అంత వరకూ మంచిదే.!

అంత వరకూ మంచిదే.!

అనగనగా ఒక ఊరిలో స్వామి మాల‌ వేసుకున్న ఒక భక్తుడు‌.. ఇరుముడి ధరించి అలా‌ అడవి మార్గాన‌ వెళుతున్నాడు.. దారిలో జంతువుల కోసం‌ వేసిన‌ ఉచ్చులో తెలియకుండా కాలుపెట్టాడు.. ఆ బాధకు గావుకేకపెట్టాడు.. ఆ అరుపులు విని అడవిలో కట్టెలు ఏరుకోవడానికి వచ్చిన ఓ గిరిజన మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది.. అతని బాధ చూసి కంగారుపడింది..

విలవిల్లాడిపోతున్న అతనిని కాపాడాలనుకుంది.. కానీ అడుగు ముందుకు పడటం లేదు.. కారణం.. ఆమె నెలసరిలో ఉంది.. అతనేమో స్వామి మాల‌లో ఉన్నాడు.. ముట్టుకుంటే అపచారమంటాడేమో.. మాల‌ అపవిత్రం అయిపోయిందంటాడేమో.. అలాగని వదిలేస్తే రక్తం‌ కారి ప్రాణాలు పోతాయేమో.. ఇప్పుడేం చేయాలి దొరా.! అనుకుంటూ పరిపరి విధాలా మదనపడుతోంది.

ఈ కథలో ఆ మహిళ ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? మనిషి ప్రాణమా? తరతరాల నుంచీ ఉన్న కట్టుబాటా? మైలా లేక మాలా? దేనికి ప్రాధాన్యతనివ్వాలంటారు? నేనైతే ఆపదలో ఉన్నవారిని‌ కాపాడటమే ముఖ్యమంటాను. “గజేంద్ర మోక్షం” లో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ఈ ధర్మాన్ని ప్రబోధించాడు. సరిగ్గా ఇదే చెబుతోంది సైన్స్..

మూఢత్వం‌ కానంతవరకూ ఏ నమ్మకాన్నీ వదలాల్సిన అవసరం లేదు. కానీ నేటి సమాజంలో అలా‌ ఎందరుంటున్నారు? నేటికీ ఆచారాలు, సంప్రదాయాల ముసుగులో మూగజీవాలనే కాదు‌ సాటి మనుషులను కూడా బాధకు గురిచేస్తూ‌నే ఉన్నారు.

స్వామీజీల‌ దగ్గరకు వెళితే జబ్బులు తగ్గిపోతాయని, పసర‌ మందు పోస్తే ప్రాణాంతక వ్యాధులు సైతం నయమైపోతాయని.. అంతెందుకు. ఆడ,మగ ఒకరినొకరు వశపరుచునేలా మా‌ దగ్గర మందులున్నాయనే వారి మాయమాటలు నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు..  క్షుద్రపూజల వల్లే అనారోగ్యంపాలయ్యామంటూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.

ఇంటికి మామిడాకుల‌ తోరణాలు కడితే శుభం అంటుంది సంప్రదాయం. పచ్చని ఆకులతో ప్రాణవాయువు వస్తుందంటోంది సైన్స్.. గుమ్మాలకు పసుపురాయడం సంప్రదాయం.. పసుపు యాంటీబయాటిక్ అంటుంది సైన్స్. దీపావళికి టపాసులు కాల్చడం పండుగ. వాటి వల్ల వచ్చే పొగకు క్రిమికీటకాలు నశిస్తాయనేది సైన్స్..

అయితే ఇప్పుడాటపాసుల్లో రసాయనాలు ఎక్కువై పర్యావరణానికి హానికలుగుతోందని అదే సైన్స్ చెబుతున్నది కూడా నిజం. ఎందుకంటే పూర్వం టపాసులు ఆవు పేడ, తాటి ఆకులు, కలప, ఉప్పు వంటి వాటితో తయారు చేసేవారు. వాటి వల్ల ఎలాంటి హానీ కలిగేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు.

నుదుటిన ధరించే బొట్టులోనూ.. కాలికి పెట్టుకునే మెట్టెలోనూ.. చివరికి మొలతాడులోనూ సైన్స్ ఉంది. మనిషి సంప్రదాయాలను, నమ్మకాలనూ వదలాల్సిన అవసరం లేదు. వాటిని‌ మూఢత్వంగా మార్చనంతవరకూ.. సైన్స్ ని కూడా పూర్తిగా నమ్మాల్సిన పనిలేదు.. మానవ విజ్ఞానానికి అందని ఎన్నో రహస్యాలు ఈ అనంత విశ్వంలో ఎన్నో ఉండవచ్చు.. శాస్త్రం వాటిని‌ నిత్యం అన్వేషిస్తూనే ఉంటుంది.

– ది పెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *