అంతర్ముఖం

అంతర్ముఖం

నేను చదువుకునే రోజుల్లో నాతో పాటు చదువుకునే ఒక అమ్మాయి ఉండేది తన పేరు లత. ఎప్పుడూ తను హోంవర్క్ చేసినట్లు కనిపించేది కాదు. చివరి నిమిషంలో మాత్రం నన్ను అడిగేది. నీ నోట్స్ నాకు ఇవ్వవా అంటూ చాలా బ్రతిమాలేది. సరేలే పోనీ పాపం అని ఇచ్చేదాన్ని.

అలాగే పరీక్షల్లో కూడా చదవకుండా, నన్ను చూపించమంటూ తను రాసుకునేది. అప్పుడు నాకన్నా ఎక్కువ మార్కులు తనకే వచ్చేవి. అయ్యో  నేను అనవసరంగా చూపించానే అని నేను లోలోపల బాధపడేదాన్ని.

అలా మా చదువులు ముగిసాయి.. పెద్దవాళ్ళం అయిపోయాము మాకు పెళ్లి చూపులు చూడడం మొదలుపెట్టారు. కానీ నాకు వచ్చిన సంబంధాలన్నీ చూసి వెళ్లడం తప్ప ఒక్కటి కూడా ఒకటి కూడా ముడి పడలేదు. ఎందుకిలా జరుగుతుందో అని మా అమ్మానాన్నలు చాలా బాధపడేవారు ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేయించేవారు పెళ్లి కుదరాలని, అయినా ఏ ఒక్కటి కూడా కుదరకుండా పోయేది.

మా పక్కిళ్లే మాధవిది కూడా కాబట్టి తనకి అనుకోకుండా ఒక సంబంధం వచ్చింది. వాళ్లు చూసి వెళ్లారు నేను ఆ సమయంలో ఎందుకో బయట నిల్చున్నాను. మాధవికి పెళ్లి సంబంధం వచ్చిందని నాకు తెలియదు వాళ్ళు నన్ను కూడా చూస్తూ వెళ్లారు.

వచ్చిన సంబంధం చాలా పెద్ద సంబంధం దాదాపు కలెక్టర్ అంతటి హోదా ఉన్నది గవర్నమెంట్ జాబు హ్యాపీ లైఫ్ చాలా మంచి సంబంధం అని రాత్రి అమ్మ వాళ్లు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. మాధవి చాలా అదృష్టవంతురాలు మంచి సంబంధం దొరికింది అనే మాట్లాడుకున్నారు నేను కూడా చాలా సంతోషించాను నా స్నేహితురాలికి ఒక మంచి సంబంధం దొరికిందని అనుకున్నాను.

దాంతోపాటు నాకు సంబంధాలు దొరకడం లేదని కాస్త బాధ కూడా వేసిన మాట నిజం. అయినా నేనేం బాధపడలేదు బాధవికి సంబంధం కుదరాలి మంచిగా పెళ్లి జరిగి తను సంతోషంగా ఉండాలని కోరుకున్నాను.

ఆ మరుసటి రోజు ఒక కారు వచ్చి మా ఇంటి ముందు ఆగింది. నాన్నగారు ఆ కారు చూసి హడావుడి పడుతూ బయటకు వెళ్లి ఎవరండీ మీరు ఏం కావాలి మీకు అంటూ అడిగారు మమ్మల్ని కాస్త లోపలికి రానిస్తారా అంటూ వాళ్ళు అనడంతో అయ్యో తప్పు అయిపోయిందండీ లోపలికి రండి అని అనగానే వాళ్లందరూ లోపలికి వచ్చారు.

నాన్నగారు అమ్మను కేకేసి వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు ఏర్పాటు చేయమని చెప్పారు కానీ వాళ్లు మాత్రం మాకు అవి ఏమీ వద్దండి మీ అమ్మాయిని ఇస్తే చాలు అని అనగానే మా నాన్నగారు నివ్వేరపోయారు.

ఆలోచన నుంచి తెలుపుకొని ఉలిక్కిపడుతూ అసలు ఎవరండీ మీరు మీ గురించి మాకు ఏమీ తెలియదు మీదే ఊరో తెలియదు తెలియకుండా హఠాత్తుగా ఇలా వచ్చి పిల్లని అడగడం ఏమైనా భావ్యమా అంటూ నాన్నగారు వారితో అన్నారు ఇంతలో వారిలో పెద్దగా అతను అయ్యా మేము మీ అమ్మాయిని నిన్ననే చూసాం మాకు చాలా బాగా నచ్చింది మా అబ్బాయికి అయితే విపరీతంగా నచ్చింది మాకు ఒక్క రూపాయి కట్నం కూడా అవసరం లేదు మీరు ఒప్పుకుంటే చాలు అంతా మేమే చూసుకుంటాం అంటూ నిజం చెప్పేశారు.

ఏంటి నిన్న మీరు మా అమ్మాయిని చూశారా ఎక్కడ మీరు ఎప్పుడు వచ్చారు మా ఇంటికి అంటూ నాన్నగారు అడిగారు ఆశ్చర్యంగా… మీ ఇంటికి కాదండీ మీ పక్కింటికి పెళ్లి చూపుల కోసం వచ్చాము అయితే మాకు ఆ అమ్మాయి నచ్చలేదు వెళ్ళిపోతున్నప్పుడు మీ అమ్మాయి బయట నిలబడి ఉండడం మా అబ్బాయి చూశాడట చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను లేకపోతే ఇంకొకరిని చేసుకోను అని పట్టు పట్టుకొని కూర్చున్నాడు అందుకే మేము ఇంత పొద్దున్నే రావాల్సి వచ్చింది అంటూ అసలు విషయం చెప్పాడు.

దానికి నాన్నగారు మీరు చేసింది చాలా తప్పండీ ఒకరింటికి పెళ్లి చూపులకు వచ్చి పరాయి ఇంటి అమ్మాయిని అడగడం న్యాయం కాదు రేపు పొద్దున వాళ్ళు ఏదైనా అంటే బాగోదు అసలే మాది మాట పడని వంశం మళ్లీ మాకు మాకు గొడవలు వస్తాయి దయచేసి మీరు వెళ్లిపోండి అని అన్నారు.

కానీ దానికి వాళ్లు మీకు ఏ గొడవలు రాకుండా మేము చూసుకుంటాం మేము వాళ్ళని ఒప్పించుకుంటాం మీకు మాట మాత్రం రానివ్వం ఒప్పుకోండి అంటూ నాన్నను ఒత్తిడి చేశారు నాన్నగారు మాత్రం మా అమ్మాయి కూడా ఇష్టపడాలి కదా అన్నారు ఇంకా దాందేముంది అమ్మాయిని పిలిచి అడిగితే సారీ అని అనగానే అమ్మ అమ్మాయి ఇంకా రెడీ అవ్వలేదండి అని చెప్పింది.

రెడీ అవ్వడానికి ఏముందమ్మ నిన్ననే చూసామని చెప్పాము కదా బంగారు బొమ్మలా ఉంది మీ అమ్మాయిని తప్ప ఇంకెవరిని చేసుకోనని మా వాడు ఒకటే గొడవ ఎలా ఉందో అలా తీసుకురండి అందరి ముందే అడిగేద్దాం అని అన్నారు. సరే సరేనంటూ నాన్నగారు నన్ను పిలిచారు. అందరి ముందు నాన్నగారు ఏమ్మా ఇగో ఇతనే పెళ్లికొడుకు నీకు నచ్చాడా లేదా అనేది ఆలోచించి చెప్పు అని అన్నారు. నేను అతన్ని చూశాను చూడడానికి బాగానే ఉన్నాడు నాకు అతనిలో ఏ లోపం కనిపించలేదు కానీ మనసు ఎలాంటిదో అనే మీమాంసతో తల అటు ఇటు ఉపాను వాళ్ళు చెప్పు అని అనడంతో…

చూశారా బావగారు అమ్మాయి కూడా ఒప్పుకుంది ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మంచి రోజు ఈరోజే తాంబూలాలు ఇచ్చుకుందాం అంటూ వాళ్లే తాంబూలాలు సర్ది నాన్నకు ఇవ్వడం వాళ్లు మా నుంచి తీసుకోవడం జరిగిపోయింది. వారం రోజుల్లోనే ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మాధవి నా దగ్గరికి వచ్చింది. లత నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని అనడంతో ఏంటి పర్సనల్గా అంటున్నావు అంటూ తలుపులు మూసి వచ్చాను. అప్పుడు మాధవి గట్టిగా ఏడుస్తూ నా కాళ్ళపై పడి నన్ను క్షమించు లతా నీకు వచ్చిన పెళ్లి సంబంధాలు అన్ని చెడగొట్టింది నేనే.

