అన్వేషణ ఎపిసోడ్ 8

అన్వేషణ ఎపిసోడ్ 8

అలా శ్రుతి కోసం వెతకడం మొదలుపెట్టారు ఏసిపి రంజిత్ అండ్ టీమ్.

వాళ్ల దగ్గరున్న ఆ కాంటాక్ట్ నంబర్ సాయంతో, తన వివరాలు సేకరించే పనిలో పడ్డారు. చివరికి తనుంటున్న అడ్రెస్స్ సంపాదించి, శ్రుతి ఉన్న చోటికి చేరుకోగలిగారు. తనని పట్టుకుని విచారణ చేపట్టి ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు.

“హాయ్ శ్రుతి.. ఐ యాం “ఏసిపి రంజిత్”. థిస్ ఈస్ మై టీమ్. వి ఆర్ ఫ్రమ్ సీ బి ఐ. ఐ యాం ది చీఫ్.” అంటూ తన చేతిలో ఉన్న ఐడీ కార్డ్ చూపిస్తూ తమని తాము శృతికి పరిచయం చేసుకున్నాడు రంజిత్.

“ఓహ్..!” అంటూ తలాడించింది శ్రుతి.

అప్పటికే వాడిపోయిన మొహంతో, దేనికో దిగులుగా ఉన్నట్టుంది శ్రుతి!. CBI టీమ్ అని, వాళ్ళు తమకు తాము తమని పరిచయం చేసుకున్నా, ఏ బెరుకు లేని శృతిని చూస్తుంటే, అసలు ఈ కేసులకు సంబంధించి తనకి విషయం తెలుసో లేదోనని వాళ్ళలో సందేహం మొదలయ్యింది.

“సో.., మీ పేరు శ్రుతి! మీరేం ఉద్యోగం చేస్తారో? ఎక్కడ పనిచేస్తారో తెలుసుకోవచ్చా…?” అంటూ రంజిత్ తన ఇంట్రాగేషన్ మొదలుపెట్టాడు.

“హుమ్… (చిన్నగా నవ్వుతూ..) నా పేరు కనుక్కున్నారు, నా అడ్రెస్స్ కనుక్కున్నారు.. మరి నేను ఏం చేసున్నానో, ఎక్కడ పని చేస్తున్నానో కనుక్కోలేకపోయారా? పైగా CBI వాళ్ళమని చెప్తున్నారు, ఆ మాత్రం మీకు తెలీదా?” అంటూ వాళ్ళని వెటకారించింది శ్రుతి.

“ఏసిపి సార్ తో అలాగేనా మాట్లాడేది” అంటూ తన మాటలకి కోప్పడింది రమ్య. 

దాంతో రమ్య వంక కోపంగా చూసింది శ్రుతి. రమ్య ఇంకా ఏదో అనబోతుంటే, అది గమనించిన రంజిత్ తన మాటలకి చెయ్యి అడ్డం పెట్టాడు. (తనని ఇంకేం మాట్లాడొద్దు అన్నట్టుగా)

“మేము cbi వాళ్ళం అంటుంటే, మీకింకా నమ్మకం కుదిరినట్టు లేదనుకుంటా?” అన్నాడు.

“మనిషి బ్రతుకే ఓ మాయ! ఇందులో నమ్మకాలకి తావు ఎక్కడిదిలేండి” అంటూ మళ్ళీ చురకంటించింది శ్రుతి.

దాంతో ఆ సీబీఐ టీమ్ కి కొంచెం కోపం ఎక్కువైంది.

“ఇదంతా కాదు కానీ, నా నుండి మీకేం కావాలి?. దేని గురించి మీరంతా ఇక్కడికి వచ్చారు. అసలు విషయానికి రండి!” అంది శ్రుతి సూటిగా.

“నాకు సత్య కుమార్ గురించి కొన్ని డీటైల్స్ కావాలి. అతనితో పాటు మిగితా వాళ్ళ ముగ్గురి స్నేహితుల గురించి కూడా…” అని రంజిత్ అడుగుతుండగా,

“సత్యకుమారా..? వాళ్ల స్నేహితులా…? అసలెవరు వాళ్ళు..? ఏమో వాళ్ళెవరో నాకు తెలీదు. మీరు వచ్చింది వాళ్ళ గురించే అయితే, వాళ్ల గురించి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. మీరు ఇక వెళ్లొచ్చు” అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది శ్రుతి.

“సత్య కుమార్ మీరు కలిసి ఒకే కంపనీలో పనిచేస్తున్నారుగా. పైగా మీరంతా కలిసి ఒకే అనాధశ్రమంలో పెరిగారు కదా! ఆ మాత్రం మీకు తెలియకుండా ఉంటుందా అతని గురించి, అతని స్నేహితుల గురించి?” అంటూ ప్రశ్నించాడు రంజిత్.

“ఓహ్.. అన్నీ తెలుసుకునే వచ్చారన్నమాట” శ్రుతి దానికి బదులివ్వబోతుంటే,

“మీరే కదా cbi వాళ్ళకి తెలియకుండా ఏది ఉండదని కాసేపటి క్రితమే అన్నారు” అన్నాడు రంజిత్.

“అదంతా ఒకప్పుడు, నాకు వాళ్ళతో ఎలాంటి సంబంధాలు లేవిప్పుడు.” అంది శ్రుతి.

రంజిత్: పోనీ, ఆ ఒకప్పటి గురించే చెప్పండి, వాళ్లు ఎలాంటి వారో, మీకు వాళ్ళకి మధ్య ఏమైందో? అసలెందుకు విడిపోయారో?

శ్రుతి: అదంతా నా పర్సనల్, అది మీకు అనవసరం.

రంజిత్: అవసరం.. ఎందుకంటే, ఆ సత్య కుమార్ హత్యలు చేశాడు కాబట్టి. తనోక కూని కాబట్టి (కొంచెం సీరియస్ గా మాట్లాడుతూ)

శృతి: సత్య కుమార్ అలాంటివాడు కాదు.

రంజిత్: ఎస్.. సత్య కుమార్ మూడు హత్య కేసులలో ముద్దాయి.(కొంచెం గంభీరంగా ..)

శ్రుతి: చెప్పాగా తను అలాంటివాడు కాదని (రంజిత్ ఎంత తీవ్రతతో అడిగాడో అంతే తీవ్రతతో బదులిచ్చింది శ్రుతి కూడా)

రంజిత్: అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా, మరింత క్రూరంగా అభం శుభం ఎరుగని ముగ్గురు ఆడవాళ్ళని పొట్టన పెట్టుకున్నాడు ఆ సైకో. ఆ మృగాన్ని వెనకేసుకురావడానికి సిగ్గుగా లేదు. (ఇంకొంచెం తీవ్రత పెంచిన స్వరంతో)

శ్రుతి: “తను అలాంటి వాడు కాదు, కాదు.., కాదు.. ఎన్ని సార్లు చెప్తున్నా మీకు అర్థం కాదా? అయినా తనే ఈ హత్యలు చేసాడనడానికి మీ దగ్గరేం ఆధారాలున్నాయి ఏసిపి సార్..” అంటూ ప్రశ్నించింది.

రంజిత్: “రాకేష్ ఆ డైరీ ఇవ్వు” అని రాకేష్ వంక చూస్తాడు.

రాకేష్ మరియు మిగిలిన వారందరూ రంజిత్ వంక బిత్తర చూపులు చూస్తారు. “అదంతా తనకొచ్చిన కలని, తన దగ్గర ఆ డైరీ లాంటివి ఏం లేదని వెంటనే తేరుకుని, ఉష్…! అంటూ తన తల పట్టుకుంటాడు.” రంజిత్.

శ్రుతి: “ఎక్కడ సార్… తనే హత్య చేశాడు అనడానికి ఆధారాలు? చూపించడానికి మీ దగ్గరేమైనా ఉన్నాయా” అంటూ మరొకసారి చురకలు అంటిస్తుంది.

“చట్టం ముందు దోషులెవ్వరూ తప్పించుకోలేరు, తప్పు చేసినవాళ్లు ఎప్పటికైనా శిక్షార్హులే!” అంటూ రంజిత్ అండ్ టీమ్ అక్కడ నుండి వచ్చేయబోతుంటే, వాళ్ళని ఆపి

“ఈ సారి ఏదైనా పక్కా క్లూ ఉంటేనే రండి!” అంటూ ఒక చిన్న చిరునవ్వుతో వాళ్ళని సాగనంపేసింది శ్రుతి.

************

అలా తన కార్లో వెళ్తున్న రంజిత్ సడెన్ గా కార్ ఆపి, రమ్య కి చెప్పి శ్రుతి ఇంట్లోనున్న అన్ని ఫోన్ల నుండి వచ్చి వెళ్ళే కాల్స్ ని ట్రాక్ చేయమంటాడు. తన కాల్ డేటాతో పాటు, ఆ ఇంట్లోనున్న టెలిఫోన్ డేటా కూడా ట్రాక్ చేయిస్తాడు. (అంతకుముందే శృతిని విచారణ చేస్తున్నప్పుడు, అక్కడొక మూలన ఓ టెలిఫోన్ గుడ్డను కప్పి ఉండడం, ఆ టెలిఫోన్ లైన్ ని కవర్ చేస్తూ కనెక్షన్ ఇవ్వడం గమనిస్తాడు రంజిత్)

సరిగ్గా ఆ రోజు సాయంత్రానికి, కాల్ డేటా ట్రాకింగ్ వచ్చిందని రంజిత్ కి అది వినిపిస్తుంది.

“తమ్ముడూ… నువ్వెక్కడున్నవ్, నా మీద సీ బి ఐ వాళ్ళకి అనుమానం వచ్చినట్టుంది. మా ఇంటికి వచ్చారు. ఎందుకైనా మంచిది నువ్వెకడికైనా సిటీ వదిలి వెళ్ళిపో..! కొన్ని రోజులు.” అంటూ ఆ కాల్ సారాంశం.

దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. ముఖ్యమైన సమాచారం లభించడంతో, రంజిత్ శృతిని తీసుకురమ్మని రాకేష్, రమ్యని పంపిస్తాడు. శ్రుతి మాట్లాడిన ఆ అజ్ఞాత వ్యక్తిని పట్టుకోమని మిగిలిన ఇద్దరూ అభిరామ్, సాకేత్ లను పంపిస్తాడు. శ్రుతి ఉన్న అడ్రెస్స్ తెలుసు కాబట్టి, ముందుగా శ్రుతిని తీసుకొస్తారు వాళ్ళిద్దరూ.

రంజిత్ ఈసారి తన విచారణను కటినంగా మొదలుపెడతాడు.

” ఏంటి సార్…! “ఏమైనా క్లూ దొరికిందా.. మళ్ళీ నన్ను తీసుకొచ్చారు మీ వాళ్ళు!.” అంటుంది శ్రుతి!

“హా.. నిన్ను కటకటాలు లెక్కపెట్టించే క్లూ దొరికింది” బదులిస్తుంది రమ్య.

“శ్రుతీ … ! శ్రుతీ… !! నీకో తమ్ముడుండగా నువ్వు అనాధవి ఎలా అవుతావ్? నువ్వొక అనాధవని, నీకు ఎవరూ లేరని ఈ ప్రపంచాన్ని నువ్వెందుకు మోసం చేయాలనుకునటున్నవ్? ఆ హత్యల వెనుక నీ హస్తం లేదా?

రంజిత్ తన పై సంధిస్తున్న ప్రశ్నలకు గుటకలు మింగుతూ.. బిత్తర చూపులు చూస్తుంది శ్రుతి, తన గోళ్ళు గిల్లుకుంటూ…

“ఏంటి ఇందాక కనిపించనంత గాంభీర్యం నీ ముఖంలో నాకిప్పుడు కనిపించడం లేదు. నీ గొంతు మూగబోయింది.” అన్నాడు రంజిత్. 

ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది శ్రుతి.

‘నిజానిజాలు బయటపడ్డాయి కదా సార్..! అందుకే కంగారు పడుతుంది కాబోలు” అంటూ రమ్య ఒక పక్క.

రంజిత్: “చెప్పు శ్రుతి… సత్య కుమార్ ని ఏం చేసావ్..?

శ్రుతి: నాకేం తెలీదు, నేనేం చేయలేదు.

రంజిత్: చెప్పాగా చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని, చేసిన తప్పు ఒప్పుకో…!

శ్రుతి: నిజంగా నాకేం తెలీదు సార్! (అంటూ బిక్కమొహం వేస్తుంది)

రంజిత్ : నిజం చెప్పు, సత్య కుమార్ ని చంపేశావ్ కదూ!

శ్రుతి: తనని నేనెందుకు చంపుతాను సార్! నాకేం అవసరం.

రంజిత్: మరి సత్య కుమార్ ఏమయ్యాడు? ఆర్ఫనేజ్ కేర్ టేకర్ తన గురించి అడిగినప్పుడు కూడా నువ్వెందుకు కోప్పడ్డావ్, ఇప్పుడు మేమడుగుతుంటే కూడా తప్పించుకుందామని చూస్తున్నావ్? నిజం చెప్పు అతన్ని నువ్వేదో చేసావ్!

శ్రుతి: నేను నిజమే చెప్తున్నాను సార్! అతన్ని చంపాలని నేనెందుకనుకుంటాను?

రంజిత్: ఎందుకా..?, తన స్నేహితులని మోసం చేసిన వాళ్ళని ఒక్కొక్కరిగా చంపేస్తున్నాడు కాబట్టి… వాళ్ళలో ఎవరో ఒకరు నీ బెస్ట్ ఫ్రెండయ్యి ఉంటారు. అది తట్టుకోలేక నువ్వు తనని నీ తమ్ముడుతో మట్టు బెట్టుంటావ్!

శ్రుతి: లేదు సార్.. ఇవన్నీ నిజాలు కాదు సార్.!

రంజిత్: అవన్నీ నిజాలు కానప్పుడు, మరి నిజమేంటి చెప్పు!

శ్రుతి: నాకు తెలీదని చెప్తుంటే వినిపించుకోరే! ( అంటూ గట్టిగా అరుస్తుంది)

(సరిగ్గా అప్పుడే, ఆ అజ్ఞాత వ్యక్తి దొరికాడని రంజిత్ కి కాల్ వస్తుంది అతన్ని పట్టుకోవడానికి వెళ్ళిన వాళ్ల దగ్గర నుండి.)

రంజిత్: నువ్వు ఇలా లొంగవు కానీ, ఈ కేసు కూడా ఓ కొలిక్కి వచ్చేలా లేదు, సాకేత్ వాడిని ఎన్కౌంటర్ చేసి, ఈ కేసు వాడిపై నెట్టి క్లోజ్ చేసేద్ధాం అని ఆదేశాలు ఇస్తాడు రంజిత్ వాళ్ళకి, శృతి ఎదురుగానే తనకి వినపడెట్టు.

శ్రుతి: ప్లీజ్ సార్….! మీకు చేతులెత్తి దండం పెడతాను, తననేమి చేయకండి సార్, ఇందులో తన తప్పేం లేదు. తనని వదిలేయండి సార్… జరిగిందంతా చెప్తాను.

రంజిత్: ఇప్పుడు దారిలోకి వచ్చావ్. చెప్పు సత్య కుమార్ ని ఎందుకు చంపావ్…?

శ్రుతి: నేను చంపలేదు సార్..!

రంజిత్: నువ్వే చంపావ్..!

శ్రుతి: లేదు సార్..!

రంజిత్ : నువ్వే!

శ్రుతి: కాదు..!

రంజిత్: నువ్వే..! నువ్వే..!! నువ్వే..!!!

శ్రుతి: కాదు ..! కాదు..!! కాదు..!!! అసలు సత్య కుమార్ ని ప్రాణంగా ప్రేమించిన నేనెందుకు చంపుతాను?” “సత్యా.. సత్యా..” అంటూ గట్టిగా ఏడుస్తుంది శ్రుతి.

కేసు మరొక మలుపు తిరిగింది. అక్కడున్న రంజిత్ తో పాటు, రాకేష్, రమ్య కూడా షాక్ అయ్యి తన వంక అలానే చూస్తారు శ్రుతి ఇంకేం చెప్పబోతుందా అని. అలా వెక్కి వెక్కి ఏడ్చి ఏడ్చి ఆ బాధ నుండి బయటకు వచ్చిన తను, జరిగిందంతా వివరిస్తుంది.

సత్య కుమార్, సత్య కాంత్, సత్య కిరణ్, సత్య కృష్ణ, నేను చిన్నప్పటి నుండే మంచి స్నేహితులం. అందులో నాకు సత్య కుమార్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తన కోసం ఒకప్పుడు నా కెరీర్ ని కూడా త్యాగం చేసేంత, ఇప్పుడు నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకునేంత!

నాకు ఇంజనీర్ అవ్వాలని ఉన్నా… తన కోసం తనతో పాటే డిగ్రీ చేశాను. తను అకౌంట్స్ గ్రూప్ తీసుకుంటే, నేనుకూడా అదే తీసుకున్నా… తను ఏ కంపెనీ లో జాయిన్ అయితే, నేను కూడా అదే కంపెనీలో జాయిన్ అయ్యాను. నాతో కాకుండా తను ఇంకే అమ్మాయితో మాట్లాడినా, నాకు పట్టరాని కోపం వచ్చేది. తన మీద అంత ప్రేమున్నా, నేనెప్పుడూ బయటపడలేదు.

నా ప్రేమ సంగతి సత్య కుమార్ కి చెప్దామనుకునే టైం కి సత్య కిరణ్, సత్య కాంత్, సత్య కృష్ణ ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో సత్య కుమార్ బాగా అప్సెట్ అయ్యాడు. అసలు ఆడది అంటేనే ద్వేషం పెంచుకునేంత! చివరిగా సత్య కృష్ణ చనిపోయినప్పుడు కూడా, నేను వెళ్లి సత్య కుమార్ ను కలిసాను. అప్పటికే తను బాగా డిప్రెషన్ లో ఉన్నాడు. బాధ పడకంటూ తనని ఓదార్చే ప్రయత్నం చేయబోతుంటే,

ఛీ.. పో.. మీ ఆడ జాతి అంటేనే చిరాకేస్తుంది. ఎందుకే, అభం శుభం తెలియని మా లాంటి వాళ్ళతో ఆడుకుంటారు? అయినా మీకు మాలాంటోల్లు కాదే, కడుపులు చేసి, మోసం చేసి చివరకు మొహం చాటేస్తారు చూసావా! వాళ్ళే మీకు కరెక్ట్. ఒక అమ్మాయి దేహం మీద అఘాయిత్యం చేస్తే, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాన్య ప్రజలు సైతం ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకూ బందులని, ధర్నాలని, రాస్తారోకోలనీ, రోడ్డు పైకి వచ్చి ఘాతుకానికి పాల్పడిన వాడికి మరణ శిక్ష విధించాలని, చంపేయాలని డిమాండ్లు, నిరసనలు చేస్తారు.

మరి, నా స్నేహితుల లాంటి వాళ్లతో టైం పాస్ చేసి, వాళ్ల మనసులతో ఆడుకొని, చివరికి నాన్న చెప్పాడనో, అమ్మ చెప్పిందనో, ఆస్తులు లేవనో వెరేవార్ని తగులుకుని ఆ మనసులను ముక్కలు చేస్తున్న ఈ ఆడవాళ్ళకు ఏ శిక్ష పడాలి? కానీ, ఆ శిక్ష పడేది కూడా అలా స్వచ్ఛంగా ప్రేమించి చివరికి పిచ్చివాళ్ళలా మిగిలిపోయి ప్రాణాలు తీసుకునే నా స్నేహితుల లాంటి వారికి. అయినా ఒక్కడు కూడా నోరు పెదపరు. కారణం ఆడవారంటే సానుభూతి, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ఎక్కడ లేని గౌరవం.

లింగ వివక్ష, సమానత్వం అంటూ ప్రతి చిన్న విషయాల్లో భూతద్దం పెట్టీ చూసే మీరు, ఇలాంటి విషయాలలో తప్పు మీదని తెలిసినా తప్పించుకుని తిరుగుతారు. అయినా మీకు కలిసి తిరగడానికి ఒకడు, ఫ్రెండ్షిప్ చేయడానికి ఒకడు, లవ్ చేయడానికి ఒకడు, పెళ్లి చేసుకోవడానికి ఇంకొకడు. రేపు వాడు కూడా నచ్చకపోతే రంకు మొగుడు మరొకడు. ఇలా ఎంత మంది జీవితాలను నాశనం చేస్తారే!. అది మనసా లేక వ్యభిచార గృహమా?

ఒకరి మనసుకి భంగం కలిగించడమే మానభంగం. అది ఎవరు ఎవరికైనా కానీ, తల్లి , తండ్రి, సోదరి, సహోదరుడు, ఇతరులు అని, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు, అబ్బాయిల మనసులతో ఆడుకునే ప్రతి అమ్మాయి ఆ అబ్బాయిని మానభంగం చేసినట్టే, మరి వాటికేవి చట్టాలు. అలాంటి వారికి శిక్ష పడాల్సిందే కదా… వారిని ఈ చట్టాలు శిక్షించకపోవచ్చు. కానీ, నా స్నేహితుల చావుకు కారణమైన వారినే కాదు, ఇలాంటి వారందరినీ నేనే శిక్షిస్తా” అంటూ ఎవరో చేసిన తప్పుకి నన్ను దూషిస్తూ ఆవేశంతో రగిలిపోయాడు.

“స్టాప్ ఇట్ కుమార్..! అందరూ ఒకేలా, అలా ఉండరు… ఎక్కడో ఒకటో రెండో జరిగాయని అందరినీ అలానే అనుకుంటామా?!. నిజానికి నేను నిన్ను ఎప్పటినుండో ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే నీతో బ్రతకాలని ఉంది. అది చెప్దామని ఎప్పటినుండో అనుకుంటున్నా.. వీలుపడలేదు ఇప్పుడు నువ్వుంటున్న మాటలకి తప్పక చెప్పాల్సొస్తుంది”. అంటూ నా మనసులో అన్నేళ్ళుగా దాచుకున్న భావాన్ని అసందర్భంగా తెలపబోయాను.

(అప్పటికే ప్రేమన్నా, అమ్మాయిలన్నా ఎక్కడలేని ద్వేషం పెంచుకున్న కుమార్…) నా చెంప మీద ఒక్కట్చి, నా గొంతు పట్టుకుని “నీ మాయలో పడి నేను కూడా నా స్నేహితుల్లా నాశనం అవ్వాలనుకోవడం లేదు. ఇంకెప్పుడు నాకు కనబడక, నీ మొహం నాకు చూపించకు!. ఇక్కడి నుండి పోవే బయటకు…” అంటూ మూర్ఖంగా, మృగంలా ప్రవర్తిస్తూ నా ప్రేమని అసహ్యించుకున్నాడు.

దానికి బాధ పడుతూ అక్కడి నుండి వచ్చేసాను. తను ఆ ఫ్రస్ట్రేషన్ నుండి బయట పడ్డాక మాట్లాడుదాం లే అని.. కానీ, తెల్లారి లేచేసరికి నాకొక విచారకరమైన, గుండె పగిలిపోయే వార్త తెలిసింది. సత్య కుమార్ హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని. (నిట్టూరుస్తూ..) తనతో పాటే, అన్నెళ్లుగా తనపై పెంచుకున్న నా ప్రేమ కూడా సమాధైపోయింది. అనాధనైన నాకు ఎప్పుడూ.. ఒంటరి అనే భావం కలగలేదు. కానీ, మొట్ట మొదటిసారి ఆరోజు నాకు తను శాశ్వతంగా దూరం అవుతుంటే నాలో ఆ భావం కలిగింది. నా మనసు ముక్కలైంది.

ఆడదాన్నే అయినా, సత్య కుమార్ చెప్పిన ప్రతి దాంట్లో నిజముందనిపించింది. అవును అతను చెప్పింది ప్రతీది అక్షర సత్యం. నా చిన్ననాటి స్నేహితులు చనిపోవడానికి, నేనిలా ఒంటరిగా మిగిలి పోవడానికి, నా ప్రేమ ఓడిపోవడానికి కారణం ఆ ముగ్గురు ఆడవాళ్ళు. నా ప్రేమను నాకు దూరం చేసి, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఆ సంతోషాన్ని, వాళ్ళని నాశనం చేయడంతో పాటు నా ప్రేమను దక్కించుకోలేకపోయినా, నేను ప్రేమించిన సత్య కుమార్ చివరి కోరిక తీర్చాలనుకున్నా…

అందుకే ఆ ముగ్గుర్ని మాత్రమే కాదు, ఇలాంటి అనార్ధాలకు కారణమైన ప్రతీ ఆడదాన్ని నేనే సత్య కుమార్ రూపంలో చంపాలనుకున్నాను. వాళ్ల వల్ల చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలనుకున్నాను. వస్తువులను వాడుకున్నట్టు అబ్బాయిల మనసులతో ఆడుకుని, వాటిని ముక్కలు చేసి, ఇంత మంది జీవితాలను నాశనం చేసి, ఇప్పుడు తమ సుఖం తాము చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్న ఆ ముగ్గురి ఆడవాళ్ళని అతి కిరాతకంగా, దారుణంగా చంపింది నేనే. వాళ్ళని హత్యలు చేసింది నేనే. మీరన్నట్టు ఆ కూనీలు చేసింది నేనే. ఆడదానికి ఆడదే శత్రువన్న నానుడిని నిజం చేశాను.

ఇదంతా మా ఇద్దరి (సత్యకుమర్, నేను) తో సన్నిహితంగా మెలిగే సహోద్యోగి సత్య పవన్ సాయంతోనే చేయగలిగాను. ఇప్పుడు మీకు దొరికింది కూడా తనే!. తనని నేను తమ్ముడంటాను. సత్యకుమార్ దూరమయ్యాక తనే నాకొక సొంత వాడిలా ప్రతిదాంట్లో సాహయం చేసింది. మీరన్నట్టు నేను అనాధని కాదు సార్.. దేవుడిచ్చిన తమ్ముడు సత్య పవన్ ఉండగా…

ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి మేము చాలానే ఎత్తుగడలు వేశాము. అందులో ముఖ్యమైంది మీకొచ్చిన కల. అవును..! ఆ రోజు… ఈ కేసులను మీరు టేక్ అప్ తీసుకున్న దగ్గర నుండి మాలో భయం మొదలైంది. మీరొక సక్సెస్ఫుల్ ఆఫీసర్ అని, పట్టుకున్న కేసుని చేధించేవరకూ విడిచి పెట్టరని విన్నాము. అందుకే, మిమ్మల్ని అణువణువు అనుసరించాము. ఆ రోజు రాత్రి మీరు గెస్ట్ హౌస్ కి వెళ్తున్నారని తెలిసి, మారువేషంలో సత్య పవన్ మీ దగ్గరకు వచ్చాడు. ఏవేవో చెప్పి, నేను రాసిన ఆ డైరీ మీకు అందేట్టు చేసాము.

