అంతర్జాలికుడు
నేటి సాంకేతిక యుగంలో అంతా యాంత్రికమయమే. మనిషి కనుగొన్న అంతర్జాలం అతని అత్యున్నత ప్రతిభకు నిదర్శనంగా భాసిల్లుతోంది. ఈ అంతర్జాలం ప్రపంచo మొత్తాన్ని ఇతర కృత్రిమ గ్రహాలతో కలిపి నడిపిస్తుంది.
ఒక్క క్లిక్ చేస్తే మనకు కావలసిన పనులన్నీ క్షణాల్లో అయిపోతున్నాయి. వస్తువులు, సేవలు ఇంట్లో ఉండే కొనుగోలు చేస్తున్నాము. సెకండ్లలో లక్షలాది డబ్బును మరొకరికి పంపిస్తున్నాము.
డిజిటల్ కరెన్సీ క్షణాల్లో చేతులు మారుతోంది. దృశ్య మాధ్యమాల ద్వారా ప్రపంచం నలుమూలల్లో జరిగే సంఘటనలను ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాము. ఏ మారుమూల సప్త సముద్రాల ఆవల ఉన్న వ్యక్తితోనైనా ప్రత్యక్షంగా కూర్చుని మాట్లాడుతున్న అనుభూతిని పొందుతున్నాము.
ఎలాంటి తీగలు, అనుసంధానాలు లేకుండా శూన్యం ద్వారా ఈ సాంకేతిక మాయను సొంతం చేసుకున్నాము.
ఒక మనిషి జీవితాన్ని అరచేతిలోని చరవాణి మీటలు నొక్కడం ద్వారా నిమిషాల్లో మార్చేస్తున్నాము. అంతర్జాల విన్యాసంలో పడి ఊపిరి తీయడం కూడా మరిచిపోయేంత బిజీ లైఫ్ ను మనిషి కొనసాగిస్తూ తనను తాను కోల్పోతున్నాడు.
జీవితంలోని అందమైన అనుబంధాలను, ఆప్యాయతలను మిస్ అవుతున్నాడు. మానవత్వం మూలాలను మరిచి మరమనిషిగా రూపాంతరం చెందుతున్నాడనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకునే విషయం. విస్మరించలేని పరమ సత్యం.
మనిషి సాధించిన విజ్ఞానము ప్రతిభ అంతా తన సొంతమే అని విర్రవీగుతూ సాటి మనిషిని మనిషిగా చూసే తత్వాన్ని మర్చిపోతూ తన అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు.
ప్రపంచంలో జరిగే సర్వ సంఘటనలకు, అన్ని కార్యకలాపాలకు మూలం ఆ పైనున్న అంతర్జాలికుడే అన్న సత్యం ప్రతి ఒక్కరు గుర్తెరిగితే మనిషి మనుగడకి ప్రమాదం వాటిల్లకుండా ప్రయత్నించిన వారమవుతాము.
విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ వివేకం కూడా అదే నిష్పత్తిలో పెరిగినప్పుడే సర్వజనుల శ్రేయస్సు అనేది సాకారం అవుతుంది..
-మామిడాల శైలజ