నీకు పెళ్లి సంబంధం వస్తుంది అనగానే నాకు అసూయ పుట్టేది అందువల్ల వాళ్ళు వచ్చే దారిలో నేనే నిల్చొని మీరు ఎవరి ఇంటికి వెళ్తున్నారు అంటూ అడిగి ఆ అమ్మాయి మంచిది కాదు అని చెప్పేదాన్ని దాంతో వాళ్లు అక్కడి నుంచి అటే వెళ్ళిపోయే వాళ్ళు.

కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా నాకు వచ్చిన సంబంధం నన్ను కాదని నిన్ను చేసుకున్నారు నన్ను క్షమించు లత ఇన్నాళ్లు నీ సంబంధాలన్నీ చెడగొట్టాను కానీ ఇప్పుడు నాకు వచ్చిన బంగారం లాంటిది సంబంధాన్ని నీకు దక్కింది అప్పుడే సంబంధం చెడగొట్టకపోతే ఇప్పటికీ నీకు పెళ్లి జరిగి ఉండేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు నన్నే చేసుకునేవాళ్లు అంటూ తన మనసులోని మాటలు అంతర్ముఖంగా ఉన్న బాధనంతా చెప్పి ఏడ్చింది.

చూడు మాధవి ఒకరికి కీడు చేయాలని చూస్తే అది మనకి తిరిగి కొడుతుంది కాబట్టి ఇంకెప్పుడూ ఎవరికీ కిడు చేయాలని చూడకు. కనీసం ఇప్పటికైనా నీ అంతర్ముఖంలో ఉన్న మాటలు చెప్పావు. ఇప్పటికైనా నీ మనసును స్వచ్ఛంగా ఉంచుకో ఎవరికి కీడు తల పెట్టాలని చూడకు. చిన్నప్పటి నుంచి నువ్వు అన్నిట్లో నన్ను ఫాలో అయ్యావు. కానీ నేనే నీ బుద్ధి తెలుసుకోలేకపోయాను. అది నా మంచితనం కావచ్చు అన్నాను నేను.

అవును లతా చిన్నప్పటినుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు ఎందులోనూ మొదటిగా రావద్దు. అని అన్నిట్లో నీకు మార్పులు తక్కువ రావాలని, నేనే నీ పేపరు ఒక్కొక్కటి తిసేసేదాన్ని కానీ అదంతా అప్పుడు. నేను ఇప్పుడు చాలా మారిపోయాను. నన్ను క్షమిస్తావు కదూ.. అని కాళ్లు పట్టుకుంది మాధవి.

సరే ఏది జరిగినా మన మంచికే కదా, ఇప్పటికైనా నీ మనసు మారింది. నీకు కూడా తొందరలోనే మంచి సంబంధం రావాలని కోరుకుంటాను అన్నాను నేను. తన మనసు స్వచ్ఛంగా చేసుకొని, తన మనసులోని మాటలన్నీ నాకు చెప్పేసి నిర్మలమైన మనసుతో, తలుపులు తీసుకొని బయటకు వెళ్లిపోయింది మాధవి.

తర్వాతి నెలలో మాధవికి ఒక సంబంధం రావడం, అప్పుడే మాకు ముహూర్తాలు కుదరడంతో, నా పెళ్లి, మాధవి పెళ్లి దాదాపు ఒకరోజు తేడాలో జరిగిపోయాయి. వీడ్కోలు సమయంలో మాధవి నా దగ్గరికి వచ్చి, నేను ఇంత చేసిన కూడా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, అదే నన్ను వేధిస్తుంది. నన్ను ఒక్కసారి తిట్టావా అంటూ అడిగింది.

దానికి నేను చిరునవ్వు నవ్వుతూ మనిషి తన తప్పు తాను తెలుసుకోవడం, ప్రాయశ్చిత్తం అడగడం తోనే మారినట్లు లెక్క. ఇంక నేను నిన్ను కోప్పడి లాభం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మాని, కాపురం బాగా చేసుకో, సంతోషంగా ఉండు అంటూ చెప్పాను. ఇద్దరం  మా అత్తారిల్లుకు ప్రయాణం అయ్యాం.

నిజానికి మనిషికి నాలుగు ముఖాలు ఉంటాయి అవి ఒకటి నటిస్తాయి, రెండు పైకి నవ్వుతున్న లోలోపల అసూయా చెందుతారు, మూడోది అన్నిటిలో తామే సాయం చేస్తున్నట్టు ఉంటారు. కాని మోసం చేస్తారు, ఇక నాలుగోది అది ఎంత భయంకరంగా ఉంటుంది అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది, ఇలాంటి వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు, అంతటి భయంకరమైన రూపం లో  అందంగా కనిపిస్తారు. 

 

-భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *