అనుభవమే గురువు
జీవితం చాలా చిన్నది కాబట్టి ప్రతీ క్షణాన్ని ఒడిసి పట్టుకుని ఆస్వాదించాలి అనుకునేది కొందరైతే ఎంత పెద్ద జీవితం ఇది పుట్టినప్పటి నుంచీ కాటికి కాళ్లు చాపే వరకూ ఎన్ని చూస్తాం, ఎన్ని చేస్తాం. పుడతాం చదువుకుంటాం, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, పిల్లలు, సంసారం, బాధ్యతలు, ఒడిదుకులు, కష్టాలు, నష్టాలు, మరుపురాని క్షణాలు, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, అబ్బో ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుకునే వారు మరికొందరు.
సాధారణంగానే మనిషి ఆశాజీవి. ఆశృవులు తెలీని మనిషి ఉంటాడేమో కానీ ఆశలు లేని మనిషి ఉండడు. మనకి ఊహా తెలిసినప్పటి నుండి ప్రతీ రోజు ఎదో ఒక దాని మీద ఆశ పడతాం, ఏవేవో కలలు కంటాం. చిన్ననాటి నుంచే భవిష్యతలో ఇది అవ్వాలి, అది అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. అనుకున్నది సాధించడానికి తగిన కృషి కూడా చేస్తాం.
కానీ… కాలం చాలా తుంటరిది. మనం కోరుకున్నది కాకుండా ఇంకేదో తీసుకొచ్చి అందిస్తుంది. కొన్ని సార్లు జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది కూడా. తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. అందరూ మనుషులు ఒకటే. అందరిదీ ఒకే రకమైన సామర్థ్యం. కానీ వాళ్ళు పెరిగిన విధానం, చుట్టూ ఉన్న వాతావరణం, స్నేహితులు, బంధువులు, కుటుంబ పరిస్థితులు వంటి కొన్ని అంశాలు మనిషికీ మనిషికి మధ్య వృత్యాశం కల్పిస్తాయి.
అనుభవిస్తే కానీ ఈ లోకంలో ఏదీ తెలీదు అనేది నగ్న సత్యం. అనుభవాన్నీ మించిన గొప్ప గురువు ఇంకేదీ లేదు ఈ విశ్వంలో. అందుకే ఎక్కువ కష్టాలు చూసిన వాళ్ళే జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కష్ఠానికి భయపడిన వాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. కన్న కలలు కరిగిపోయి కాలంతో కలిసి కదిలి పోయాక గానీ మనకి అర్ధం కాదు జీవితం అంటే ఏంటని.
ఎంతో అందంగా ఉంటుందని, ఉండాలని ఊహించుకున్న జీవితం, కాలం కాళ్ళ కింద పడి నలిగిపోతుంటే అప్పుడు నేర్చుకుంటాం, అసలు జీవితం అంటే ఏమిటి, సమాజం ఎంత స్వార్థమైనది, నీ వారెవరూ, కాని వారెవరూ, కష్టంలో కలిసొచ్చే స్నేహితులు ఎవరు, నీతోనే ఉంటూ నిన్ను నాశనం చేసే నీ అన్న వాళ్ళు ఎవరూ అని.
కాలం విలువ ఎంత, మన శక్తి సామర్థ్యాలు ఎంత, నీ బలం ఏంటి, నీ బలహీనత ఏంటి, నిజం ఏదో, అబద్దం ఏదో, డబ్బు విలువ, ఆకలి విలువ కాలం కళ్ళెర్రజేస్తే కానీ మనకి అర్థం కాదు. చివరికి మనం అనుభవం ద్వారా తెలుసుకునే విషయం ఏంటంటే మన కర్తవ్యం మనం నిజాయితీగా చేసుకుంటూ పోతే చాలు, కాలమే గుణపాఠం నేర్పుతుంది అని. మనలో పిరికితనం పోగొట్టి తెగింపుని తెస్తుంది అని తెలుసుకుంటాం.
కాలం ఏ ఒక్కరినీ విడిచి పెట్టదు. ప్రతీ ఒక్కరికీ గుణపాఠాన్ని నేర్పించే పోతుంది. కాలం పెట్టే జీవిత పరీక్షలో గుణపాఠం నేర్చుకుంటే బ్రతుకు ధన్యం లేకుంటే వ్యర్థం ఇది వాస్తవం.
– రమ్య పాలెపు