అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని అలజడి తన గుండెల్లో అన్ని మరిచిపోయి చూస్తున్నాడు రామ్..

అందమైన పల్లెటూరి తొలి కూత కూయగానే పచ్చని కల్లాపి జల్లి ముగ్గులతో సంతరించుకొని కొద్ది కొద్దిగా చీకటి తెరలను తొలగించుకుంటూ సూరీడు మెల్లిగా వస్తున్న వేళలో, చెట్లపైన ‌పిట్టలు కిచుకిచుకుమంటూ వాటి సంగీత కూతలు కూస్తూ వీధంతా సందడి చేసే సమయంలో ఆ ఊరిలో అందాల సీతారాముల గుడి ఆ గుళ్ళో పూజలు స్వామి వారి ఆలయంలో మొదలై గంటలు మ్రోగుతున్న వేళ…

ఆ గుడి గంట శబ్దం తన జీవితకాల నిరీక్షణకు సమాధానం దొరికిందని, తన ఎదురు చూపుల కాంక్షకి బానిస చేస్తుందని ఊహించనే లేదు రామ్ ఆక్షణం… చాలా రోజుల తర్వాత తన ఊరికి వచ్చిన రామ్ ప్రయాణం చేసి చాలా అలసి పోయి అట్టే నిద్ర మత్తులో మునిగి పోయాడు…

ఏరా తెల్లారింది బారేడు పొద్దు అవుతుంది ఇంకా పడుకుని ఉంటావే, ఆ సీతారాముల గుళ్ళో పూజలు మొదలైయ్యాయి మన ఇంటి పక్కనే ఆ గుడి ఎంత సుందరవదనం చక్కగా స్నానం చేసిరా, గుడికి వెళ్ళి స్వామి వారి దర్శనం చేసుకొని టిఫిన్ చేద్దువుగానీ అంటూ తన అరుపులతో ఆప్యాయత కాస్త జోడించి పిలిచింది రామ్ అమ్మ పార్వతమ్మ…

అలాగే అమ్మ అంటూ కాస్త గారాబంతో అమ్మని అలుముకొని ఇదిగో పార్వతమ్మ చిటికెలో వచ్చెస్తాడు నీ కొడుకు అంటూ, చక్కగా స్నానం చేసి అలా బాల్కనిలోకి వచ్చి గుడివైపు చూస్తూ…. ఆహా ఎంత అందమైన నా పల్లె చదువు, ఉద్యోగం అని ఇన్ని రోజులు నా పల్లెకు దూరంగా ఉన్నానే ఈ నీలిమేఘాలు స్వచ్చమైన గాలి మనసులో సంతోషం అలా చూస్తూ ఉండగా ‌ఎక్కడి నుండో కోకిల స్వరం, అందమైన గొంతు నుండి తీయని తీపి అమ్రృతంలా మనసుని హత్తుకునేలా ఒక పాట చెవికి అలంకరణమై మనసుకి ఆహ్లాదంగా వినిపిస్తోంది..

ఈ గొంతు ఎవరిది ఎక్కడ నుంచి వస్తుంది అని అటు ఇటు దిక్కులు చూడసాగాడు.. చుట్టూ పక్కల అంత ఆత్రుతతో వెతికితే గుళ్ళో నుంచి వస్తుంది ఆ రామయ్యా భక్తి పాటలతో ప్రవేశించేలా…

చకచకగా అడుగులు వేస్తూ, వెళ్తు వెళ్తునే తన చొక్కా వేసుకుంటూ అడుగులు సాగాయి… ఏరా ఎందుకు అంత తొందర కనీసం టీ కూడా తాగి వెళ్ళరా రామ్…. ఏం లేదు అమ్మా గుడికి వెళ్తున్నా…

అక్కడికి చేరుకోగానే కనిపించి, కనిపించని దగ్గర్లో ఉంది అనేలా అతి దగ్గరగా వచ్చి అల్లంతా దూరంలో మాయమైంది… గులాబి రంగు ఓణీ, ఆకుపచ్చని పట్టుపరికిణిలో, వయ్యారాలు ఒలికించే వాలుజడ వెనుక నుండి చూస్తే ఇంత అందంగా ఉంది.. తన రూపం చూడలేక పోయానే అనే బాధలో అలసి సొలసి ఇంటికి చేరుకొని ఆరోజంతా ఆమె ధ్యాసలోనే కళ్ళలో తన రూపం నింపుకుని…

తెల్లవారితే ఉగాది కదా తను మళ్ళీ వస్తుందా గుడికి, ఆ వస్తుందిలే రాకపోతే ఎక్కడికి వెళ్తుంది… నాకోసమే పుట్టినట్లు ఉంది ఆ రాముని కోసం సీతలా.. ఒకవేళ రాకపోతే ఎక్కడ వెతకాలి, అమ్మో ఎలా “ఓ సీతరామ చక్కగా నీ సీతమ్మతో పూజలందుకుంటున్నావు”. ఆ అమ్మాయిని నా దగ్గరకు చేర్చి నాకు చూపించయ్యా ఎక్కడ ఉందో ఎలా ఉందో మళ్లీ నీ గుడికి ఆ అమ్మాయి వచ్చేలా చూడు సామి అంటూ ఎన్నో సందేహాల నడుమ తన ఆలోచనలు నిండిన మనసుతోనే నిదురలోకి జారుకున్నాడు ‌….

తర్వాత ఏమైంది?

– సీత మహాలక్ష్మి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *