అనువాద పటిమతో అందంగా తెలుగులో ‘ది గైడ్’
అనువాదం చేయాలంటే సామర్థ్యతో పాటు క్రమశిక్షణ కూడా ఉండాలి. క్రమశిక్షణ ఎందుకంటే అనువాదానికి లొంగని వాక్యాలు ముప్పతిప్పలు పెడుతుంటే దాన్ని ఎదుర్కోవటానికి క్రమశిక్షణ మనోనిబ్బరాన్ని ఇస్తుంది కాబట్టి.
క్రమశిక్షణ ఒక్క రోజులో పొందేది కాదు. అదో జీవిత కాలపు సాధన. వేమవరపు భీమేశ్వరరావు గారు ఫిజిక్స్ బోధిస్తూ హోమియోపతి వైద్యాన్ని నేర్చుకుని ఎంతోమందికి వైద్యం చేశారు.
బోధన, వైద్యం రెండింటికీ ఎంతో శ్రద్ధగా శుశ్రూత చేశారు. ఈ క్రమంలో ఎదురైన సవాళ్ళను కఠోర క్రమశిక్షణతో సాధించారు.
అంతేనా తన డెబ్బయ్యవ పడిలో ఆర్కే నారాయణ్ నవలలను తెలుగువారికి పరిచయం చేయాలనిపించింది ఆయనకు.
ఇప్పటికే waiting for mahatma (నవల), my days (ఆత్మ కథ), lolly road (కథలు) పుస్తకాలకు అనువాదరూపమిచ్చి మన్ననలు పొందారు.
ఎందుకో ఆర్కే నారాయణ్ రచనలను మనవాళ్ళెవ్వరూ తెలుగులోకి తెచ్చే ప్రయత్నం అంతగా చేసినట్టు కనబడదు.. అనువాద రచనకు సమస్యలు అనేకం.
పరిష్కారాలు అంతంత మాత్రం. ఇక చాకిరీ అనంతం. ఎంతో ప్రేమిస్తే తప్ప అనువాదాన్ని తలకెత్తుకోవడం అంత సులభం కాదు.
రచయిత అనుమతి తప్పనిసరి. లేకపోతే మేథోహక్కుల సమస్య ఎదురవుతుంది. రచయిత కీర్తిశేషులు అయితే వారసులను వెతికిపట్టుకుని అనుమతి తీసుకోవాలి.
ఇలాంటి గడ్డుసమస్యలను పరిష్కరించాలంటే ఓపిక ఉండాలి. అనువాదం చేయాలన్న బలీయమైన కోరిక మాత్రమే దానిని సాధించగలుగుతుంది. ఈ విషయంలో వయసు భీమేశ్వరరావు గారికి అడ్డంకి కాకపోవటం విశేషం.
ఇంతకుముందు రచనలు చేసిన అనుభవం లేకపోయినా ఫేస్బుక్ మాధ్యమంగా రాసుకున్న జ్ఞాపకాలు ఆయనకో ధైర్యాన్ని కలుగచేశాయి…
తన అభిమాన రచయిత ఆర్క్ నారాయణ్ నవలలను తెలుగులో అనువదించేందుకు అవసరమైన భూమికనేర్పరిచాయి..
అనువాద సమస్యలను అధిగమించే మార్గాలను అన్వేషించారు. అనువాదంలోని సుళువులను కనుక్కున్నారు. అదే ఆయనకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది.
అందరికీ సుపరిచితమయిన ‘ది గైడ్’ నవలను తెలుగు పాఠకులకోసం తెచ్చారు. ఆంగ్లంలో చాలామంది చదివే ఉంటారుకదా.. మళ్ళీ తెలుగులో ఎందుకంటారేమో కానీ మనభాషలో చదివితే ఆ ఉద్వేగాలు మరింతగా హత్తుకుంటాయికదా..
ఆర్కే నారాయణ్ రచనల్లో చిన్న చిన్న వెటకారాలు, వర్ణనలు మనల్ని వెంటాడుతాయి. అలాగే చిన్న చిన్న వాక్యాలతో కథను నడిపించటం, మానవ ప్రవృత్తిని నేర్పుగా విశ్లేషించటం వారి ప్రత్యేకత.
ఇక ఊహజనిత మాల్గుడి టౌన్ వాతావరణాన్ని ఆయన చిత్రించిన తీరు అమోఘమని చెప్పక్కర్లేదు కదా.. ఇవన్నీ అలవోకగా తెలుగుదనాన్ని సంతరించుకోవటంలో భీమేశ్వరరావు గారి ముద్ర కనిపిస్తుంది.
అనువాదమో కత్తిమీదసాము. మూలానికి విధేయంగా ఉంటూనే అనువాద పోకడలు మరీ ఎక్కువగా కలిగుండకూడదు.
స్వతంత్ర రచనలా అనిపించటంవలనే ఏమో తనది అనుసృజన అని చెప్పుకున్నారు.. 1958లో వచ్చిన ‘ది గైడ్ ‘ అదేపేరుతో 2021లో తెలుగులోకి రావటం ఆశ్చర్యమనిపించినా కాల్పనిక మాల్గుడి టౌన్ పరిసరాల వర్ణన ఆకట్టుకుంటాయి.
నవల వర్తమానం, గతం ల మధ్య ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణాన్ని అనువాదం చక్కగా పట్టుకోగలిగింది. రాజు గతం ఉత్తమ పురుషలో సాగితే వర్తమానం నేరేటర్ ద్వారా వినబడుతుంది.
ఒకపక్క ఆధునికత మరోపక్క మూఢనమ్మకాలు వీటిని సమన్వయం చేస్తారు ఆర్కేనారాయణ్.. బహుశా సమన్యాయం కుదరదని తెలుసేమో వారికి.
అలాగే ఏకకాలంలో గతం వర్తమానాల చిత్రణ ఎక్కడా ఇబ్బందిపెట్టకుండా సాగించటం కూడా వారికే సాధ్యం.
అప్పటికి ఈతరహా కథనం ప్రత్యేకమయిదిగా భావించాలి.అనేక పాత్రలతో ఆర్కే నారాయణ్ గైడ్ నవలను ఒక క్లాసిక్ గా మలిచారు..
సమాజంలోని ప్రతినిధులుగా పాత్రలను ముస్తాబు చేస్తారు.నాట్యానికి ప్రాణమిచ్చే రోజీ(తర్వాత నళిని) పరిశోధనలో మునిగిపోయి కుటుంబాన్ని మరిచిపోయిన మార్కో, జీవితాన్ని నేలపై నడిపించే డ్రైవర్ గఫూర్, కొడుకుపై వల్లమాలిన అభిమానం చూపించే తల్లి, జీవితంలో అనేక దశలు చూసిన రైల్వే గైడ్ రాజు,అమాయక వేలన్..
వీళ్లందరూ మనలోకి చొరబడతారు.మన ప్రేమ చూరగొంటారు..మాల్గుడి టౌన్,మంగళ గ్రామం,సరయూ నది మనకు కొత్తగా అనిపించవు.పరిచయమైనవిగా తోస్తాయి..
ప్రధానంగా ‘రైల్వే రాజు’ ఒక ‘ఆధ్యాత్మికస్వామి’గా మారే పరిణామక్రమంలో జరిగిన అనేక ఘట్టాల సమాహారం ఈ నవల.
మానవ జీవితం complexities ని, అమాయకత్వాన్ని ముడివేసుకుని సాగేటప్పుడు ఎదురయ్యే ఎత్తుపల్లాలను చూపుతూ తనలోకి లాక్కుంటుంది.
స్త్రీ, పురుష సంబంధాలలోని ఆకర్షణలు, వైరుధ్యాలను పెనవేసుకుంటూ నడుస్తుంది. ఆర్కే నారాయణ్ అలా నడుపుతారు కథను అనడం సబబు..
ఇది స్థూలంగా మూల నవల కథ లేదా నేపథ్యం.. దానికి తెలుగు నవలేమో అన్నంతగా ఉద్వేగాలను అద్దిన భీమేశ్వరరావుగారిని అభినందించాలి.
మనసుపెట్టి అనువాదం చేసినప్పుడు కనిపించే వెలుగు గైడ్ నవల తెలుగు అనువాదంలో కనిపిస్తుంది.. గజిబిజి గందరగోళాలు లేని అనువాదం పాఠకుడిని మూల రచనను వెతుక్కోనివ్వదు..
అది భీమేశ్వరరావుగారు సాధించిన విజయం.. ఇక ఆలస్యమెందుకు.. ఈ తెలుగులో పలకరిస్తున్న ఈ ‘గైడ్’ తో ప్రయాణం మొదలుపెట్టి ఒక జీవిత కాలం అనుభవంలోకి అడుగేయండి…
– సి.యస్.రాంబాబు