ఆ డైరీ ద్వారా.. తనూ … నేనూ.. ఇద్దరం దొరికిపోయే ప్రమాదముందని భావించి, అదంతా మీకొచ్చినా ఓ కలలా సృష్టించాము. మీరు నిద్ర లోకి చేరుకోవడానికి ఆ డైరీ చివరి పేజీలో మత్తు చల్లాము. అలా మత్తులోకి జారుకున్నక మిమ్మల్ని మంచం మీద పడుకో బెట్టింది మేమే. ఆ తెల్లారి రంగయ్య భార్యకు మీరొచ్చినట్టు చెరవేసింది కూడా మేమే….

ప్రతి విషయంలో జాగ్రత్త పడ్డ నేను, ఆ అనాధశ్రమం దగ్గర ఎంక్వైరీ లో నాకు మీ పై డౌట్ వచ్చింది. అప్పటికి లోపల భయాన్ని దాచుకుని పైకి గంభీరంగానే మీ ముందు నటించాను. కానీ, మీరొచ్చి వెళ్ళిన కంగారులో సత్య పవన్ కి కాల్ చేయడం ద్వారా మీకొచ్చిన ఆ డౌట్ నిజమని నిరూపితమైంది.

అమ్మాయిలను మోసం చేస్తున్న అబ్బాయిలను శిక్షించే చట్టాలున్నాయి కానీ, అబ్బాయిలను మోసం చేసే అమ్మాయిలను శిక్షించే చట్టాలు మన ప్రజాస్వామ్యం లో లేవు. అందుకే సత్య కుమార్ చెప్పినట్టు ఆలాంటి వారికి శిక్ష తన రూపంలో నేనే వెయ్యాలనుకున్నా. తద్వారా అబ్బాయిలను మోసం చేసే సంధ్య, సుకన్య, సౌమ్య లాంటి మా ‘నవ’ మృగాలందరికీ ఇవొక గుణపాఠం కావాలనుకున్నా…!

నేను చేసింది తప్పైతే, తప్పు ఒప్పుకుంటున్నాను కాబట్టి, మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవిస్తాను, అది మరణశిక్షైనా స్వీకరిస్తాను. కానీ, సత్య పవన్ లాంటి అమాయకులను బలి తీసుకోకండి. మీ చట్టాల్లో మరిన్ని మార్పులు తీసుకొచ్చి, అమ్మాయి శీలానికి ఎంత విలువ ఇస్తున్నారో అబ్బాయిల మనసులకు అంతే విలువ ఇవ్వండి. ప్రేమించినమ్మాయి మోసగించదని, క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునే ఎందరో యువుకుల కుటుంబాలకు న్యాయం చేయండి.” అంటూ తన ఆవేదనను దాని వెనకున్న ఆవేదనను వెళ్ళబుచ్చుతుంది శ్రుతి.

రంజిత్, రాకేష్, రమ్య లను కంట తడిపెట్టిస్తుంది శ్రుతి చెప్పిన గతమంతా.. ఇంతలోపే సత్య పవన్ తీసుకుని వస్తారు సాకేత్ మరియు అభిరామ్.

అన్వేషణ (ఓ మా “నవ” మృగానికై) లో మా”నవ” మృగాలు ఎవరు? ఇప్పుడు శృతిని, సత్య పవన్ ను చట్టం వదిలివెయ్యాలా ..? లేక వాళ్ళను శిక్షించాలా?

పాఠకులారా మీరే నా న్యాయ నిర్ణేతలు… మీ అభిప్రాయాన్ని సమీక్ష రూపంలో తెలియపరచగలరు. ఇంతటితో అన్వేషణ (ఓ మా”నవ” మృగానికై) అనే కథ నేను పూర్తి చేశాను. కానీ, మీ అన్వేషణలో ఈ కథ అసంపూర్తిగా మిగలకూడదనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

విశ్లేషణ: ప్రియమైన పాఠకులారా… స్త్రీ పురుష లింగ బేధం చూపుతూ, మహిళలను కానీ, ఆడపిల్లలను కానీ కించపరుస్తూ… వాళ్ళని తక్కువ చేస్తూ ఒక పురుషుడిగా పక్షపాతం చూపిస్తూ నేను ఈ కథ రాశానని భావించొద్దు. ఇంకా మీరు అలాంటి ఉద్దేశ్యంతోనే వుంటే, నేను రాసిన స్వప్నిక IAS అనే కథ చదివి మీ అభిప్రాయాన్ని తెలుపవచ్చు బేరీజు వేసుకోవచ్చు. దాంతో పాటే నా రచనల్లో ఆడవారి విలువలు, కష్టాలు తెలుపుతూ ఇంకొన్ని రచనలు చేశాను అవి కూడా దృష్టిలో ఉంచుకోగలరు.

