అన్నల చిట్టి చెల్లి
అమ్మానాన్నల కడుపు తీపి తీయదనముతో
అన్నల మమకార మాధుర్యముతో అక్కల అనురాగ ఆప్యాయతతో వదినమ్మల ప్రేమ కలిపి లాలిస్తు కవ్విస్తూ మురిపిస్తూ ఆడిస్తూ కమ్మగా గోరుముద్దలు తినిపిస్తూ…
బూచోడిని చూపిస్తూ
అందరిలో ఆడితే అరిగిపోతుంది ఏమో?
నలుగురిలో ఆడితే నలిగిపోతుంది ఏమోనని ..? అదిరిస్తూ బెదిరిస్తూ అమ్మ ఎడమ చేతితో విడవకుండా పట్టుకుంటే పైనున్న బూచోడు ఓర్వలేక అమ్మను తీసుకెళ్లి పోతే..!
ఆ చిట్టి చెల్లి ఎవరి ఎదుట నిలిచి ఏం మాట్లాడాలో అర్థం కాక..!
భయంతో భక్తితో ఎంతమందిలో ఉన్నా తాను ఒంటరిగా ఉండడం మొదలుపెట్టే..!
అన్నలకు భారమై నాన్నకు మోయలేని బరువై ఇంట్లో ఉండి పోయే.!
చూసి.చూసి గంతకు తగ్గ బొంతలా ఒక అయ్య చేతిలో పెట్టే..!
ఆ అయ్యపై తల్లి పెత్తనంతో చెలరేగిపోతూ కోడలు పై ఆంక్షలు విధిస్తూ దూషిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్న తప్పక..
ఎంత కష్టమైనా భరిస్తూ
పిల్లల్ని చూస్తూ కాలం నెట్టుకొస్తూ ఉండగా…
హఠాత్తుగా పైనున్న బూచోడు వచ్చి అత్తను తీసుకెళ్లి పోయే..!
ఆ చిట్టి చెల్లి 20 సంవత్సరాలకు నరక కుంపటిలోంచి విముక్తురాలై
స్వేచ్ఛగా ప్రశాంత జీవనం గడుపుతుండే..!
-బేతి మాధవి లత