అన్వేషణ ఎపిసోడ్ 6

అన్వేషణ ఎపిసోడ్ 6

అసలే దుఃఖంలోనున్న నాకు, ఆ తర్వాతి రోజు వాళ్ళమ్మ గారు కనిపించారు. దగ్గరకు వెళ్ళి పలకరించబోతే,

“ఛీ.. ఛీ.. నీ మొహం నాకు చూపించకు. నువ్వొక అనాధవని తెలిసి కూడా నా కూతురిని నీకిచ్చి కట్టబెడదామనుకుంటే, ఇంత దారుణానికి ఒడిగట్టి, తనని మోసం చేయడానికి నీకు మనసెలా ఒప్పిందయ్య…! ఇంకా ఏం కాకుండానే పరాయి వాళ్ళతో కులుకుతున్నవ్ అంటే, రేపు పెళ్ళైయ్యాక నేరుగా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తావేమో?. అప్పుడు నా కూతురి బ్రతుకేం కావాలి. పెళ్లికి ముందే ఇలాంటి నీ గుట్టులన్నీ నా కూతురి కంట పడేట్టు చేసి, ఆ దేవుడు మాకు ఒకింత మేలే చేశాడులే.

మేము డబ్బు లేనోల్లేమే కానీ, నీలా సంస్కారం లేనోల్లం కాదయ్యా..! అయినా ఏ దిక్కైనా ఉంటేనే కదా!, బంధం విలువ బంధుత్వం విలువ తెలిసేది. మా ఉసురు పోసుకుని ఇంతకింత అనుభవిస్తావ్ చూడూ…” అంటూ ఆవిడ కూడా నేను చెప్పేదేది వినకుండా నేను చేయని తప్పుకి నన్ను అనరాని మాటలంటూ, నన్ను శపిస్తూ, అక్కడి నుండి కోపంతో వెళ్ళిపోయారు.

తను చేసిన తప్పును, నాకు అన్వయించి, తను మంచిదై, నన్ను ఒక చెడ్డవాడిగా తీర్చిదిద్దింది సౌమ్య, వాళ్ల అమ్మగారి ముందు. దాంతో నాకీ ఆడజాతంటేనే అసహ్యం పుట్టింది. అప్పటికే ఇంతకముందు సత్య కాంత్, సత్య కిరణ్ విషయాలలో జరిగిన సంఘటనలతో నా రక్తం మరిగిపోతుంటే, దానికి ఈ సత్య కృష్ణ గాడి సంఘటన కూడా తోడవడంతో ..

నేను ఆవేశంగా

“పదరా…! ఇలాంటి ఆడవాళ్ళు బ్రతికుంటే, ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటారో? ఈ సంధ్య, సుకన్య, సౌమ్య… వీళ్ళకసలు ఈ లోకంలో బ్రతికే అర్హత లేదు. పదా! వెళ్లి చంపెద్ధాం” అంటూ వాడి చేతిని పట్టుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతుంటే,

దానికి వాడు నిరాకరిస్తూ…

“వదిలేయ్ రా… దాని పాపాన్న అదే పోతుంది. కూతురు ఇలాంటిది అని తెలిస్తే, ఇన్నాళ్లు తనకి గొడుగు పట్టి రక్షణగా నిలిచిన తన తల్లి చేతులు చచ్చుపడిపోతాయి. తన మనసు విరిగిపోతుంది. గుండె బద్దలైపోతుంది” అంటూ వాడు నన్నాపి, అక్కడ నుండి తీసుకొచ్చేసాడు.

ఇక జరిగిన ఈ మోసానికి తట్టుకోలేక, వీడు కూడా వాళ్ల లాగే ఎక్కడ దూరమైపోతాడోనని భయపడి, ఆ రోజు వాడిని నా దగ్గరే ఉండమన్నాను. దానికి, వాడు ముందు నిరాకరించినా అసలే నిరాశలోనున్న వాడిని చివరికి ఒప్పించగలిగాను. కంటి మీద కునుకు లేకుండా, ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా, అదే ఆలోచిస్తూ బాధతో నిట్టూరుస్తూ ఉన్న వాడిని నేను ఒదారుస్తూనే ఉన్నాను. అలా చాలా సేపటి తర్వాత చివరికి ఇద్దరం విశ్రమించాము.

అసలే రాత్రంతా సరిగా నిద్ర లేక, గాఢ నిద్రలోకి జారుకుని, తెల్లారి కొంచెం లేట్ గా లేచిన నాకు, పక్కన వాడు కనిపించలేదు.

“కృష్ణ ..! కృష్ణ..!” అంటూ వాడిని పిలుస్తూ పక్క గదిలోకి వెళ్ళేసరికి, ఫ్యాన్ కి ఉరివేసుకుని విగతజీవిలా కనిపించాడు. చివరికి నాకున్న ఆ ఒక్క తొడును కూడా ఆ భగవంతుడు దూరం చేశాడు.

కనీసం, నా కంటి నుండి ఒక్క కన్నీటిబొట్టు కూడా రాలలేదు వాడిని అలా చూసి. కారణం తప్పు చేసిన దాన్ని క్షమించి, ఆ శిక్ష తను వేసుకుని, నన్ను ఒంటరివాడిని చేసి అంతకంటే పెద్ద శిక్ష నాకు విధించాడని వాడి మీద కోపం.. లేదు..! లేదు…!! నా స్నేహితులంతా దూరమవడానికి కారకులైన ఆ ఆడవారంటే కోపం, ద్వేషం అనే నాలో ఏర్పడిన ఆవేశపూరిత భావాలు ఈ సారి వాళ్ళు దూరమైనా ఆ మనసులో బాధని…. అధిగమించాయి.

ఎంతంటే, ఆ క్షణంలో నా పక్కన అడదన్నది ఉంటే చాలు, నరికి చంపాలన్నంతగా.. వాళ్లపై ఎలాగైనా నాకు పగ తీర్చుకోవాలని ఉంది.” అంటూ… అక్కడితో ఆ డైరీలోనున్న విషయం పూర్తయ్యింది.

మిగతా కథ కోసం, ఆధారాల కోసం డైరీలో పేజీలను అటు, ఇటు తిప్పి వెతికాడు ఏసిపి రంజిత్. కానీ, అంతకుమించి అతనికేం ఆధారాలు లభించలేదు.

***********

తనకున్న ఆ చివరి తోడు కూడా దూరమవడంతో అనాధైనా సత్య కుమారే, తన స్నేహితులని దూరం చేసిన ఆడవాళ్లపై పగ తీర్చుకున్నాడా….? 

ఒకవేళ తీర్చుకుంటే ఆ తర్వాత అతడు ఏమైనట్టు?

రంజిత్ టీమ్ భావించినట్టు ఈ హత్యాలన్నింటి వెనుక ఒక బృందమేమీ లేదా..?

ఈ హత్యలన్నీ ఒక్కడే (సత్య కుమార్) చేసుంటాడా?

అసలు రంజిత్ కి ఆ డైరీ ఇచ్చిన అతను ఏమయ్యాడు? అతనెవరు? అసలీ డైరీ అతనికేలా దొరికింది?

ఆ హత్యలకు సంబంధించి రంజిత్ కి మిగిలిన ఆధారాలు ఎలా దొరికాయి?

తర్వాత ఏం జరిగిందో అన్వేషణ 7 లో చూడండి

– భరద్వాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *