ఆనవాళ్లు
నిన్నటి వరకు నువ్వు నేల మీద నెలరాజువి.
నబూతో న భవిష్యత్తు అనదగ్గ కీర్తి ప్రతిష్టలను సాధించుకున్న రారాజువి.
చుట్టూ పరివేష్టించుకొని ఉన్న వందిమాగదులతో
జయ జయ ద్వానాలు అందుకుంటూ నా అంతవాడు
లేడంటూ అతిశయించిన
అల్ప జీవిత అంకురానివి.
నేడు నువ్వు సాధించిన బిరుదులను,
సంపాదించిన ధన, కనక, వస్తు వాహనాలను త్యజించి
సుందర పరిమళభరిత లేపనాలతో నిత్యం పరిరక్షించుకున్న దేహపంజరాన్ని విడిచి
ఒంటరి పక్షిలా ఆత్మ రూపంలో అనంత వాయువుల్లో
విలీనమైన మరుక్షణం మిగిలేది
ఈ ప్రపంచానికి నీ ద్వారా
మిగిల్చేది గుప్పెడు బూడిద
అనే ఆనవాళ్లు మాత్రమే కదా?
మేను మన్నులో మిళితం కావడానికి ముందు మిగిలిన అల్పక్షణాలను మోహబంధాల పంకంలో పొర్లాడుతూ
బతుకు పరమార్ధాన్ని
విస్మరించకుండా ఇకనైనా
ఇరువురు మెచ్చేలా
ఇంపుగా తీర్చిదిద్దుకో..!
-మామిడాల శైలజ.