వాటిని రుచి చూసి, మళ్ళి చేయాలి అని అనుకుంది.
రాత్రి అయ్యాక భర్త కాళ్ళు పడుతున్న ఆమెతో ఆమె భర్త పొద్దున్న నువ్వు చేసిన వాటి పేరేమిటి? చాలా బాగున్నాయి, ఇలాంటివి నేను ఇంతకు ముందెప్పుడు తినలేదు, రుచి కూడా అమోఘం అన్నాడు ఆ రుచి ని తలచుకుంటూ, అప్పుడామే అవి మినుములతో చేసినవి మన ఆకలి తిర్చాయి కాబట్టి అవి అప్పడాలు అని చెప్పింది భర్తతో.
అవునా మాకు మళ్ళీ చేసి పెడతావా అంటూ ఆశ గా అడిగాడు భర్త. దానికేం భాగ్యం తప్పకుండా చేస్తాను అన్నది ఆ ఇంటి ఇల్లాలు. మర్నాటి వరకు అప్పడం లో వేసిన ఓమ వల్ల ఆ ఇంటి యజమానికి పడిశం తగ్గి, హుషారయ్యాడు, పనిలోకి వెళ్ళాడు. వచ్చిన డబ్బుతో మళ్ళి మినుములు తెచ్చాడు. ఆమె మళ్ళి వారి కోసం అప్పడాలు చేసింది. అలా ఈ అప్పడం అనేది మనకు ఒక కొత్త రుచిని తెచ్చి పెట్టింది.
అప్పడం ఈ పేరు వినగానే దాని రుచి గుర్తుకు వచ్చి నాలుక పీకుతోంది. అలాగే మొహం లో చిరునవ్వు కూడా వస్తుంది.
అప్పడం అనేది రకరకాలుగా చేస్తారు. మినప్పప్పు, బియ్యం, సగ్గు బియ్యం, అన్నం, పాలకూర, ఆలూ, క్యారెట్, తోటకూర, ఇలా ఏ కూరగాయలతో అయినా, లేదా సాదా బియ్యం పిండి తో అయినా చేసుకోవచ్చు. అలాగే రకరకాల ఆకారాలతో కూడా ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి.
ఏ శుభ, అశుభ కార్యాలలో అయినా అప్పడం ఉండాల్సిందే, అప్పడం లేని భోజనం అసంతృప్తి భోజనం గా ఉంటుంది. అప్పడం లేదంటే అలిగి వెళ్ళేవారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతటి అప్పడం రుచి మనవారే కని పెట్టారు అని గర్వంగా చెప్పుకోవచ్చు.
వేరే దేశాలలో ఇలాంటి అప్పడం మనకు కనిపించదు. ఇప్పుడు దేశ విదేశాలకు కూడా అప్పడాలను పంపిస్తున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఉన్న పిల్లలకు తమ వారు ప్రత్యేకంగా అప్పడలను చేసి పంపిస్తూ ఉంటారు ఊరగాయలు, పొడులతో పాటు అప్పడం పంపడం కూడా మామూలు విషయం అయ్యింది.
అప్పడం అనగానే మనకు వెడల్పుగా పూరి సైజ్ లో ఉప్పుప్పుగా, కరకర లాడుతూ ఉండేదే అనుకుంటారు. చాలా మంది దీన్నే ఇష్టపడతారు. కానీ ఇప్పటి వాళ్ళు అప్పడానికి మరిన్ని కొత్త రుచులు చేరుస్తూ మెరుగులు దిద్దుతున్నారు.
అందులోని కొన్ని ఆలు అప్పడం, క్యారెట్, తోటకూర పాలకూర లాంటివి. పైన చెప్పుకున్న కూరగాయలతో పాటూ రకరకాల పిండి తో కూడా అప్పడాలు తయారు చేస్తున్నారు. అప్పుడాలను రకరకాలుగా తినవచ్చు. నూనెలో వేయించుకుని, లేదా కాల్చుకుని, లేదా ఊరికే అయినా తినవచ్చు.
మామూలు అప్పడాలు అందరికీ తెలుసు మరి కూర గాయాలతో అప్పడాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కొత్తిమీర అప్పడాలు:-
ముందుగా లేత కొత్తిమీర తీసుకోవాలి. దాన్ని బాగా కడిగి, నీటిలో కాసేపు నానబెట్టాలి. నాన బెట్టడం వల్ల మట్టి పోతుంది. తర్వాత పొడి బట్టలో వేసి నీరంతా పోయే వరకు ఉంచి, సన్నగా తరగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు కొంచం ఫ్రై చేసి, తర్వాత దాన్ని మిక్సి పట్టాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. తర్వాత బియ్యం పిండి ని జల్లించుకోవాలి. తర్వాత పిండిలో మిక్సి పట్టుకున్న మిశ్రమాన్ని కలపాలి. కొంచం పలచగా కలుపుకున్న పిండిలో సరిపడినంత ఉప్పు, ఓమ వేయాలి. పిండిని ముద్దలుగా చేసుకుంటూ కవర్ పైన కానీ, లేదా ఒక పలుచని వస్త్రం పై కానీ చేతికి నూనె రాసుకుని పలచగా ఒత్తాలి.
ఇలా ఒత్తుకుంటూ తయారు చేసుకున్న వాటిని ఎండ లో ఆరబెట్టి, నిలువ చేసుకోవాలి. ఇలాగే మిగతా కూరగాయలతో కూడా చేసుకోవచ్చు. ఇదండీ అప్పడం కథ.. మరొక రకమైన రెసిపీ తో మళ్ళీ కలుద్దాం అంత వరకు సెలవ్…
– భవ్యాచారు