నిజానికి స్త్రీ లేకపోతే ఈ సృష్టికి మూలం లేదనే విషయం అందరికి విదితమే. అలాగే ఒక తల్లికి కొడుకుగా, ఓ చెల్లికి అన్నగా వాళ్ల కష్టాలు చూసి ఎదిగిన నాకు వాళ్ళు చేసే త్యాగాలకు “ఆడవాళ్ళు మీకు జోహార్లు” కానీ, ఈ సమాజంలో కొంతమంది యువతులు అవలంభిస్తున్న తీరు ఒకింత నన్ను విస్మయానికి గురి చేసి ఈ కథ రాయడానికి ప్రేరేపించింది.

స్నేహానికి ఒకరని, ప్రేమకు ఒకరని, ఇంటి దగ్గర ఒకరు, కాలేజ్ లో ఒకరు, ఉద్యోగం చేసేటప్పుడు ఇంకొకరు.. చివరికి పెళ్లికి ఇంకెవరో.. పది మందితో పక్క పంచుకునే వారిని వేశ్య అని ముద్ర వేసింది ఈ లోకం. మరి దేహం కన్న విలువైన మనసుని పది మందికి పంచితే దాన్ని ఏమనాలి.

ఈ మొబైల్ ఫోన్ లు, సోషల్ మీడియాలు వచ్చాకా ఇవి మరింతగా పెరిగాయి. ఒకరితో ఒకరు చనువుగా మెలగడం, టైం పాస్ చేస్తూ కాలం గడపడం. అలా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చి ఒకర్నొకరు ఇష్టపడడం ఆపై అది ప్రేమగా మారడం. తీరా ఇంత జరిగాక చివరికి అమ్మ ఒప్పుకోలేదు, నాన్న ఒప్పుకోలేదు అంటూ వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చుకుని కొత్త కొత్త అవకాశాలు ఏర్పడ్డాక… అవతలి వ్యక్తి మనసు బాధ పెట్టి మెల్లగా వాళ్ల నుండి జారుకోవడం.

ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితమే కాదు వాళ్ల వెనుకున్న అందరి జీవితాలు నాశనం అవ్వడానికి కారణం అవుతున్నాయి వీళ్ళ సరదాలు. వీళ్ళకి ముందే తెలీదా… ఇంట్లో తెలిస్తే ఇలాంటివి ఇబ్బంది అవుతాయని మరెందుకు మనసుని ముక్కలు చేసే ఈ తాత్కాలపు ప్రయాణాలు?

నా దృష్టిలో మా”నవ” మృగాలు:- అబ్బాయిల మనసులను ఆటవస్తువులుగా ఆడుకునే అమ్మాయిలు.. అమ్మాయిలతో సరదాలు తీర్చుకుని చివరికి మొహం చాటేసే అబ్బాయిలు … అసలివన్ని జరగడానికి కారణం, పరిపక్వత లేని పిల్లలకు ఏది కావాలంటే అది విచ్చలవిడిగా కొనిచ్చి (సెల్ఫోన్) వాళ్ళని నాశనం చేసే తల్లిదండ్రులు…

వాళ్ల పిల్లలకు ప్రేమను పంచడంలో విఫలమయ్యే తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఇచ్చిన చనువుని, గారాబాన్ని నిరుపయోగం చేసే పరిపక్వత తెలిసిన యువతీ యువకులు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలయ్యే ఈ చట్టాలు…

నా జీవితంలో ఇలాంటి సంఘటనొకటి జరిగింది కాబట్టి, ఆ వేదనను ఓ కట్టు కథగా సృష్టించిన ఆవేదన నా ఈ కథ. అన్వేషణ (ఓ మా “నవ” మృగానికై) (నా జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి తనతో ప్రయాణం అనే కథలో పూర్తిగా వివరించాను అది చదవగలరు.) ఈ IAS, తనతో ప్రయాణం కథలు త్వరలో అక్షరలిపిలో రాబోతున్నాయి….

అన్ని కథలలానే ఈ కథను కూడా మీ నిర్మలమైన మనసులతో ఆదరిస్తారని ఆశిస్తూ.. నా ఈ కథలో ఏమైనా తప్పులుంటే నన్ను మన్నించగలరు. నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *